యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ విపక్షాల్లో కలవరం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల మొదలు పరిషత్ ఎన్నికల వరకు విజయాల పరంపర కొనసాగించిన గులాబీ పార్టీని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక తలల పట్టుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెట్టపట్టాలేసుకు తిరిగిన కాంగ్రెస్, టీడీపీలు తలోదారి పట్టాయి. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలు టీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నందున విపక్షాలు పట్టణాల్లో పరువు నిలుపుకొనే పనిలో పడ్డాయి. వరుసగా జరిగిన ఎన్నికలలో పరాజయాలను మూటకట్టుకున్న ప్రతి పక్షాలు రానున్న మున్సిపోల్స్‌లో ఏం చేద్దామని పరేషాన్ లో పడ్డాయి. శాసనసభ, పార్లమెంట్, గ్రామపంచాయతీ, ప్రాదేశిక ఎన్నికలు ఏవి వచ్చినా అధికార టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని అధిక్యంతో ఘన విజయాలను సాధించి గులాబీ జెండాలను రెపరెపలాడించింది. అధికార టీఆర్ఎస్ పార్టీ కారు వేగాన్ని అందుకోవడానికి ప్రతిపక్ష పార్టీలు తమతమ పార్టీల విలువలకు తిలోదకాలు ఇచ్చి టీఆర్ఎస్ను ఎదుర్కొనే ప్రయత్నాలు చేసినా.. ప్రయోజనాలు లేకపోవడంతో త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఒంటరిగా పోటీ చేసిన, ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసిన టీఆర్ఎస్ను ఢీకొనే పరిస్థితులు లేక ఆయా పార్టీల నాయకులంతా మున్సిపోల్స్‌లో ఏం చేద్దామని తమతమ ఆలోచనలు ఆరంభించారు. టీఆర్ఎస్ మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నది. ఆరు మున్సిపాలిటీల పట్టణ సమావేశాలు నిర్వహించింది. ఊపుమీదున్న నాయకులు పోటాపోటీగా బరిలో ఉండేందుకు సిద్ధ్దమంటూ ఎమ్మెల్యేలకు తమ దరఖాస్తులను అందజేస్తున్న పరిస్థితి కన్పిస్తున్నది.
గత అసెంబ్లీ నుంచి జతకలిసిన పార్టీలు..
ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల నుంచే జాతీయ స్థాయిలో బద్ధ శత్రువులైన రాజకీయ పార్టీలు యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం తమతమ పార్టీల నైతిక విలువలను మరిచి ఎన్నికలలో సమైక్యంగా టీఆర్ఎస్ను ఎదుర్కొంటున్నా రు. భువనగిరి,ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాలలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టీడీపీ , వివిధ పార్టీలు మద్దతు పలికారు. అయినా మూడు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులుగా రంగంలో ఉన్న పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్ జయకేతనం ఎగురవేశారు.
తేటతెల్లం చేసిన స్థానిక ఎన్నికలు..
జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏకమైనా టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే ప్రయత్నాలు చేశాయని ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికలు గ్రామ పంచాయతీల ఎన్నికలు స్పష్టం చేశాయి. ఎవరికివారిగా అభ్యర్థులను పోటీలో ఉంచితే టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొలేమనే భయంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏకమై అభ్యర్థులను పోటీలో నిలిపాయి. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో పొత్తు విధానం కొనసాగింది. అయినప్పటికీ జిల్లాలోని అన్ని మండలాల్లోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను భారీ మెజార్టీతో టీఆర్ఎస్ట్ గెలుపొందింది.
మన్సిపోల్స్ పై ఆలోచనలు..
ఒంటరిగా పోటీ చేసిన జట్టుగా కలిసి పోటీచేసిన టీఆర్ఎస్ను ఢీకొనే సత్తాలేకపోవడంతో ప్రతిపక్ష పార్టీల నాయకులు రానున్న మున్సిపల్ ఎన్నికలలో ఏంచేద్దామని ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఉమ్మడిగా పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకం లేక, ఒంటరిగా పోటీ చేసి గెలుపులపై నమ్మ కం లేక ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పరేషాన్లలో ఉన్నట్లు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలే అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికలలో కలిసి వెళ్లడమా..? ఒంటరిగా పోటీచేద్దామా అన్న విషయంపై జిల్లాకు చెందిన ప్రతిపక్షపార్టీలకు చెందిన జిల్లా నాయకులు ఆయా పార్టీల ముఖ్య నాయకులతో సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.