ప్రమాదవశాత్తు కాల్వలో పడి వ్యక్తి మృతి


Tue,July 16, 2019 11:58 PM

బీబీనగర్ : బంధువుల ఇంటికి వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాల్వలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగాం జిల్లా గూడెల్లి గ్రామానికి చెందిన దూపటి నర్సింహ(45) బతుకు దెరువు కోసం పాపడాల వ్యాపారం నిర్వహిస్తూ తన కుటుంబ సభ్యులతో కలిసి ఎర్రగడ్డలోని రహిమత్‌నగర్‌లో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా శనివారం నర్సింహ భార్య పద్మకు సొంత అక్క కొడుకైన గడ్డం శ్రీనివాస్ ఇటీవలే దుబాయ్ నుంచి రావడంతో చూసివెళ్లేందుకని ద్విచక్రవాహనంపై భార్యతో కలిసి శనివారం సాయంత్రం మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే చీకటి పడటంతో ఇక్కడే ఉంటి ఉదయాన్నే వెళ్లమని పద్మ అక్క జయమ్మ నర్సింహను కోరగా ఉదయాన్నే తనకు పని ఉందని చెప్పి భార్య పద్మను అక్కడే వదిలి రాత్రి 10 గంటల ప్రాంతంలో తన ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. గ్రామ శివారులోని బునాదిగాని కాల్వ వద్దకు చేరుకోగానే అక్కడ ఉన్న మూలమలుపును గమనించకపోవడంతో నేరుగా వెళ్లి వాహనంతోపాటు కాల్వలో పడిపోయాడు. కాల్వ లోతుగా ఉండటంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కాల్వలో పూర్తిగా గుర్రండెక్క ఆకుతో నిండి ఉండటంతో వాహనంతో పాటు మృతదేహం కనిపించకుండా లోపలే ఉండిపోయింది. ఇదిలా ఉండగా... తన భర్త ఇంటికి చేరుకున్నాడా.. లేదా..? అని పద్మ నర్సింహకు ఫోన్ చేయడంతో మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఛార్జింగ్ లేదేమోనని ఇంటికెళ్తే తానే చేస్తాడని అనుకుంది. కానీ ఉదయం వరకు ఇంటికి చేరుకోలేదని తెలియడంతో కంగారుతో తెలిసిన బంధువులకు ఫోన్ చేసి ఆరా తీయగా ఎక్కడా లేడని చెప్పారు. దీంతో వెంటనే ఆదివారం సాయంత్రం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. మంగళవారం అటుగా వెళ్లిన స్థానికులకు కాల్వలో నుంచి దుర్వాసన వెదజల్లుతుండటంతో అనుమానం వచ్చి కాల్వలోకి పరిశీలించి చూడగా నీటిలో పూర్తిగా కుళ్లిపోయి శవం తేలియాడుతుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ప్రమాదస్థలానికి చేరుకున్న పోలీసులు చనిపోయిన వ్యక్తి నర్సింహగా గుర్తించి వెంటనే వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యమంతమయ్యారు. క్రేన్ సహాయంతో వాహనం, మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం భువనగిరిలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సుధాకర్‌గౌడ్ తెలిపాడు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...