కృష్ణ శిలలతో ఫ్లోరింగ్


Wed,September 4, 2019 10:54 PM

- శీతాకాలంలో వేడిగా.. వేసవిలో చల్లగా ఉండేలా యాదాద్రిలో నిర్మాణాలు
- దేశంలోనే అరుదైన ఘనత
- పనుల తీరును పరిశీలించిన ఆర్కిటెక్ట్ ఆనందసాయి

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: కృష్ణశిలలతో విగ్రహాలను తయారు చేయడం ఇప్పటి వరకు చూశాం.. కానీ ఇకపై కృష్ణశిలలను ఫ్లోరింగ్‌కు ఉపయోగిస్తున్న అరుదైన ఘనతను యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుడి ఆలయం దక్కించుకున్నది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కృష్ణశిలలను ఫ్లోరింగ్‌గా ఉపయోగించాలన్న కేసీఆర్ నిర్ణయం చరిత్రాత్మకం కానున్నది. సూర్యుడి వెలుతురు తగలని భూగర్భంలో నుంచి వెలికి తీసిన కృష్ణశిలలతో యాదాద్రి యావత్తు కట్టడాలు జరుగుతున్నాయి. కృష్ణశిలలను ఫ్లోరింగ్‌గా వేసే పనులను బుధవారం స్తపతులు, ఆర్కిటెక్టులు ప్రారంభించారు. యాదాద్రి ఆలయ నిర్మాణంలో ఇన్నర్ , ఔటర్ ప్రాకారం అని రెండు ప్రాకారాలను నిర్మాణం చేశారు. ఇన్నర్ ప్రాకారంలో సీఎం కేసీఆర్ సూచనల మేరకు అద్భుతమైన శోభను కలిగించనున్న కృష్ణశిలలను ఫ్లోరింగ్‌గా ఉపయోగించే కడు రమణీయమైన అందాన్ని ఆలయానికి చేకూర్చి పెట్టేందుకు ఈ వారం రోజుల పనులను నిర్దేశించుకున్నారు.

ఎంతో జాగ్రత్తగా కృష్ణశిలను ఫ్లోరింగ్‌గా వేస్తూ వాటిని జాయింట్ చేసి సందులు లేకుండా చేయడం ద్వారా నాణ్యతగా పనులు జరిపిస్తామని ఆర్కిటెక్టు ఆనందసాయి, స్తపతి డాక్టర్ ఆనందాచారివేలు తెలిపారు. కృష్ణశిలల వల్ల ఎండకాలంలో చల్లగా, శీతాకాలంలో వేడిగా ఉండే అరుదైన లక్షణం కలిగి ఉండటంతో భక్తులు హాయిగా భావించేందుకు అనువుగా ఏర్పాటు చేస్తున్నారు. యాదాద్రిలోని ప్రతి కట్టడం కృష్ణశిలతోనే నిర్మాణం అవుతున్నందున ఆలయం మొత్తం ఈ అరుదైన లక్షణంతో భక్తులందరికీ ఎంతో మేలుకలిగించనున్నది. దేశంలోనే ఏ ఆలయంలో కూడా ఇలాంటి ఘనత వహించే లక్షణాలు లేవని స్తపతులు పేర్కొంటున్నారు. దాంతో యాదాద్రి ఆలయంలో చేపట్టిన పనులు భవిష్యత్ శిల్పశాస్త్రానికి దిక్సూచిగా నిలుస్తాయనే భరోసాను స్తపతులు వ్యక్తం చేస్తున్నారు.

పనుల పరిశీలన
యాదాద్రిలో జరుగుతున్న పనులను వేగవంతంగా నిర్వహించడంతో పాటు నిర్దేశించిన సమయంలో జరుగుతున్నాయా లేదా అనే అంశాలను పరిశీలించేందుకు ఆర్కిటెక్టు ఆనందసాయి, స్తపతి ఆనందాచారివేలు పర్యవేక్షణ చేస్తున్నారు. శిల్పులకు నిర్దేశించిన పనులు జరుగుతున్న తీరును వారు పరిశీలించారు. గర్భాలయానికి అమర్చనున్న క్లాడింగ్ పనులను వారు పరిశీలించి శిల్పులకు పలు సూచనలు చేశారు. గర్భాలయానికి అమర్చనున్న పంచ నారసింహుల విగ్రహాలను చెక్కుతున్న శిల్పులతో వారు మాట్లాడి అద్భుతంగా రావడానికి తీసుకోవాల్సిన సూచనలు చేశారు. ఇన్నర్ ప్రాకారం, ఔటర్ ప్రాకారంలో కృష్ణశిలలతో జరిగే ఫ్లోరింగ్ పనులు ఆలయానికి శోభను చేకూర్చుతాయన్నారు.ఆలయ ఉప స్తపతులు సంజయ్, హేమా ద్రి,మొగిలి,మోతీలాల్,రామ్మూర్తి,చిరంజీవి పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...