ఐదో విడుత హరితహారానికి సర్వం సన్నద్ధం


Sat,May 25, 2019 11:25 PM

-జిల్లాలో 2.48 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
-డీఆర్‌డీఏ లక్ష్యం 1.75, అటవీశాఖ లక్ష్యం 73 లక్షలు
-వన్ జీపీ- వన్ నర్సరీ స్ఫూర్తితో మొక్కల పెంపకం
-ప్రజలను భాగస్వాములను చేస్తున్న యంత్రాంగం
-టేకు, పండ్ల మొక్కలకు ప్రాధాన్యం
యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సిద్ధమవుతున్నది. ఇప్పటికే జిల్లాలో నాలుగు విడుతల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటగా, ఐదో విడుత హరితహారంలో భాగంగా 2.48 కోట్ల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 1.75 లక్షలు, అటవీశాఖ ఆధ్వర్యంలో 73 లక్షల మొక్కలు పెంచుతున్నారు. వన్ జీపీ- వన్ నర్సరీ స్ఫూర్తితో మొక్కల పెంపకం చేపట్టిన అధికారులు.. వర్షాలు కురిసిన వెంటనే మొక్కలు నాటేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే శాఖల వారీగా లక్ష్యాన్ని నిర్ణయించగా.. మొక్కలు నాటే ప్రాంతాలను ఎంపిక చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సిద్ధమవుతున్నది. జిల్లాలో 2.48 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా అధికారులు ముందుకెళ్తున్నారు. ఇందులో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 1.75 లక్షలు, అటవీశాఖ ఆధ్వర్యంలో 73 లక్షల మొక్కలు పెంచనున్నారు. వన్ జీపీ- వన్ నర్సరీ స్ఫూర్తితో అధికారులు మొక్కల పెంపకం చేపడుతున్నారు. ఈ బృహత్తరకార్యక్రమలో ప్రజలను సైతం భాగస్వాములను చేయాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎప్పటిలాగే ఈ సారి కూడా హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారన్నారు. అయితే ఈ సారి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నర్సరీని ఏర్పాటు చేశారు. ఆ గ్రామానికి అవసరమైన మొక్కలను ఆ నర్సరీ నుంచే తెప్పించి నాటేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా డీఆర్‌డీవో ఇప్పటికే పనులు చేపట్టింది.

పలు రకాల మొక్కలు...
గతేడాది కేవలం 16 మండలాల్లో 16 నర్సరీల్లో మొక్కలను పెంచగా ఈ ఏడాది ప్రతి గ్రామ పంచాయతీ ఒక నర్సరీని ఏర్పాటు చేశారు. టేకుతో పాటు వెదురు, దానిమ్మ, నిమ్మ, జామ, సీతాఫలం, బొప్పాయి, కర్జూరం, నిద్రగన్నేరు, మల్బర్ వేప, గానుగ, వేప, కదంబ, గుల్‌మొహర్, మారేడు, స్పాంథోడియా, కరివేపాకు, గోరింట, ఉసిరి, చింత, రేగు, ఈత, నేరేడు తదితర మొక్కలు ఈ నర్సరీల్లో పెంచుతున్నారు. ఒక్కో నర్సరీలో ఒక వన సేవకుడితో పాటు 10 నుంచి 15 మంది ఉపాధిహామీ కూలీలను నియమించి ఈ మొక్కల పర్యవేక్షణను చేపట్టారు.

32 లక్షల టేకు మొక్కలు..
డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిర్వహించే నర్సరీల్లో గతేడాదిలాగానే 32 లక్షల టేకు మొక్కలు పెంచుతున్నారు. ఈ టేకు వృక్షజాతి అంతరించిపోయే దశలో ఉండడం, గృహ, ఫర్నీచర్ అవసరాలతో పాటు, ఎక్కువ విలువ ఉండడంతో టేకు మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నది. ఎలాంటి వాతావరణం లోనైనా టేకు మొక్కలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందునే టేకు మొక్కలకు ప్రాధాన్యం ఇస్తున్నది. టేకు మొక్కలు మినహాయిస్తే మిగతా పూల మొక్కలు, పండ్ల మొక్కలతను పాఠశాలలు, దవాఖాన, ప్రధాన రోడ్ల వెంట నాటనున్నారు.


వన్ జీపీ-వన్ నర్సరీకి విత్తనాలు..
జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ(డీఆర్‌డీవో) ఆధ్వర్యంలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నర్సరీ ఏర్పాటు చేశారు. దీని ద్వారా సకాలంలో మొక్కలు నాటడంతోపాటు ప్రజలను అత్యధికంగా భాగస్వాములను చేయడం సాధ్యమవుతుందని ఉన్నతాధికారులు నిర్ణయించారు. మొక్కల సంరక్షణలో కూడా గ్రామస్తులు పాలుపంచుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ మేరకు జిల్లాలోని 401 పంచాయతీల్లో 401 నర్సరీలను ఏర్పాటు చేసి ఆయా నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. ఒక్కో గ్రామంలో 20 వేలకు తక్కువ కాకుండా మొక్కలను నాటి పెంచనున్నారు. ప్రతి ఇంటికి 6 మొక్కలను అందజేసేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

వన నర్సరీలకు పెద్దపీట..
వన నర్సరీల పెంపకానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. సీమాంధ్ర పాలనలో అంతరించిపోయిన మొక్కల పెంపకం.. స్వరాష్ట్రంలో హరితహారం పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం మొక్కలు నాటి పెంచుతున్నది. ఈక్రమంలో ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేసింది. నర్సరీల్లో ఏపుగా పెరిగిన మొక్కలను గ్రామంలో నాటించి హరితగ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నది. ఇప్పటికే మండలంలో హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టింది. ఐదు విడుతలో భాగంగా మరిన్ని మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేస్తుంది.
-దేవరపల్లి గోవర్ధన్‌రెడ్డి, చౌటుప్పల్

మొక్కలు ఏపుగా పెరిగాయి..
ప్రభుత్వం జిల్లాకు నిర్ధేశించిన మొక్కల లక్ష్యాన్ని అధిగమించేందుకు కృషి చేస్తున్నాం. కలెక్టర్ అనితారామచంద్రన్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నర్సరీని ఏర్పాటు చేయడంతో పాటు విత్తనాల పంపిణీకి చర్యలు చేపట్టాం. ప్రస్తుతం మొక్కలు ఏపుగా పెరిగాయి.
-మందడి ఉపేందర్‌రెడ్డి, డీఆర్‌డీవో పీడీ

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...