యాదాద్రిలో భక్తుల సందడి


Wed,June 19, 2019 11:43 PM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో నిత్య పూజల కోలాహలం నెలకొన్నది. బుధవారం వేకువజామునకే స్వయంభువులు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించి, తులసి అర్చనలు జరిపారు. అనంతరం లక్ష్మీనరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి శ్రీ సుదర్శన హోమం, శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణం, అలంకార సేవోత్సవాలతో పాటు అష్టోత్తరంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. బాలాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రతి రోజు ఒక్కో రకమైన పూజలు నిర్వహిస్తూ భక్తులు లక్ష్మీనృసింహుడిని కొలుస్తున్నారు. సాయంత్రం అలంకార జోడు సేవలు నిర్వహించారు.

మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. రూ. 100 టికెట్‌పై బాలాలయం ముఖ మండపంలో 10 నిమిషాల పాటు పూజలో పాల్గొనే ఈ పూజలకు ఆదరణ పెరుగుతున్నది. కొండపైన గల శివాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రతాల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. వ్రత పూజల ద్వారా రూ.54, 500 ఆదాయం సమకూరింది. మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు కారంపూడి నర్సింహాచార్యులు, ఉప ప్రధానార్చాకులు కాండూరి వెంకటాచార్యులు ఆశీర్వచనం జరిపారు.

శ్రీవారికి వెండి కలశాల బహూకరణ
శ్రీవారికి 2కిలోల 350 గ్రాముల వెండి కలశాలను నార్కట్‌పల్లికి చెందిన అల్లంపల్లి పద్మావతీకిషన్‌ప్రసాద్ దంపతులు బహూకరించారు. ఇదే గ్రామానికి చెందిన అల్లంపల్లి అరుణ్‌కుమార్ 18 గ్రాముల రెండు బంగారు పుష్పాలను బహూకరించారు. ఈ సందర్భంగా ఆలయ పర్యవేక్షకుడు గజవెల్లి రఘు, సండ్ర మల్లేశ్ వారికి ప్రత్యేక దర్శనం జరిపించి శ్రీవారి శేషవస్ర్తాలను అందజేశారు. ప్రధానార్చకులు కారంపూడి నర్సింహాచార్యులు ఆశీర్వచనం చేశారు.
శ్రీవారి ఖజానాకు రూ. 7, 28, 906 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ.7,28,906 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ. 55, 384, 100 రూపాయల టికెట్‌తో రూ.59,500, కల్యాణకట్ట ద్వారా రూ. 20, 000, గదులు విచారణ శాఖతో రూ. 52,350, ప్రసాదవిక్రయాలతో రూ.3,36,910, శాశ్వత పూజల ద్వారా రూ. 2, 232 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...