పాత నేరస్తుడు వీరంగం సృష్టించాడు


Thu,August 22, 2019 02:03 AM

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ :.తనపై గతంలో దాడికి పాల్పడ్డ వ్యక్తులను మట్టుబెట్టాలనే ఉద్దేశంతో వారు నిద్రపోతున్న సమయంలో ఇంటికెళ్లి గొడ్డలితో దాడి చేయడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన యాదగిరిగుట్ట పట్టణంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ నర్సింహరావు తెలిపిన వివరాల ప్రకారం యాదగిరిగుట్ట పట్టణంలోని హనుమాన్‌ టెంపుల్‌ వీధిలో బొమ్మ నిఖిల్‌, నీరజ్‌ అన్నదమ్ములు తమ కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. నెల క్రితం బొమ్మ నిఖిల్‌, నీరజ్‌లు రూ.2లక్షలతో ద్విచక్రవాహనం కొనుగోలు చేశారు. రెండు రోజులు వాహనాన్ని నడిపేందుకు తనకు ఇవ్వాలని యాదగిరిపల్లికి చెందిన పాత నేరస్తుడు ఊట్కూరి కరుణాకర్‌.. నిఖిల్‌, నీరజ్‌లను అడుగగా నిరాకరించారు. దీంతో కరుణాకర్‌ వాహనంపై వెళ్తున్న నిఖిల్‌, నీరజ్‌లను వెంటపడి ఇబ్బందులకు గురిచేయడంతో వారు అతడిని చితకబాదారు.
దీంతో వారిపై కక్ష పెంచుకున్న కరుణాకర్‌ ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకొని సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. కాగా మంగళవారం అర్ధరాత్రి నిఖిల్‌, నీరజ్‌ వారి ఇంట్లో నిద్రిస్తుండగా కరుణాకర్‌ గొడ్డలి తీసుకొని వెళ్లి ఒక్కసారిగా వారిపై దాడికి యత్నించాడు. అతడి నుంచి తప్పించుకున్న నిఖిల్‌, నీరజ్‌లు ఇంట్లోకి వెళ్లి తాళం వేసుకున్నారు. కోపంతో రగిలిపోయిన కరుణాకర్‌ వాళ్ల తండ్రి బొమ్మ నగేశ్‌పై దాడి చేయగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. నగేశ్‌ అరుపులు విని ఇరుగుపొరుగు వారు రాగానే నిందితుడు కరుణాకర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న సీఐ నర్సింహరావు ఘటన స్థలికి చేరుకుని గాయపడిన నగేశ్‌ను చికిత్స నిమిత్తం హైదారాబాద్‌ ఓ ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...