ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి


Wed,May 22, 2019 11:46 PM

భువనగిరిరూరల్ : పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనితారామచంద్రన్ తెలిపారు. బుధవారం ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. స్థానిక అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారని, అరోరా కళాశాల ఏ-బ్లాక్‌లో ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి, నకిరేకల్ అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు, అదేవిధంగా బీ-బ్లాక్‌లో ఇబ్రహీంపట్నం,మునుగోడు, జనగాం అసెంబ్లీ సెగ్మెంట్‌ల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపుకు పఠిష్టమైన మూడంచెల భద్రత, బందోబస్తును ఏర్పాటు చేశామని, ప్రతి నియోజకవర్గానికి 14టేబుల్‌లు ఏర్పాటు చేసి ఓట్లను లెక్కించనున్నట్లు చెప్పారు.

ఇందుకోసం ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రోపరిశీలకులను నియమించామన్నారు. ఉదయం 8-00గంటలకు తొలుత రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద అన్ని నియోజకవర్గాల సర్పీసు ఓటర్లు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం పిదప అన్ని టేబుల్‌ల వద్ద కౌంటింగ్ ప్రారంభిస్తారన్నారు. ఈ సందర్భంగా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంటు నియోజకవర్గానికి నలుగురు కౌంటింగ్ పరిశీలకులను నియమించగా బుదవారం మైక్రోపరిశీలతో సమావేశాన్ని నిర్వహించి ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలపై అవగాహన కలిగించారు. అరోరా కళాశాలలో కౌంటింగ్ పక్రియ మరింత పారదర్శకంగా జరిగేందుకు గాను ప్రతి కౌంటింగ్ హాలులో వీడియో కవరేజీతో పాటు మొత్తం 64 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఐటీ సిబ్బందికి వాటి పర్యవేక్షణ బాధ్యతలను అప్పజెప్పినట్లు తెలిపారు.

ఫైరింజన్, భోజన సౌకర్యం, మీడియా సెంటర్ ఏర్పాటు పనులు పూర్తయ్యాయని, విద్యుత్ అంతరాయం లేకుండా జనరేటర్ సౌకర్యం, కూలర్లు, ఫ్యాన్లు, తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో పాటు స్ట్రాంగ్‌రూం నుంచి నేరుగా కౌంటింగ్ హాలుకు ఈవీఎంను తీసుకు వెళ్లేందుకు బందోబస్తుతో బారీకేడింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. ఏజెంట్లకు ప్రత్యేక దారి గుండా కౌంటింగ్ హాలుకు చేరుకునేలా ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సెగ్మెంట్‌లోని కౌంటింగ్‌హాలులో కంప్యూటర్, నెట్ ఇతర సాంకేతిక పనులన్నింటిని పూర్తి చేసి కౌంటింగుకు సిద్ధం చేశామన్నారు. మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు కలిసి 2068 పోలింగు కేంద్రాలకు సంబంధించి 12,111,56 ఓట్లను లెక్కించనున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు పూర్తి అయిన పిదప ప్రతి సెగ్మెంటుకు 5 వీవీప్యాట్స్‌ను ర్యాండమైజేషన్ చేపట్టి లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి లెక్కించనున్నట్లు చెప్పారు.

సహాయ రిటర్నింగ్ అధికారులు వారి అసెంబ్లీ సెగ్మెంటుకు, కౌంటింగుకు సంబంధించిన పనులన్నీ పర్యవేక్షించి సిబ్బందికి విధులు కేటాయించామన్నారు. కౌంటింగు సిబ్బందికి ర్యాండమైజేషన్ నిర్వహించి టేబుల్స్ కేటాయిస్తామన్నారు. ఏజెంట్లు 6 గంటలకు చేరుకోగానే వారి సమక్షంలో స్ట్రాంగురూముల సీలు తీసి ఓట్ల లెక్కింపును 8-00గంటలకు ప్రారంభిస్తారన్నారు. కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన వారిలో జాయింట్ పోలీసు కమీషనర్ సుధీర్‌బాబు, డీసీపీ నారాయణరెడ్డి, సూర్యాపేట జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి, ఏసీపీ తదితరులున్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...