సబ్సిడీ విత్తనాలు వచ్చేశాయ్‌..


Sat,June 15, 2019 12:20 AM

-1,62,415 హెక్టార్లలో పంట సాగు అంచనా
-అందుబాటులో 6408.10 క్వింటాళ్ల విత్తనాలు
-సిరి ధాన్యాల సాగు పెంచడంపై దృష్టి
-జిల్లాలకు 400 ఎకరాలు లక్ష్యం
-నకిలీ విత్తనాలపై కొరడా
యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : సబ్సిడీ విత్తనాలు వచ్చేశాయ్‌.. సాగుకు సిద్ధమవుతున్న తరుణంలో 6408.10 క్వింటాళ్లు విక్రయించేందుకు రెడీగా ఉన్నాయ్‌.. విత్తనాల కోసం రైతన్న ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో వ్యవసాయశాఖ అధికారులు ముందస్తుగా తెప్పించారు. రోజురోజుకూ సరిధాన్యాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి సాగును 1,62,415 ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు 50 శాతం రాయితీపై విత్తనాలు అందించి ప్రోత్సహించనున్నారు. ఇదే సమయంలో నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని రైతులను హెచ్చరిస్తున్నారు. వానాకాలం సీజన్‌లో వ్యవసాయ పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. దుక్కులు దున్ని అంతా సిద్ధం చేశారు. వానలు ప్రారంభం కాగానే విత్తడానికి రెడీ అవుతున్నారు. సమైక్య పాలనలో విత్తనాల కోసం గంటల తరబడి లైన్‌ కట్టి రైతులు సొమ్మసిల్లిన పరిస్థితులు పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో సర్కార్‌ ముందుస్తు చర్యలు తీసుకుంటున్నది. వానకాలం పంటల సాగుకు ప్రణాళికలు రూపొందించిన అధికారులు జిల్లాకు 6408.10 క్వింటాళ్ల విత్తనాలు తెప్పించారు. జిల్లా కేంద్రంలోని గోదాముల్లో రైతులకు విక్రయించేందుకు సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉంచారు. పాసు బుక్కు తెచ్చి అవసరమున్న విత్తనాలు తీసుకోవచ్చని, మార్కెట్‌లో లభించే నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని వ్యవసాయ శాఖ అధికారులు అన్నదాతలను సూచిస్తున్నారు. మృగశిర కార్తెలో వర్షాలు కురువాల్సి ఉండగా మేఘాలు మొహం చాటేశాయి.

దుక్కులు దున్నిన రైతులు వానలు కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు దుక్కులు దున్ని అంతా సిద్ధం చేసుకున్న రైతులకు విత్తనాల కోసం ఎదురు చూసే ఇబ్బందులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. సమైక్య పాలనలో విత్తనాలు, ఎరువుల కోసం రోజుల తరబడి గోదాంల చుట్టూ తిరిగే వాళ్లు. తీరా అవి దొరక్క రోడ్డెక్కి రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ రైతులకు అన్ని రకాల మేలు చేస్తున్నారు. రైతుబంధు పథకం కింద పంట పెట్టుబడి సాయం ఎకరానికి రూ.10 వేలు, రైతుబీమా లాంటి పథకాలే కాకుండా సబ్సిడీ విత్తనాలు సకాలంలో అందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడూ రైతు విత్తనాలు, ఎరువుల కోసం లైను కట్టలేదు. నేరుగా గోదాంకు వచ్చి డబ్బులు చెల్లించడమే ఆలస్యం రైతుల చేతికి విత్తనాల సంచి అందించారు. ఇలా ఐదేండ్లపాటు రైతుల ఇబ్బందులు తీరుస్తూ వస్తున్న ప్రభుత్వం ఎప్పుడూ వర్షాల పడకముందే విత్తనాలు అందుబాటులో ఉంచడంతో అన్నదాతల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది.

జిల్లాకు 1,62,415 హెక్టార్లలో పంటసాగు..
వానకాలం సీజన్‌లో ఏఏ పంటలు వేయాలో వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలో మొత్తం 1,62,415 హెక్టార్లలో పంటలు సాగుకు అంచనాలు వేశారు. అందులో 67,492 హెక్టార్లతో పత్తి, 51,405 హెక్టార్లలో వరి, 2268 హెక్టార్లలో మొక్కజొన్న, 1128 హెక్టార్లలో జొన్న, 286 హెక్టార్లలో పెసర, 31 హెక్టార్లు మినుములు, 10183 హెక్టార్లలో కందులు, 7 హెక్టార్లతో నువ్వులు, 8001 హెక్టార్లతో ఇతర పంటలను సాగు చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. అందుకు అవసరమయ్యే విత్తనాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. మొత్తం 6408.10 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా వేశారు. 5317 క్వింటాళ్ల వరి, 312 క్వింటాళ్ల మొక్కజొన్న, 150 క్వింటాళ్ల కందులు, క్వింటాళ్ల మినుములు, 182 క్వింటాళ్ల పెసర, 50 క్వింటాళ్ల నువ్వులు, చిరు ధాన్యాలు 47.10 క్వింటాళ్ల విత్తనాలు రాయితీపై అందించేందుకు జిల్లా కేంద్రంలోని గోదాంలో సిద్ధంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.

సిరిధాన్యాలపై దృష్టి..
రోజురోజుకూ సిరిధాన్యాల వినియోగం పెరుగుతున్నందున వాటి సాగుపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి జిల్లాకు కనీసం 400 ఎకరాల్లో సిరి ధాన్యాలు సాగు చేయాలని టార్గెట్‌ పెట్టింది. గతంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో కేవలం 10 ఎకరాల్లోనే సిరిధాన్యాలు పండించే వారు. వాటికి డిమాండ్‌ పెరుగుతున్నందున నాలుగు వందల ఎకరాలకు పెంచడానికి వ్యవసాయ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వీటి విత్తనాలు రూ.70 కిలో చొప్పున మార్కెట్‌లో లభిస్తుండగా ప్రభుత్వం యాబై శాతం సబ్సిడీతో రూ.35కే కిలో చొప్పున రైతులకు అందిస్తున్నది. బీపీ, షుగర్‌, క్యాన్సర్‌ లాంటి వ్యాధులున్న వారంతా సిరిధాన్యాలు తింటున్నారు. వీటి రేటు కిలోకు రూ.80 నుంచి రూ.110 వరకు ధర ఉన్నందున సామాన్య ప్రజలకు కొంతభారంగా మారింది. ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ఎక్కువ స్థాయిలో పండించాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ సర్కార్‌ ప్రతి జిల్లాకు నాలుగు వందల ఎకరాలలో రాగులు, అండుకొర్రలు, కొర్రలు, ఊదలు, అరకలు పండించాలని లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తున్నది. అందుకే యాబై శాతం సబ్సిడీతో రైతులకు విత్తనాలు అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...