బడికి పోదాం రా..


Tue,June 11, 2019 11:41 PM

-14 నుంచి బడిబాటకు కార్యాచరణ
-ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ
యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : వేసవి సెలవులు ముగియనుండడంతో నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం కానున్నాయి. ప్రారంభానికి ముందే తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే డీఈవో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యావ్యవస్థను మరింత పటిష్ట పరిచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పాఠశాల భవనాలలో మౌలిక వసతులు ఏర్పాటు రాజీ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. గదులలో కావాల్సిన డెస్క్ బెంచీలు అందుబాటులో ఉంచారు. మరుగుదొడ్లు, నీటి సదుపాయాలు కల్పించారు. పాఠశాలల ప్రారంభం సందర్భంగా శుభ్రపరిచి మామిడి తోరణాలతో అలంకరించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు చేరుకోగా ఈ నెల 14 నుంచి బడిబాట నిర్వహించనున్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు అందుబాటులోలేని పాఠశాలలో విద్యావలంటీర్లను నియమించేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. త్వరలో భర్తీకి సంబంధించిన ఆదేశాలు వెలువడనున్నాయి.

పాఠశాలలకు చేరుకుంటున్న పాఠ్యపుస్తకాలు
జిల్లాకు 3,39,962 పాఠ్యపుస్తకాలు అవసరం ఉండగా ఇప్పటి వరకు 3,12,950 పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. ఇంకా 27,012 పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. 10వ తరగతి తెలుగు మీడియం జీవశాస్త్రం, పదోతరగతి తెలుగు మీడియం గణితం రావాల్సి ఉంది. ఉర్దూ మీడియంలో 6, 10 తరగతులకు సైన్స్, గణితం, సోషల్ స్టడీస్ టైటిల్స్ రావాల్సి ఉంది. ఎంఈవోలు, హెచ్‌ఎంలు, ప్రిన్సిపాల్‌లు, స్పెషల్ ఆఫీసర్లను తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే జిల్లా విద్యాధికారి రోహిణి ఆదేశాలు జారీ చేశారు. మండల కేంద్రాలకు ఇప్పటి వరకు సుమారు 2 లక్షల పుస్తకాలు చేరవేశారు. ఈ నెల 10, 11 తేదీల్లో పాఠశాలలకు పంపించే కార్యక్రమం కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 101 టైటిల్స్ జిల్లా కేంద్రానికి చేరుకోగా పంపిణీ చేసే కార్యక్రమం శరవేగంగా జరుగుతున్నది.

నేటి నుంచి ప్రారంభం
ఈ నెల 12న పాఠశాలలు ప్రారంభిస్తున్నందున ముందురోజే తరగతి గదులు, ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించింది. ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చేర్చించేందుకు ఈ నెల 14 నుంచి ప్రారంభించనున్న బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వం అందిస్తున్న పాఠ్యపుస్తకాలు ప్రతి విద్యార్థికి అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేయడంతో అందుకు ఏర్పాట్లు చేపట్టారు. బడి ఈడు కలిగిన పిల్లల వివరాలు అందుబాటులో ఉంచుకుని పాఠశాలలో చేర్పించనున్నారు.

జిల్లాలో 498 ప్రభుత్వ పాఠశాలలు
జిల్లాలో 498 ప్రాథమిక, 127 ప్రాథమికోన్నత, 293 జడ్పీహెచ్‌ఎస్ ఉన్నాయి. వీటిలో 1,34,557 మంది విద్యార్థులు ఉన్నారు.
ప్రత్యేక కార్యచరణ
డ్రాప్ అవుట్ విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలనే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆడపిల్లలను సమీప కేజీబీవీలో చేర్పించాలని మగపిల్లలను అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌లో చేర్పించాల్సిన అవసరం ఉన్నది. పాఠశాలలకు ఫీడింగ్ ఉన్న పీఎస్, యూపీఎస్, అంగన్‌వాడీ కేంద్రాలు, హైస్కూల్‌లను పీఎస్, యూపీఎస్‌ల అంగన్‌వాడీ టీచర్, పీఎస్, యూపీఎస్ ప్రధానోపాధ్యాయుల నుంచి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నేరుగా విద్యార్థుల జాబితా తీసుకుని వారితో చర్చలు జరిపి ఆ విద్యార్థులందరూ పాఠశాలలోనే ప్రవేశం పొందే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలను అలంకరించి విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకర్షించే విధంగా చూస్తున్నారు.

289 విద్యావలంటీర్లకు ప్రతిపాదనలు
2018-19 విద్యా సంవత్సరానికి గానూ ప్రభుత్వం విద్యావలంటీర్ల నియామకం కోసం జీవో నంబర్ 2ను విడుదల చేసింది. తద్వారా జిల్లాలో 202 వలంటీర్ల నియామకానికి చర్యలు చేపట్టింది. అర్హులైన వారిని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు నియమించుకోవాలని సూచించింది. ఎస్‌జీటీ పోస్టులకు డీఈడీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు బీఈడీ, భాషా పండిట పోస్టులకు పండిట్ శిక్షణ కలిగి ఉండాలని సూచించింది. అనంతరం గత సంవత్సరం జూలై 25 నుంచి నియామక ప్రక్రియను చేపట్టింది. అదే మాదిరిగా 2019-20 విద్యా సంవత్సరానికి కూడా జిల్లాలో 289 మంది విద్యావలంటీర్లను నియమించుకోవాల్సి అవసరం ఉందని జిల్లా విద్యాధికారులు విద్యాశాఖకు ప్రతిపాదనలు సిద్దం చేసి అధికారులకు పంపింది. ఈ నెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అనంతరం వీటి భర్తీ కోసం ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది.

వినూత్నంగా విద్యాసంవత్సరం
2018-19 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను అధిగమించి విద్యార్థులకు నష్టం కలుగకుండా 202 మంది విద్యా వలంటీర్ల పోస్టులను భర్తీ చేశాం. వీటికి నెలకు రూ. 12,000 చొప్పున వేతనం ప్రభుత్వం అందజేసింది. కాగా గత సంవత్సరం డిసెంబర్‌లో విద్యావలంటీర్ల సంఘం నాయకులు తమనే విద్యావలంటీర్లుగా ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసి కొనసాగించాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు గత మార్చిన విద్యావలంటీర్లను రెన్యూవల్ చేసి కొనసాగించడం న్యాయపరమైనదని తీర్పునిస్తూ ప్రభుత్వానికి సూచించింది. దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఈ విద్యా సంవత్సరానికి అవసరమైన విద్యావలంటీర్ల సంఖ్యను సబ్జెక్ట్‌ల వారీగా ప్రతిపాదనలను పంపాం. భర్తీకోసం ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అదేశాలు రాలేదు. గతేడాది చేసిన విద్యావలంటీర్లను అదేవిధంగా కొనసాగించాలనే దానికి సంబంధించి కూడా ఎలాంటి సూచనలు కూడా అందలేదు.
- ఆర్. రోహిణి , డీఈవో యాదాద్రిభువనగిరి జిల్లా

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...