హైటెక్ పోలీస్..


Mon,June 24, 2019 01:38 AM

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : లాఠీలు చేతబట్టి.. రివాల్వర్ గురిపెట్టి.. థర్డ్ డిగ్రీ ప్రయోగించి.. నేరాలను అదుపు చేయడం.. నేరస్తుల నోటి నుంచి నిజాలను కక్కించడం.. ఇవన్నీ నిన్నటి మాటలు.. నేటి పోలీస్ వీటన్నింటికీ భిన్నం. సాంకేతిక పరిజ్ఞానం వైపు పోలీస్ శాఖ అడుగులు వేస్తోంది. టెక్నాలజీని ఆయుధంగా చేసుకొని నేరాలను అదుపు చేస్తున్నది. మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నాడు. లాఠీకంటే టెక్నాలజీతోనే మెరుగైన ఫలితాలు రాబట్టుతున్నారు. సీసీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్స్ నేరగాళ్ల గుట్టును రట్టు చేస్తున్నాయి. పోలీస్ వాహనాలకు జీపీఎస్ అమర్చడంతో నిఘా పెరిగింది. నేరాల శాతం తగ్గింది. సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటుడంతో భవిష్యత్తులో హైటెక్ పోలీసు కనిపించబోతున్నాడు.

తెలంగాణ పోలీసు వ్యవస్థలో సమూలమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పోలీసు వ్యవస్థను ప్రజలకు చేరువ చేసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంస్కరణలు చేపట్టారు. గతంలో శిథిలమైన పోలీసు స్టేషన్లను పునరుద్ధ్దరించి కొత్త భవనాలు ఏర్పాటు పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో ఉంది. గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నేరాలతో జిల్లా అట్టుడికిపోతుంటే నింతరం ఎక్కడో ఓ చోట హత్యలు, నేరాలు, ఆస్తి కోసం హత్యలు, మహిళల హత్యలు గొడవలతో కరువు జిల్లా కరుడుగట్టిన జిల్లాగా నేరాలు నిత్యం జరిగేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పోలీసు వ్యవస్థను సీఎం కేసీఆర్ పూర్తిగా ఆధునీకరించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను తీసుకొచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో నేరాలకు తగ్గుముఖం పట్టాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాను రెండు జిల్లాలుగా విభజిచడంతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి యాదాద్రిభువనగిరి జిల్లాను మార్చారు. పోలీస్ విభాగాలు విభజన చేసి, నిత్యం నేరాల వైపు నిఘా పెంచారు. దీంతో రాచకొండ కమిషనరేట్ పరిధి భువనగిరి డివిజన్‌కు ఒక డీసీపీని నియమించడంతో పాటు పర్యవేక్షణ పెరగడంతో నేరాలు సైతం క్రమంగా తగ్గాయి. నేడు సాంకేతిక పరిజ్ఞానంతో నిరంతరం నిఘా ఉంచారు. జిల్లా పోలీసుశాఖ అమ్మల పొదిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చి చేరింది. 24/7 భద్రతా సేవలకు శ్రీకారం చుట్టగా, నేరాలపై నిరంతరం నిఘా పెట్టి సత్వరం చేదించే అవకాశాలు ఏర్పడ్డాయి. చిరునామా వివరాలు సంబంధిత యాప్ లో నిక్షిప్తం చేస్తే చాలు నేరస్తుడి చిట్టా క్షణాల్లో తెలుసుకునే వీలున్నది. పోలీసుల్లో జవాబుదారీతనం పెంచేందుకు వాహనాలకు జీపీఎస్ సిస్టాన్ని అమర్చారు. నిందితులను పసిగట్టేందుకు జాగిలాలను సైతం అందుబాటులోకి సర్కార్ తెచ్చింది.

నేర పరిశోధనలో సాంకేతికతకు పోలీసులు ప్రాధాన్యత...
నేర పరిశోధనలో సాంకేతికతకు పోలీసులు ప్రాధాన్యమిస్తున్నారు. జైల్ రిలీజ్డ్ మేనేజ్‌మెంట్ సిస్టం ను పూర్తిస్థాయిలో వినియోగించుకునే సాంకేతిక పరిజ్ఞానం జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉంది. గతంలో నేరస్తుల సమాచారం ఉండేదికాదు. ఎక్కడైనా... ఏదైనా నేరం జరిగితే వివిధ ప్రాంతాల పోలీసు స్టేషన్లకు వెళ్లి నేరస్తుల సమాచారం సేకరించాల్సి వచ్చేది. ఇప్పుడలా కాదు. నేరం జరిగిన వెంటనే నిమిషాల్లో పూర్తి సమాచారం తెలుసుకునే వీలుంది. ఎవరైనా అనుమానితులు తారసపడితే పేరు.. చిరునామా.. ఇతర వివరాలు ఏమైనా సంబంధిత యాప్‌లో నమోదు చేస్తే చాలు వారి మొత్తం వివరాలు చూపెడుతుంది. గతంలో ఏదైనా నేరంతో సంబంధం ఉందా.. ఎప్పుడైనా జైలు రిజిస్ట్ట్రర్, కోర్టులోగానీ ఏమైనా కేసు ఉందా.. అప్పటికప్పుడు తెలిసిపోతుంది. దేశంలో ఏజైలు, ఏకోర్టులోనైనా పేరు నమోదై ఉంటే వెంటనే తెలిసిపోతుంది. వివిధ నేరాలు చేసి జైలులో ఉన్నవాని కలిసేందుకు వచ్చే వారి వివరాలు, ఫొటోలు కూడా ఆన్‌లైన్‌లో పెడుతారు. నేరస్తులు ఏ నేరం చేసి జైలుకు వెళ్లారు. వారికి కలిసేవారు ఎందుకు వచ్చారు. వారికి నేరస్తులకు సంబంధం ఏమిటనే విషయాలు నిమిషాల్లో తెలిసిపోతాయి. ఆధునిక సాంకేతికత ద్వారా నేరాల పరిశోధన తేలికకానుండగా.. కేసులు త్వరగా పరిష్కారం కానున్నాయి. పోలీసుశాఖను మరింత పటిష్ట పరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం పోలీసు రిక్రూట్‌మెంట్‌ను కూడా భారీస్థాయి లో చేపడుతోంది. పోలీసు ఉద్యోగాల కోసం వేల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకుంటారు. ఉద్యోగం పొందేటప్పు డు అభ్యర్థులకు ఏదైనా నేర చరిత్ర ఉందా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతారు.

కమాండింగ్ కంట్రోల్ సిస్టంతో సీసీ పర్యవేక్షణ...
జిల్లాలో భద్రతా విషయాల్లో తీసుకోవాల్సిన చర్యలతో పాటు దేశంలోని నేరస్తుల పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉం చేందుకు ప్రత్యేకంగా కమాండింగ్ కంట్రోల్ సిస్టంను ఏర్పాటు చేశారు. ఈ కంప్యూటర్ విలువ సమారు రూ. లక్ష వరకు ఉం టుంది. దీనికి నెట్‌తో పాటు ఇతర సాంకేతిక సమస్యలు ఏవీ ఉండవు. ఈ సిస్టం పూర్తిగా స్వతంత్రంగా పనిచేస్తుంది. జిల్లాలోని పోలీసులు పూర్తిస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకునే విధంగా ట్యాబ్‌లు, కంప్యూటర్లను ఏర్పాటు చేసి ఆపరేటింగ్‌పై పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి...
శాస్త్ర సాంకేతిక రంగం ఎంత అభివృద్ది చెందుతుందో.. అదేస్థాయిలో ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి నేను సైతం కార్యక్రమంలో భాగంగా సమస్యాత్మక ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏరాపటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీసులు నజర్ పెట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నేరగాళ్ల ఆట కట్టిస్తారు. ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులకు సమానమని డీజీపీ మహేందర్‌రెడ్డి చెబుతున్న విషయం తెలిసిందే. అందుకే కెమెరాల ఏర్పాటుతో కేసుల పరిశోధన పోలీసులకు సులువవుతుంది. ఒకప్పుడు దాతల సహకారంతో అక్కడక్కడ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు నిధులు కేటాయిస్తుండడంతో చాలా ప్రాంతాల్లో కెమెరాలను బిగిస్తున్నారు. వీటి ఏర్పాటుతో దాదాపు జిల్లాలో నేరాల సంఖ్య చాలా వరకు తగ్గుముఖం పట్టినట్టు చెప్పొచ్చు. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన ఐదేళ్లలోనే రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. దీనికి ఆధునిక పరిజ్ఞానంతోపాటు నంబర్‌వన్ పోలీసు వ్యవస్థ ఏర్పడి నేరరహిత రాష్ట్రంగా గుర్తింపు వచ్చింది. పోలీసులు నిరంతరం నిఘాతో పని చేస్తున్నారు.

అందుబాటులో 24/7 భద్రత సేవలు...
జిల్లాలో 24/7 సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడ ఘటన జరిగినా.. వెంటనే స్పందించే వీలుంది. జాతీయ స్థాయి లో నేరాలకు సంబంధించిన సమచారం, నేరస్తుల వివరాలు అందుబాటులో ఉండడంతో పోలీసులు కేసులను వెంటనే చేదించే అవకాశం ఏర్పడింది. నేరస్తుల సమాచారం ఒక్కసారి యాప్‌లో నమోదు చేస్తే చాలు శాశ్వతంగా ఉండిపోనున్నది. 100 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేసినా.. సమాచారం ఇచ్చి నా.. పూర్తిస్థాయిలో సమస్య పరిష్కారం అయ్యే వరకు ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండునున్నది. ఏ నంబర్ నుంచి 100 ఫోన్‌చేశారో.. వారి లోకేషన్ తెలిసిపోతుంది. వెంటనే ఉన్నతాధికారుల నుంచి ఆ ఏరియాలోని పోలీసులకు సమాచారం అందనున్నది. 100 డయల్ ఫిర్యాదులకు ఎస్సై లేక ఆపైస్థాయి పోలీసు అధికారులు కేసులు పరిష్కరించాల్సి ఉంటుంది. 100 డయల్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుకూ పరిష్కారం చూపాల్సి ఉంటుంది.

నూతన వాహనాలను జీపీఎస్ సిస్టం...
ఏదైనా ఘటన జరిగినప్పుడుగానీ...ఫిర్యాదు వచ్చినప్పుడు గానీ సంబంధిత ఏరియా పోలీసులు ఆ ఘటనా స్థలానికి వెళ్లారా.. లేదా అనేది వెంటనే తెలిసిపోతుంది. జిల్లాలోని 17, పోలీస్ స్టేషన్‌లోని ఎస్సైల వాహనాలకు, 7 సీఐ వాహనాలతో పాటు మొత్తం వాహనాలకు జీపీఎస్ సిస్టంను ఏర్పాటు చేశారు. మొత్తం 51 వాహనాలు అన్ని స్టేషన్లకు కలిపి ఉండగా ముగ్గురు ఏసీపీలకు 3 వాహనాలు ఉన్నాయి. 100 డయల్‌కు వచ్చే ఫిర్యాదు ఆధారంగా లోకేషన్ చూపిస్తూ ట్రాక్ వస్తుంది. 17 స్టేషన్లలోని పెట్రోలింగ్ చేసే వాహనానికి జీపీఎస్‌ను ఏర్పాటు చేశారు. వాహనాలకు సంబంధిత ఏరియాలోని పోలీసులు ఆ స్థలానికి ఎప్పుడు చేరుకున్నారో తెలిసిపోతుంది. అక్కడ జరిగిన వివరాలను వెంటనే ఎంతమంది సిబ్బందిని పంపించాలి. ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలన్ని టాబ్ ద్వారానే అందిస్తుంటారు.

సంబంధిత పోలీసులతో పాటు ఇతర పోలీసు స్టేషన్‌లకు కూడా సమాచారం చేరిపోతుంది. సర్వసాధరణమైపోయిన సోషల్ మీడియాపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఏదైనా అసభ్యకరమైన పోస్టింగ్‌గాని, భద్రతాపరమైన సమస్యలు తీసుకుచ్చేవిగానీ.. ఆశ్లీలమైనవిగాని, రెచ్చగొట్టే విధంగా పోస్టింగులు ఉంటే 24 గంటల్లో తొలగించే విధంగా ఏర్పాట్లు చేశారు. పోస్టింగ్ చేసిన నంబర్ ఆధారంగా ఏపీ అడ్రస్ తీసుకొని సంబంధిత నెట్‌వర్క్ కంపెనీకి తెలియజేసి వాటిని వెంటనే తొలగిస్తారు. బాధ్యులపై నిఘా చేసి పట్టుకుంటారు.

మొబైల్ ప్రింట్ చెకర్..
జిల్లాలో పోలీసుల వద్ద ఉన్న మొబైల్ ప్రింట్ చెకర్ సాయంతో అనుమానితులకు సంబంధించిన సమాచారాన్ని త్వరగా తెలుసుకునే వీలు ఉంటుంది. అనుమానిత సమయాల్లో.. ప్రదేశాల్లో తిరిగే వ్యక్తుల వేలిముద్రలను మొబైల్ ప్రింట్ చెకర్‌పై నమోదు చేస్తే.. ఒకవేళ వారికి గతంలో ఏదైనా నేరాలతో సంబంధాలు ఉంటే వెంటనే వారి సమాచారం తెలిసిపోతుంది.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...