కరువు నేలపై కాళేశ్వరం జలాలు


Fri,June 21, 2019 12:27 AM

-బాహుబలి ప్రాజెక్టుతో జిల్లాలో 2,22,631 ఎకరాలు సాగు
-15వ ప్యాకేజీ కింద గంధమల్ల, 16వ ప్యాకేజీ కింద బస్వాపూర్ జలాశయాలు నిర్మాణం
-గంధమల్ల సామర్థ్యం 4.60 టీఎంసీలు, బస్వాపూర్ 11.39 టీఎంసీలు
-శరవేగంగా కొనసాగుతున్న బస్వాపూర్ పనులు
-60 మీటర్ల ఎత్తు, 13.730 కిలోమీటర్ల పొడవుతో నిర్మాణం
-మొత్తం వ్యయం రూ.1,059 కోట్లు
- ప్రాజెక్టు కోసం 1438 ఎకరాల భూ సేకరణ
యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: ఒక్క గుంట వ్యవసాయ భూమి సైతం వృథాగా ఉండకూడదు. ప్రతి గుంట సాగులోకి రావాల్సిందేనన్న సంకల్పంతో తెలంగాణ సర్కార్ ముందుకు పోతున్నది. కరువునేలను గోదావరి జలాలతో నింపేందుకు కేసీఆర్ సర్కార్ పూనుకున్నది. పూర్తి వర్షాధారిత ప్రాంతమైన యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గ ప్రాంతాలకు గోదావరి జలాలను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం 15వ ప్యాకేజీలో భాగంగా గంధమల్ల జలాశయం,16వ ప్యాకేజీలో భాగంగా బస్వాపూర్ జలాశయం నిర్మిస్తున్నది. ఈ రెండు జలాశయాలతో జిల్లాలో సుమారు 2,22,631 ఎకరాల ఆయకట్టు, నల్లగొండ జిల్లాలో 29,169 ఎకరాలు సాగులోకి రానున్నాయి. గంధమల్ల సామర్థ్యం 4.60 టీఎంసీలు కాగా, బస్వాపూర్‌ది 11.39 టీఎంసీలు. బస్వాపూర్ జలాశయాన్ని ప్రస్తుతం 13.730 కిలోమీటర్ల పొడువు, 60మీటర్ల ఎత్తుతో సుమారు 3977 ఎకరాలలో రూ. 1,059 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.

గంధమల్లతో 63,300 ఎకరాలకు సాగునీరు..
మల్లన్న సాగర్ నుంచి ప్రధాన గ్రావిటీ, సమాంతర కాల్వల ద్వారా 15వ ప్యాకేజీలోని గంధమల్ల జలాశయానికి కాళేశ్వరం జలాలు చేరనున్నాయి. 3916 క్యూసెక్కుల ప్రవాహాన్ని 63,300 ఎకరాల ఆయకట్టు కోసం వినియోగించడంతో పాటు సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామం నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ముల్కలపల్లి వద్ద కందుకూరు వాగు దాటిస్తూ చిట్యాల కాల్వకు నీళ్లు మళ్లించడానికి ప్రధాన, ఉప కాల్వల తవ్వకం 15వ ప్యాకేజీ లక్ష్యం. అయితే ప్రస్తుతం గ్రావిటీ ప్రధాన కాల్వ పనులు నిర్మాణంలో ఉన్నాయి. గంధమల్ల ద్వారా లబ్ధిపొందే జిల్లాలు సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలు. సిద్దిపేట జిల్లాలోని జగదేవపూర్, పీర్లపల్లి గ్రామాల్లో 871 ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలంలోని గంధమల్ల, వీరారెడ్డిపల్లి, కోనాపురం, దత్తాయిపల్లి, ముల్కలపల్లి గ్రామాల్లో 3,790 ఎకరాలు,రాజాపేట మండలంలోని నర్సాపురం, పాముకుంట, జాల, కుర్రారం, బొందుగుల, సోమారం, దూదివెంకటాపురం, బసంతపురం, కాల్వపల్లి, రేణిగుంట, రాజాపేట, పారుపల్లి, రఘునాథపురం, నమిలె, బేగంపేట, చల్లూరు తదితర గ్రామాల్లో 35,131 ఎకరాలు, ఆలేరు మండలంలోని కొలనుపాక, ఆలేరు గ్రామాల్లో 12,420 ఎకరాలు, యాదగిరిగుట్ట మండలంలోని గౌరాయిపల్లి, కాచారం, సాధువెల్లి, మాసాయిపేట గ్రామాల్లో 11,088 ఎకరాలు కలుపుకుని మొత్తంగా జిల్లాలో 63,300 ఎకరాలకు కుడి, ఎడమ ప్రధాన కాల్వలు, డిస్టిబ్యూటరీ కాల్వ ద్వారా సాగునీరు అందే అవకాశం ఉంది.

బస్వాపూర్‌తో 1,59,331 ఎకరాలకు..
నల్లగొండ జిల్లాతో పాటు యాదాద్రి భువనగిరిలోని కరువుపీడిత ప్రాంతాల్లో 1,59,331 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 16వ ప్యాకేజీ పనులు ప్రతిపాదించారు. ప్రధాన కాల్వ పనులు యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలం ముల్కలపల్లి గ్రామం నుంచి ప్రారంభమై నారాయణపూర్ మండలం పోట్లాపూర్ గ్రామం వరకు సాగనున్నాయి. 88 కిలోమీటర్లు గల ప్రధాన కాల్వ, వాటి కుడి ఎడమ కాల్వల తవ్వకం, కట్టడాల నిర్మాణం, డిస్టిబ్యూటరీలు, సబ్ మైనర్ల తవ్వకం, 11.39 టీఎంసీ సామర్థ్యం గల బస్వాపూర్ జలాశయం నిర్మాణం 16వ ప్యాకేజీలోని ప్రధాన అంశాలు.

ఆలేరులో 53,500, భువనగిరిలో 1,05,831 ఎకరాలు సాగులోకి..
కాళేశ్వరం ప్రాజెక్టులోని 16వ ప్యాకేజీలోని బస్వాపూర్ జలాశయం వరకు ప్రతిపాదించిన ప్రధాన కాల్వ ద్వారా యాదాద్రిభువనగిరి జిల్లాలోని తుర్కపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట మండలాలలోని గ్రామాలకు 53,500 ఎకరాలు సాగు నీరు అందుతుంది. బస్వాపూర్ జలాశయం దిగువన ప్రతిపాదించిన 16వ ప్యాకేజీ ప్రధాన కాల్వ, ఐలెవల్ కాల్వల ద్వారా భువనగిరి, వలిగొండ, ఆత్మకూరు(ఎం),రామన్నపేట, బీబీనగర్, పోచంపల్లి మండలాల్లోని పలు గ్రామాలకు 1,05,831 ఎకరాల ఆయకట్టుకు సాగులోకి వస్తుంది. నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లి, చిట్యాల మండలాలలోని 29,169 ఎకరాలకు ఎకరాలకు సాగు నీరు చేరుతుంది.

కొనసాగుతున్న భూసేకరణ..
కాశేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 16వ ప్యాకేజీలో బస్వాపూర్ జలాశయం నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. 13.730 కిలోమీటర్ల డామ్ పొడువు, 60 మీటర్ల డామ్ ఎత్తు నిర్మిస్తున్నారు. ఐ లెవల్, ప్రధాన కాల్వ, కన్వేయర్ సిస్టమ్ ప్యాకేజీల నిర్మాణానికి గానూ 9904 ఎకరాల భూమి కావాల్సి ఉండగా ఇందులో 1438 ఎకరాలు సేకరించగా మరో 8466 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. బస్వాపూర్ జలాశయం నిర్మాణానికి 3977 ఎకరాల భూమి కావాల్సి ఉండగా అందులో 634 ఎకరాల భూమిని సేకరించారు. మరో 3343 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ప్రధాన కాల్వకు గానూ 106 ఎకరాలు కావాల్సి ఉంది. మరో కన్నేయర్ సిస్టమ్ ప్యాకేజీ కి గానూ 5821 ఎకరాల భూమికి 804 ఎకరాల భూమిని సేకరించారు. ఇందుకు గానూ రూ. 1,59,75 కోట్ల వ్యయానికి గానూ 510 కోట్లు నిధులు ఖర్చు చేశారు.

3 గ్రామాలు.. 778 గృహాలు విలీనం..
బస్వాపూర్ జలాశయం నిర్మాణంలో భాగంగా 3 గ్రామాలు విలీనం చేయనున్నారు. ఇందులో భువనగిరి మండలంలోని బి. తిమ్మాపూర్ గ్రామంలో 643 గృహాలు, యాదగిరిగుట్ట మండలంలోని లప్పనాయక్‌తండాలో 75 గృహాలు, తుర్కపల్లి మండలంలోని రుస్తాపూర్ గ్రామంలో చంగల్‌నాయక్‌తండాలో కలిపి మొత్తం 778 గృహాలు జలాశయంలో విలీనం కానున్నాయి.

బతుకులు మారనున్నాయి..
గంధమల్ల రిజర్వాయర్‌తో పరివాహక ప్రాంతంలోని తమ భూములకు నీటి పారుదలతో తమ బతుకులు పూర్తిగా మారనున్నాయి. ఎన్నో ఏండ్లుగా కరువుతో ఉన్న భూములను సాగు చేసుకోలేక పడావుగా వదిలేశాం. రిజర్వాయర్ పూర్తయితే సాగు జలాలతో ఈ ప్రాంతమంత సస్యశామలమై తమ భూముల్లో సిరులు పండుతాయి. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
-గుండ ప్రభాకర్, రైతు, దత్తాయిపల్లి, తుర్కపల్లి

60 ఏండ్ల కల సాకారం
కాళ్వేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు పరవళ్లు తొక్కనుండడంతో తెలంగాణ ప్రజల 60 ఏండ్ల కల సాకారం కానున్నది. ఇక ఈ ప్రాంతం పచ్చగా మారనున్నది. త్వరలోనే కాళేశ్వరం జలాలు గంధమల్ల, బస్వాపూర్ ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టు ప్రాంతానికి అంది జిల్లా సస్యశామలం అవుతుంది. అపర భగీరథుడు, రైతు బాంధవుడైన సీఎం కేసీఆర్‌కు రైతులమంతా రుణపడి ఉంటాం.
-పారుపల్లి సత్తిరెడ్డి, జాల, రాజాపేట

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...