టీఆర్‌ఎస్.. పుల్‌జోష్


Wed,July 17, 2019 12:03 AM

చౌటుప్పల్, నమస్తేతెలంగాణ : చౌటుప్పల్‌లో కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకోవడంతో ఆ పార్టీ దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొన్నది. నేడు హైదరాబాద్‌ని తెలంగాణభవన్‌లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో వీరంతా టీఆర్‌ఎస్‌లో చేరునున్నారు. ఇప్పటికే ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థిగా రేసులో ఉన్న వెన్‌రెడ్డి రాజు సైతం తమ అనుచరులతో సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్‌లో చేరితేనే అందరికీ భవిష్యత్ ఉంటుందని వారికి భరోసా కల్పించారు. ఇప్పటికే కాంగ్రెస్ శాశ్వత సభ్యత్వానికి రాజీనామా చేసిన వీరు సుమారు 1500 మంది కాంగ్రెస్ ముఖ్యనాయకులతో టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

అయోమయంలో కాంగ్రెస్ అధిష్టానం..
ముఖ్య నాయకులు కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతుండడంతో ఆ పార్టీ అధిష్టానంలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే బుజ్జగింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో వారు తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం. అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు వారు ఇప్పటికే ప్రకటించారు. అంతేకాకుండా కాంగ్రెస్‌లో గ్రూప్ తగాదాలు ఎక్కువయ్యాయని, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్వయంగా పార్టీ మారుతానని ప్రకటించడంతోనే కాంగ్రెస్ పరిస్థితిని అంచనా వేయవచ్చని వారు పేర్కొంటున్నారు.

చక్రం తిప్పిన మాజీ ఎమ్మెల్యే ..
మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చక్రం తిప్పడంతో కాంగ్రెస్ ముఖ్య నేతలంతా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అభివృద్ధి చేసి చూపించడంతోపాటు మాటతప్పని నేతగా పేరుతెచ్చుకున్న కూసుకుంట్ల నాయకత్వంలో పనిచేసేందుకు వారంతా ఎప్పటి నుంచో ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాకుండా ఆయన నాయకత్వంలో పనిచేస్తేనే తమకు భవిష్యత్ ఉంటుందని వారు భావించి టీఆర్‌ఎస్ చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.

కాంగ్రెస్ ఖాళీ..
చౌటుప్పల్‌లో కాంగ్రెస్ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొన్నది. ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డితోపాటు ఆ పార్టీ సీనియర్ నాయకుడు వెన్‌రెడ్డి రాజు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ముఖ్యనాయకులు కారెక్కుతున్నారు. చౌటుప్పల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు పోటీ ఇవ్వడం పక్కన పెడితే కనీసం 20 వార్డుల్లో అభ్యర్థులను ఎలా బరిలో ఉంచాలో తెలియక తికమక పడుతున్నారనే గుస.. గుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చేసిన అభివృద్ధి సునామీతో కాంగ్రెస్‌కు గడ్డురోజులొచ్చాయని, ఇప్పుడు అందరూ పార్టీని వీడుతుండడంతో ఇక ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఖతమైనట్లేనని ఆ పార్టీకి చెందిన స్థానిక నాయకులు బహిరంగంగా చెబుతున్నారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్ నాయకులు నైరాశ్యంలో ఉన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...