భువనగిరి హస్తగతం


Fri,May 24, 2019 04:51 AM

-5,219 స్వల్ప మెజార్టీతో విజయం
-కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి 5,32,795 ఓట్లు
-టీఆర్‌ఎస్ అభ్యర్థి బూరకు 5,27,576 ఓట్లు
-రౌండ్‌రౌండ్‌కు ఉత్కంఠ

యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ :భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్‌పై హస్తం పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 5,219 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. మొత్తంగా కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 5,32,795 ఓట్లు, టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బూర 5,27,576 ఓట్లు సాధించారు. మొత్తం 25 రౌండ్లలో ఫలితం వెలువడగా అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు సాగింది. మొదటి నాలుగు రౌండ్లలో టీఆర్‌ఎస్ తన అధిక్యాన్ని కనబర్చగా.. అనంతరం మిగిలిన రౌండ్లలో కాంగ్రెస్ బలం పుంజుకుంది. భువనగిరి పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడు నియోజకవర్గాలుండగా ఆలేరు, తుంగతుర్తి, జనగాం అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్, భువనగిరి, నకిరేకల్, మునుగోడు, ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ సత్తా చాటింది.

భువనగిరి పార్లమెంట్‌ను కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. సినీ ఫక్కీలో ఉత్కంఠ భరితంగా సాగిన కౌంటింగ్ ప్రక్రియ ఎన్నికల పోరును మరింత రసవత్తరం చేసింది. క్షణక్షణం ఎవరు విజయం సాధిస్తారు... ఎంత మెజార్టీ సాధిస్తున్నారనే విషయం నరాలు తెగిపోయే టెన్షన్‌ను కలిగించింది. టీఆర్‌ఎస్ సిట్టింగ్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 5, 219 స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. హోరాహోరిగా సాగిన కౌంటింగ్‌లో రౌండ్ రౌండ్‌కు ఇరువురి మధ్య పోటీ తీవ్రమైంది. స్వల్ప మెజార్టీ కాస్తా వందల ఓట్ల రూపంలో పెరుగుతూ 5,219కి చేరుకున్నది. మొదట్లో నాల్గో రౌండ్ల వరకు మంచి మెజార్టీతో ముందుకు దూసుకుపోతున్న డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ నాల్గో రౌండ్ నుంచి ఓట్లు తగ్గుతూ వచ్చాయి. బూర నర్సయ్యగౌడ్‌కు 5,27,576 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి 5,32,795 ఓట్లతో 5,219 మెజార్టీ సాధించినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనితారామచంద్రన్ ప్రకటించారు. భువనగిరి పార్లమెంట్ ఎన్నికల లెక్కింపు భువనగిరి పట్టణంలోని అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.

నోటాకు 12,021 ఓట్లు..
నోటాకు 12,010 ఓట్లు రాగా పోస్టల్ బ్యాలెట్‌తో 11 ఓట్లు వచ్చాయి. మొత్తం 12,021 ఓట్లు నోటాకు రావడం విశేషం. దాంతోపాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 146 ఓట్లను అధికారులు రిజెక్ట్ చేశారు. ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు ఎలా వేయాలో తెలియకపోవడం విడ్డూరంగా ఉందని పరిశీలకులు వ్యాఖ్యానించారు.

మొరాయించిన ఈవీఎంలు ఇవే...
పార్లమెంటు ఓట్ల లెక్కింపులో భాగంగా అధికారులు ఓట్లు లెక్కిస్తున్న క్రమంలో 13 ఈవీఎంలు మొరాయించాయి. మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన రెండు ఈవీఎంలు, ఆలేరు నియోజకవర్గానికి చెందిన రెండు, జనగామకు చెందిన ఐదు, ఇబ్రహీంపట్నం రెండు, నకిరేకల్ రెండు మొత్తం 13 ఈవీఎంలు మొరాయించగా దీంతో ఏజెంట్ల అంగీకారంతో వీవీ ప్యాట్లను లెక్కించి వచ్చిన ఓట్లను అభ్యర్థుల మొత్తం ఓట్లకు కలిపారు.

కలెక్టర్, సీపీ మహేశ్‌భగవత్ పర్యవేక్షణ..
జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, సీపీ మహేశ్‌భగవత్‌లు ఓట్ల లెక్కింపును జాగ్రత్తగా పర్యవేక్షించారు. డీసీపీ నారాయణరెడ్డితోపాటు ఏడుగులు ఏసీపీలు భద్రతా చర్యలను పర్యవేక్షించారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రతను ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేశారు. జాయింట్ సీపీ సుధీర్‌బాబు కూడా పర్యవేక్షణ జరిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూశారు.

రాకపోకలను నియంత్రించిన పోలీసులు..
కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూసేందుకు పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. భువనగిరి పట్టణంలో నుంచి యాదగిరిగుట్ట వైపుకు వాహనాలు రాకుండా బైపాస్ మీదుగా మళ్లించారు. గుట్ట నుంచి భువనగిరికి వెళ్లే వాహనాలను కూడా బైపాస్ మీదుగా భువనగిరి చేరుకునే విధంగా పర్యవేక్షణ చేశారు. ఏ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు కౌంటింగ్ కేంద్రానికి రాకుండా చూశారు.

కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ..
కాంగ్రెస్ విజయం సాధించడంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పటాకులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. స్వీట్లు తినిపించుకున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన జన్మదినం రోజునే విజయం సాధించడం విశేషం.

ఇది భువనగిరి ప్రజల సమష్టి విజయం
- కోమటిరెడ్డి బ్రదర్స్
ఈ విజయం భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ప్రజల విజయంగా కోమటిరెడ్డి బ్రదర్స్ అభివర్ణించారు. మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్‌ను మోడల్ పార్లమెంట్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. కేంద్రం నుంచి అధిక మొత్తంలో నిధు లు తీసుకువస్తామన్నారు. సాగుతాగు నీటి కష్టాలు తీర్చడమే ధ్యేయంగా ముందుకు సాగుతామని చెప్పారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...