భువనగిరి పట్టణంలోఅన్నపూర్ణ క్యాంటిన్


Thu,June 13, 2019 12:22 AM

భువనగిరి టౌన్ : పేదల, కార్మికుల కడుపు నింపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన అన్నపూర్ణ క్యాంటిన్ అతిత్వరలో భువనగిరి పట్టణంలోని పట్టణ పోలీస్‌స్టేషన్ ఎదుట ప్రారంభం కానున్నది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండు, మూడు రోజుల్లో దీన్ని ప్రారంభించనున్నారు. హరే రామా హరే కృష్ణ స్వచ్ఛంద సంస్థ నిర్వహణలో నడిచే ఈ క్యాంటిన్ ప్రతి రోజు 300 మంది పేదల కడుపు నింపనున్నది. కేవలం రూ.5కే భోజనం అందించి వారి కడుపునింపాలనే ఉద్దేశంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2014 మార్చి 2న అన్నపూర్ణ క్యాంటిన్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ క్యాంటిన్ల ద్వారా లబ్ధిదారులకు అతి తక్కువ ధరకే నాణ్యమైన అన్నంతో పాటు ఒక కూర, సాంబారు, పెరుగుతో కూడిన భోజనం అందిస్తారు. ప్లేటు భోజనం తయారీకి రూ.24.25 ఖర్చవుతుండగా ఇందులో లబ్ధిదారుల నుంచి రూ.5 వసూలు చేస్తున్నారు. ఆయా మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు మిగిలిన రూ.19.25 పైసలు భరిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్నపూర్ణ క్యాంటిన్లు సక్సెస్ కావడంతో ఇప్పుడు వీటిని మున్సిపాలిటీల్లోనూ ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగానే భువనగిరిలో అన్నపూర్ణ క్యాంటిన్ ప్రారంభం కానున్నది. మొదటగా 300 మందికి భోజనం అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా లబ్ధిదారుల నుంచి వచ్చే ఆదరణను బట్టి ఆ సంఖ్యను పెంచే అవకాశం సైతం ఉన్నది. ఈ అన్నపూర్ణ క్యాంటిన్ నిర్వహణతో మున్సిపాలిటీపై సంవత్సరానికి రూ.10లక్షల అదనపు భారం పడనున్నది. క్యాంటిన్ల నిర్వహణను హరే రామా హరే కృష్ణ స్వచ్ఛంద సంస్థ చూస్తోంది.
పేదలు, కార్మికులకు మేలు..
జిల్లా కేంద్రమైన భువనగిరికి వివిధ పనుల నిమిత్తం పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారు. అంతేకాకుండా వలస కూలీలుగా పట్టణ శివారు గ్రామాల నుంచి ఉపాధి కోసం వస్తారు. పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనే గల జగదేవ్‌పూర్ చౌరస్తా వలస కూలీల అడ్డాగా ఉంది. కాగా అడ్డా పక్కనే అన్నపూర్ణ క్యాంటిన్ ఏర్పాటు కానుండటంతో పేదలు, అడ్డకూలీలు, కార్మికులకు మేలు జరుగనున్నది.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...