సాగుకు సన్నద్ధం


Mon,May 27, 2019 02:49 AM

-రైతుబంధు ధీమాతో ముందుకు
-రోహిణీ కార్తె ప్రవేశంతో పనులు మొదలు
-ఫర్టిలైజర్, పెస్టిసైడ్ దుకాణాల వద్ద సందడి

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : రోహిణీ కార్తె ప్రారంభంలో వరినారు పొస్తే సకాలంలో నాట్లు పడి, పంట ముందుగానే కోతకు వచ్చే అవకాశం ఉండడంతో వానాకాలం సాగుకు సై అంటున్నారు. యాసంగి దిగుబడులు, రైతుబంధు అందిస్తున్న ధీమాతో మరింత ఉత్సాహంగా ఉన్నారు అన్నదాతలు. ఇప్పటికే చాలా మంది రైతులు దుక్కులు దున్ని, నారు మడులు సిద్ధం చేసుకున్నారు. శనివారం కార్తె ప్రవేశించడంతో నారు పోసుకునేందుకు రెడీ అయ్యారు. పత్తి, మొక్కజొన్న, మిర్చి, ఇతర పంటలు సాగు చేసుకునే రైతులను భూములను లోతు దుక్కులు చేయిస్తున్నారు. గతంలో ఆయిటి పూనిందంటే దుక్కులు దున్నుకోవాలంటే చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు పడేవారు. పెట్టుబడికి ఏ వడ్డీ వ్యాపారినో ఆశ్రయించేవారు. పాస్‌బుక్కులు కుదువబెట్టి బ్యాంకుల్లో పంట రుణం కోసం చెప్పులరిగేలా తిరిగేవారు. తెలంగాణ ఏర్పడినంక సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగ చేయాలనే సంకల్పంతో పెట్టుబడిసాయం అందిస్తుండగా...రైతుల్లో నూతనోత్తేజం కనిపిస్తోంది. పంట పెట్టుబడి కోసం రైతులకు రెండు విడుతల్లో ఎకరానికి రూ.10 వేల ఆర్థిక సాయం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి.

అధికారుల అంచనా ప్రకారం సాగు ఇలా..
జిల్లాలోని 17 మండలాల్లో 1,85,763 హెక్టార్లలో పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. వరి సాధారణ సాగు విస్తీర్ణం 56,189 హెక్టార్లుకాగా 60 వేల హెక్టార్లలో సేద్యం చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పత్తి 74,632, కందులు 7,295 హెక్టార్లలో సాగు చేయనున్నట్లు అంచనా. గత వానాకాలంలో 1.10 లక్షల హెక్టార్లలో వరి, మెట్ట పంటలు సాగు చేశారు. ఇప్పుడు అదనంగా 41 వేల హెక్టార్లలో అదనంగా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని అధికారులు లెక్కకట్టారు. గతంలో 35,000 హెక్టార్లల్లో వరి, 60,000 హెక్టార్లల్లో పత్తి, 5,000 హెక్టార్లలో కంది వేస్తారని అంచనాలు రూ పొందించారు. 2016తో పోల్చితే 20 శాతం అధికంగా సాగైంది.

అందుబాటులో ఎరువులు, విత్తనాలు
సీజన్ ప్రారంభంలోనే తొలకరి జల్లులు కురిసే అవకాశం ఉండడంతో వ్యవసాయాధికారులు అప్రమత్తమవుతున్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రధాన పంటలకు సంబంధించి విత్తనాలు సిద్ధం చేశారు. వరి 5,900 క్వింటాళ్లు, జొన్నలు 83 క్వింటాళ్లు, మొక్కజొన్నలు 489 క్వింటాళ్లు, కందులు 784 క్వింటాళ్లు, పెసర్లు 271 క్వింటాళ్లు, వేరుశనగ 283 క్వింటాళ్లు, మూడున్నర లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. యూరియా 42,230 టన్నులు, డీఏపీ 22,435 టన్నులు, ఎంవోపీ 13,153 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 27,015 టన్నుల ఎరువులకు ప్రణాళిక సిద్ధం చేశారు.

రైతుబంధుతో రైతుల ఇంట్లో ఆనందం
యాసంగిలో రైతన్నకు పెట్టుబడికి ఇబ్బందులు ఉండవద్దని సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రైతుబంధు పెట్టుబడిసాయంతో రైతుల ఇంట్లో ఆనందాన్ని నింపాయి. అత్యంత టెక్నాలజీ హంగులతో తయారు చేసిన డిజిటల్ పట్టాదారు పాస్ పుస్తకం, పెట్టుబడి నగదుతో రైతులు పంట పెట్టుబడికి కావల్సిన ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఆలేరు నియోజక వర్గంలోని ఫర్టిలైజర్, ప్రభుత్వ ఎరువుల కొనుగోలు కేంద్రాల్లో సందడి వాతావరణం నెలకొన్నది. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఎరువులు, జీలుగు, జనుములు, వరి విత్తనాలు అందుబాటులో ఉంచారు. రైతుబంధు పథకం పుణ్యమా అని ముందస్తుగానే కొనుగోలు చేస్తున్నారు. మోటకొండూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ వంగపల్లి ఆధ్వర్యంలో 1010 వరి వంగడాలు, ఐఆర్64, బీపీటీ, ఆర్‌ఎన్‌ఆర్, జేజీఎల్, ఎరువులు 2828, డీఏపీ లను అందుబాటులో ఉంచారు.

మండలంలో 40370 ఎకరాలు విస్తీర్ణంలో ఉండగా గతేడాది వానాకాలంలో 25430 ఎకరాలు సాగులో వచ్చింది. ఈ ఏడాది 30 వేల ఎకరాలకు పైగా సాగుకు రావచ్చునని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. యాదగిరిగుట్ట మండలంలో మొత్తం 12 వేల ఎకరాలు సాగులోకి వచ్చింది. ఈ ఏడాది పెరిగే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనాకు వచ్చారు. రాజాపేట మండలంలో 32 వేలు ఎకరాల విస్తీర్ణంలో 17562 ఎకరాలు విస్తీర్ణం సాగుచేయగా ఈ ఏడాది 22 వేల ఎకరాల వరకు సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆత్మకూరు(ఎం) మండలంలోని 40,870 ఎకరాల వ్యవసాయ విస్తీర్ణం సాగుకు వచ్చింది. గతేడాది 23వేల ఎకరాలు సాగుకు రాగా ఈ సారి 30 ఎకరాలు ఎకరాలు విస్తీర్ణం సాగుకు రానుందని అధికారులు తెలిపారు. తుర్కపల్లి మండలంలోని మొత్తం 4230 ఎకరాల విస్తీర్ణంలో 1712 హెక్టార్ల వరి, 60 హెక్టార్ల జొన్నలు, 169 హెక్టార్లలో కూరగాయాల సాగు చేశారు. వరి పంటతో పాటు ఇతర కూరగాయలు గణనీయంగా పెరిగే అవకాశం ఈసారి ఉంది.

1.50 - 1.70 లక్షల ఎకరాలకు పత్తి ప్రణాళిక
జిల్లాలో ప్రధాన పంటల్లో పత్తి ఒకటి. దీనిని అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. జిల్లాలో పత్తి సాధారణ విస్తీర్ణం 1.50 లక్షల ఎకరాల నుంచి 1.70 లక్షల ఎకరాలకు పెంచే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రతి ఏటా సాధారణ సాగు విస్తీర్ణానికి మించి మరో 10 వేల హెక్టార్లకు సరిపోయే విధంగా పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటారు. గతేడాది ప్రభుత్వాలు పత్తి సాగును తగ్గించాలని సూచించటంతో సాగు విస్తీర్ణం పడిపోయింది. ఈ ఏడాది జిల్లాలో పత్తి సాగు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

విత్తన ప్యాకెట్లు మూడు లక్షలు
జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉండటంతో అందుకు అవసరమైన పత్తి విత్తనాలను అందుబాటులోకి తెచ్చేవిధంగా వ్యవసాయశాఖ చర్యలు చేపట్టింది. జిల్లాలో 3 లక్షల విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇప్పటికే పలు కంపెనీలు పత్తి విత్తనాలను మార్కెట్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉంచాయి. జిల్లాలోని 17 మండలాల్లో బోల్‌గార్డ్ బీటీ విత్తనాలు విక్రయించడానికి 90 మంది డీలర్లకు లైసెన్సులున్నాయి. ఫిక్స్‌డ్ రేటుపైన వీటిని విక్రయించనున్నారు. విత్తన విక్రయానికి ఏ సమస్య తలెత్తకుండా కొత్తగా లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వ్యవసాయ శాఖ అనుమతి ఇస్తోంది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో విత్తనాలను అందుబాటులో ఉండేవిధంగా చర్యలు చేపట్టారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...