భువనగిరి ఖిల్లాలో ... సిరిసాగుకు శ్రీకారం..!


Sun,June 16, 2019 11:46 PM

-ఆరోగ్య జిల్లాయే ప్రభుత్వ లక్ష్యం
-సిరిధాన్యాల సాగు పెంపుపై దృష్టి
- 500 ఎకరాల్లో తృణధాన్యాల సాగుకు ప్రణాళికలు
-రైతులకు ప్రోత్సాహం
- 50 శాతం రాయితీపై విత్తనాలు
యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యతెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నది. అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టి, దీర్ఘకాలిక వ్యాధులను హరించే విధంగా సిరి ధాన్యాల సాగుకు సిద్ధ్దమవుతున్నది. ప్రజలందరికీ మంచి పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు రైతులకు సిరులు కురిపించే సిరి( మిల్లెట్స్) ధాన్యాల సాగుకు శ్రీకారం చుడుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా పంటల సాగును విస్తరించి సామాన్యులకు చవకలో లభించేలా చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా ప్రతి జిల్లాకు 500 ఎకరాలలో సాగు చే యాలన్న లక్ష్యాన్ని నిర్ధేశించగా, రైతులకు అవగాహన కల్పిస్తూ సిరిధాన్యాల ఖిల్లాగా యాదాద్రిభువనగిరి జిల్లాను అగ్రభాగాన నిలిపేందుకు వ్యవసాయ శాఖ అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఎక్కవ కాల బతకడం కన్నా, ఆరోగ్యంగా ఉండాలన్న అవగాహన కలుగుతున్న నేపథ్యంలో ప్రజలు తృణధాన్యాల వైపు దృష్టిసారిస్తున్నారు. ఈ క్రమంలో అందరి ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ దిశగా కృషి చేస్తున్నది. దీర్ఘకాలిక రోగాలకు చెక్ పెడుతూ, ప్రజలందరికీ మంచి పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు అన్నదాతలకు లాభం కలిగేలా సిరి ధా న్యాల సాగుకు శ్రీకారం చుడుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగు ను విస్తరించి సామాన్యులకు చకవలో లభించేలా చర్యలు తీసుకుంటున్నది. అందులోభాగంగా ప్రతి జిల్లాకు 500 ఎకరాలలో సాగు చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించగా, రైతులకు అవగాహన కల్పిస్తూ ఆ దిశగా వ్యవసాయ శాఖ అధికార యం త్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.

సిరి ధాన్యాలతో వ్యాధులకు చెక్...
ఆరోగ్య సిరులుగా పిలువబడే సిరి ధాన్యాలు పోషకాల ఘనులైన ఊదలు, అండుకొర్రలు, అరికెలు, సామలు, సజ్జలు, కొర్ర లు, అవిసెలు ఎంతో ఆరోగ్యాన్నిస్తాయి. అభివృద్ధి క్రమం లో వాటికి మనం దూరమై పోతుండడంతో పాటు రాష్ట్రంలో అధికశాతం వరిపంటలు వేయడం వల్ల ఎక్కువ మంది సన్నబియ్యం, ఇతరత్రా ఆహారాలకు ఆలవాటు పడ్డారు. దీంతో పీచు పదార్థాలు లేని ఆహారం తినడం, శారీరక శ్రమ లేక పో వడం, మానసిక ఒత్తిడి పెరగడంతో రోజురోజుకూ మధుమేహ వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. దీర్ఘకాలిక వ్యాధులను హరించే సిరి ధాన్యాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వివిధ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తృణధాన్యాల వినియోగం పెరిగింది. అన్నంలో చక్కెర నిలువల శాతం ఎక్కువ ఉన్న కారణంగా మధుమేహగ్రస్థులు పీచు పదార్థం ఉన్న తృణధాన్యాలవైపు మొగ్గు చూపుతున్నారు. అవి వినియోగించిన వారిలో బీపీ, షుగర్ అదుపులో ఉంటుందని చెపుతున్నారు.

సామాన్యులకు అందుబాటులోకి...
సిరి ధాన్యాల వినియోగం పెరుగుతున్నప్పటికీ వాటి ధరలు మాత్రం సామాన్యులకు అందుబాటులో లేవు. మార్కెట్‌లో కిలోకు రూ. 80 నుంచి రూ. 110 వరకు కొర్రలు, సజ్జలు, రాగులు, అవిసెలు, ఊదలు, అరికలు లభిస్తుండగా, అండుకొర్రలు రూ. 320 వరకు ఉన్నాయి. ధరలు ఎక్కువగా ఉండడంతో ఆ పంటలు మన రాష్ట్రంలో ఎక్కువగా సాగు చేయడంలేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. సిరి ధాన్యాలతో అనేక రోగాలకు చెక్ పెట్టవచ్చని వైద్యులు సూచిస్తున్న నేపథ్యంలో సర్కారు ఈ పంటల సాగుపై దృష్టి సారించింది. సిరి ధాన్యాలతో అనారోగ్యాలకు చెక్ పెట్టి ఆరోగ్యవంతమైన సమా జం కోసం సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. తృణధాన్యాలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్ధేశంతో పంటల సాగును పెంచాలని నిర్ణయం తీసుకున్నది. గత నెల 24న హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ జయశంకర్ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో విత్తన మేళా కూడ నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన రైతులకు తృణధాన్యాలపై అవగాహన పెంపొందించింది. ఈ మేళాకు జిల్లా నుంచి రైతులు వెళ్లి సబ్సిడీపై విక్రయించిన విత్తనాలను తెచ్చుకున్నారు.

సిరి ధాన్యాల ఖిల్లాగా మార్చేందుకు 500 ఎకరాల్లో సాగు...
తృణధాన్యాల సాగును పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి జిల్లాలో 500 ఎకరాల్లో సిరి ధాన్యాలు పండించాలని లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇచ్చిన లక్ష్యాని కంటే ఎక్కువస్థాయిలో పంటలు సాగు చేసి సిరి ధాన్యాల ఖిల్లాగా యాదాద్రిభువనగిరి జిల్లాను అగ్రభాగాన నిలుపాలన్న సంకల్పంతో వ్యవసాయ శాఖ అధికారులు పక్కా ప్రణాళికలతో ముందుకు పోతున్నారు. మంచి పౌష్టికాహారంతో ప్రజలకు ఆరోగ్యం. రైతుకు సిరిలు కురిపించే ధాన్యాల సాగుపై సమగ్ర అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో కేవలం 10 ఎకరాల్లో మాత్రమే తృణధాన్యాలు సాగు చేస్తుండగా, ఈ సంవత్సరం ప్రభుత్వం ఇచ్చి న లక్ష్యం ప్రకారం 500 ఎకరాలైతే అందుకు రెట్టింపు సాగు చేయాలన్న లక్ష్యంతో అధికారులు ముందుకు పోతున్నారు. ప్రభుత్వం 50 శాతం రాయితీతో విత్తనాలను రైతులకు అందిస్తున్నారు. రూ. 70 లకు కిలో చొప్పున లభించే విత్తనాలు రూ. 35లకే సరఫరా చేస్తుంది.

జీవన ఎరువులతో అధిక లాభాలు
మేళ్లచెర్వు : పంటలో అధిక దిగుబడి కోసం రైతులు పలు పోషక పదార్ధాలు(ఎరువులు) అధికంగా వాడుతుంటారు. దీంతో నేలలోని నత్రజని, భాస్వరం తదితర పోషక పదార్థాలను మొక్కలు వినియోగించుకోలేని స్థితిలో ఉంటాయి. పోషక పదార్థాలను మొక్కలు వినియోగించుకొనే స్థితిలోకి తీసుకొని రావడానికి జీవన ఎరువులు ఉపయోగపడతాయి. వీటిలో నత్రజనిని స్థిరీకరించేవి, భాస్వరం కరిగించి మొక్కలకు అందుబాటులోకి తెచ్చేవి ఉంటాయని మేళ్లచెర్వు మండల వ్యవసాయ అధికారి పెద్ది శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.

నత్రజని జీవన ఎరువులు...
రైజోబియం : నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులలో ఇది ఒకటి. పప్పు ధాన్యపు పంటలు(పెసర, మినుము, శనగ), నూనెగింజల పంటలకు(సోయాచిక్కుడు, వేరుశనగ) ప్రయోజనకరం.
అజటోబ్యాక్టర్, అజోస్పైరిల్లమ్ : అన్నిరకాల కూరగాయల పంటలు, చిరు ధాన్యపంటలు, వాణిజ్య పంటలకు వాడుకోవచ్చు.
నీలి ఆకుపచ్చనారు, అజొల్లా : వరిపంటకు అనుకూలం. వరినాటిన 10రోజుల తర్వాత పొలంలో 4కిలోల నాచును 20కిలోల ఇసుకలో కలిపి పొలంలో సమానంగా పడేటట్లు చల్లాలి. ఈ సమయంలో పొలంలో 2అడుగుల నీరు తప్పక ఉండాలి.

వీటిని వాడడం ఎలా..
-సిఫారసు చేసిన పంటలకు విత్తే అరగంట ముందు విత్తన మోతాదును బట్టి కల్చర్ కలిపి విత్తనాలకు పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.
-అజటోబ్యాక్టీరియా, అజోస్పైరిల్లమ్‌లను విత్తనాలకు పట్టించి విత్తుకోవచ్చు.
భాస్వరపు జీవన ఎరువులు : పాస్పో బ్యాక్టీరియా, మైకోరైజా
-సన్నపు భూముల్లో భాస్వరం అధికంగా లభించే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా ఉపయోగించుకోలేని రూపంలో ఉంటుంది.
-పాస్పో బ్యాక్టీరియా, మైకోరైజా వాడడం వలన భూమిలోని లభ్య భాస్వరాన్ని మొక్కలు వినియోగించుకొనే రూపంలోనికి మారుతాయి.

జీవన ఎరువుల ప్రయోజనాలు...
-జీవన ఎరువులు వాడడం వల్ల రసాయనిక ఎరువులు 25 శాతం తగ్గించవచ్చు.
- వాతావరణంలోని నత్రజనిని భూమిలో స్థిరీకరించి మొక్కలు తీసుకొనే విధంగా చేస్తాయి.
-మొక్కలలో హార్మోన్లు, విటమిన్లు విడుదల చేసి మొక్కల పెరుగుదలకు తోడ్పడతాయి.
-పంట దిగుబడి సాధారణం కంటే 15శాతం పెరుగుతుంది.
-పలు సూక్ష్మజీవుల పెరుగుదలకు, అభివృద్ధికి తోడ్పడతాయి.
-నేల భౌతిక స్వభావాన్ని మెరుగుపరచి భూసారాన్ని కాపాడుతాయి.
- రసాయనిక ఎరువుల వాడడం తగ్గడం వల్ల వాతావరణ కాలుష్యం ఉండదు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...