బడీడు పిల్లలను బడిలో చేర్పించాలి


Thu,June 13, 2019 12:21 AM

భువనగిరి, నమస్తే తెలంగాణ : బడిబాట కార్యక్రమం ద్వారా బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ అనితారామచంద్రన్ పిలుపునిచ్చారు. ఈ నెల 14 నుంచి 19వరకు ఐదు రోజుల పాటు జిల్లాలో నిర్వహించే బడిబాట కార్యక్రమంపై జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, సంక్షేమ శాఖల అధికారులు, మండల విద్యాధికారులతో బుధవారం కలెక్టర్ తన చాంబర్‌లో సమావేశమై మార్గదర్శకాలు వివరించారు. ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి 11గంటల వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ బడుల్లో నమోదు పెంచడంతో పాటు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదు సంవత్సరాలు పైబడిన పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ సూచించారు. ఇందుకు కమ్యూనిటీల భాగస్వామ్యంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు.

పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్య కమిటీలు వెంటనే సమావేశ ప్రజలకు అవగాహన కార్యక్రమాల నిర్వహణపై ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. పాఠశాల ప్రత్యేకతలు, ఎస్‌ఎస్‌సి ఫలితాలు, 7వ తరగతి నుంచి 12 తరగతి వరకు బాలికలకు ఉచితంగా అందజేస్తున్న ఆరోగ్య, హైజెనిక్ కిట్స్ పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం ఇతర మౌలిక సౌకర్యాలు, ఎస్సీ, ఎస్టీలకు ఉపకార వేతనాలు, ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. బడిబాట కార్యక్రమంలో స్థానిక స్వయం సహాయక సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అంగన్‌వాడీలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు. బడిబాట కార్యక్రమం కట్టుదిట్టమైన ప్రణాళికలతో క్షేత్రస్థాయిలో విజయవంతం అయ్యేలా అధికారులు సమన్వయంతో పాటుపడాలని కోరారు. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో 10 మంది లోపు, జడ్పీ, ఉన్నత పాఠశాలల్లో 100 మందిలోపు పిల్లలు ఉన్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో విద్యాశాఖ, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...