చౌటుప్పల్‌.. జిగేల్‌


Thu,August 22, 2019 02:44 AM

- రూ.6.13 కోట్లతో చేపట్టిన సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులు పూర్తి -ఇక లోవోల్టేజీ సమస్యకు చెక్‌
-ఇప్పటికే చౌటుప్పల్‌, తంగడపల్లి, దామెర, చింతలగూడెం గ్రామాలకు విద్యుత్‌ సరఫరా
- మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల

చౌటుప్పల్‌, నమస్తేతెలంగాణ: చొరవతో ఎన్నో ఏండ్ల కల సాకారం లో వోల్టేజీ సమస్యతో ఇబ్బందులు పడిన చౌటుప్పల్‌ మున్సిపాలిటీ ప్రజల కష్టాలు తీరాయి. సమైక్య పాలనలో చౌటుప్పల్‌ ప్రజల కరెంట్‌ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అట్లొచ్చి ఇట్ల పోయే మిణుకుమిణుకుమనే కరెంట్‌తో తీవ్ర ఇబ్బందులు పడేవారు. దశాబ్దాలుగా పట్టి పీడించిన సమస్యపై ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న నాథుడు లేడు. అయితే స్వరాష్ట్రంలో పట్టణ ప్రజల కరెంట్‌ కష్టాలు తొలిగిపోయాయి. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చొరవతో రూ.6.13 కోట్లతో చౌటుప్పల్‌ శివారు తంగడపల్లి రోడ్డులో చేపట్టిన సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. దీంతో పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్క గ్రామాలైన తంగడపల్లి, దామెర, చింతలగూడెం, లక్కారానికి ఇక నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా జరుగుతున్నది.

ఇప్పటి వరకు విద్యుత్‌లోవోల్టేజీతో ఇబ్బంది పడ్డ మున్సిపాలిటీ ప్రజలకు ప్రభుత్వం తీపికబురందించింది. దశాబ్దాలుగా సమస్యతో తల్లడిల్లుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. నిత్యం లోవోల్టేజీతో గృహాల్లోని విలువైన వస్తువులు కాలిపోతున్నా కనీస చర్యలు తీసుకోలేదు. దీంతో కరెంట్‌ ఆన్‌ చేయాలంటేనే ప్రజలు బెంబేలెత్తేవారు. కానీ అప్పటి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి చౌటుప్పల్‌, తంగడపల్లి గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్‌ సమస్యను వివరించారు. కరెంట్‌ సమస్యతో గ్రామాల్లో ఉండాలంటేనే బయమేస్తుందని తెలిపారు. వెంటనే స్పందించిన మాజీ ఎమ్మెల్యే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, నూతన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇదే అయ్యే పనేనా అని ఎద్దేవా చేసిన వారికి కనువిప్పు కలిగేలా యుద్ధప్రాతిపాదికన సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులు చేయించాడు. కేవలం రెండేండ్ల వ్యవధిలోనే నూతన సబ్‌స్టేషన్‌ను తంగడపల్లి రోడ్డు పక్కన నిర్మాణం చేయించాడు. దీంతో దశాబ్దాలుగా ఈప్రాంత వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమస్యకు పరిష్కారం లభించింది. విద్యుత్‌ లోవోల్టేతో నరకయాతన అనుభవించిన పట్టణవాసుల కష్టాలు తీరనున్నాయి. చౌటుప్పల్‌ పట్టణ శివారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సబ్‌స్టేషన్‌తో చౌటుప్పల్‌తో పాటు తంగడపల్లి, దామెర, చింతలగూడెం , లక్కారం గ్రామాలకు నిరంతరంగా విద్యుత్‌ సరఫరా జరుగనున్నది. రూ. 6.13 కోట్లతో సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులు చేపట్టారు.

రూ. 6.13 కోట్లతో నిర్మాణ పనులు..
చౌటుప్పల్‌ పట్టణ శివారులోని తంగడపల్లి రోడ్డు పక్కన ఏర్పాటు చేస్తున్న సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. గతంలో అప్పటి ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులను దగ్గరుండి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు విద్యుత్‌శాఖ అధికారులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ వేగంగా నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి రూ. 1.50 కోట్లు మంజూరు చేయించడంతో పాటు గ్రామాల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌, లైన్‌కనెక్షన్‌ తదితర పనులకు అవసరమైన నిధులు రూ. 3.50 కోట్లు మంజూరు చేయించారు. దీంతో మొత్తం రూ. 6.13 కోట్ల నిధులతో సబ్‌స్టేషన్‌ నిర్మాణం పూర్తయ్యింది. ఇప్పటికే ఈసబ్‌స్టేషన్‌ నుంచి తంగడపల్లి, చౌటుప్పల్‌ గ్రామాల్లోని గృహ అవసరాలకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పడ్డ దామెర, చింతలగూడెం గ్రామాలకు కరెంట్‌ సరఫరా జరుగుతున్నది. ఈగ్రామాల్లోని వ్యవసాయానికి సైతం ఈ సబ్‌స్టేషన్‌ నుంచే విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు.

ప్రజల బాధను అర్థం చేసుకొని సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేయించా
నూతనంగా నిర్మించనున్న సబ్‌స్టేషన్‌తో చౌటుప్పల్‌ పట్టణానికి నిరంతరంగా విద్యుత్‌ సరఫరా చేయనున్నారు. ఇప్పటివరకు పట్టణ వాసులు ఎదుర్కొంటున్న లోవోల్టేజీ సమస్యకు శాశ్వతంగా చెక్‌ పడనున్నది. పట్టణంతో పాటు మండలంలోనే మేజర్‌ గ్రామపంచాయతీ అయిన తంగడపల్లి, దామెర, చింతలగూడెంగ్రామాలకు ఈ సబ్‌స్టేషన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా జరుగుతున్నది. ఇప్పటి వరకు పట్టణంలో ఉన్న సబ్‌స్టేషన్‌ నుంచే అన్ని గ్రామాలకు విద్యుత్‌ సరఫరా చేయడం వల్ల తరుచూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడేది. దశాబ్దాలుగా ఈప్రాంత వాసులు ఎదుర్కొంటున్న సమస్య తెలిసిన వెంటనే చలించిపోయా. రెక్కాడితేగాని డొక్కాడని పేద, మధ్యతరగతి ప్రజలు విద్యుత్‌ లోవోల్టేజీతో ఇబ్బంది పడ్డారు. ఎంతో కష్టపడి కొనుగోలు చేసిన సామగ్రి కాలిపోతున్నా ఏమీచేయలేక నరకయాతన అనుభవించారు.ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఆలోచించి రూ. 6.13 కోట్లతో చౌటుప్పల్‌లోని తంగడపల్లి రోడ్డు పక్కన సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయించా. దీంతో చౌటుప్పల్‌, తంగడపల్లి, దామెర, చింతలగూడెం గ్రామాల్లో కరెంట్‌ సమస్యకు చెక్‌పడింది.
-మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...