నయీం అనుచరుల అరెస్టు


Wed,May 22, 2019 02:02 AM

-రిమాండ్‌కు తరలింపు
-భువనగిరిలో కేసు వివరాలు వెల్లడించిన ఏసీపీ భుజంగరావ్

భువనగిరి అర్బన్ : గ్యాంగ్‌స్టర్ నయీం వెంబటి అంటకాగి, నయీంకు భూదందాల, భూ కబ్జాలు, సెటిల్‌మెంట్లు, బెదిరింపులతోపాటు అన్ని రకాలుగా సహాకరించిన అనుచరులు ఎవరినీ వదలకుండా పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇందులో భాగంగా భువనగిరి పోలీసులు గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరులైన మరో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ భుజంగరావ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్యాంగ్‌స్టర్ నయీంకు అన్ని విధాలా సహకరించిన నయీం పెద్ద అక్క అయేషాబేగం, బావ మహ్మద్ అబ్దుల్‌సలీంలు వేకిర్ సెక్షన్ కాలనీ మన్సురాబాద్, ఎల్‌బీనగర్, రంగారెడ్డిలో నివాసం ఉండేవారు. గ్యాంగ్‌స్టర్ నయీం మృతి చెందిన తర్వాత వీరు సంగారెడ్డి జిల్లా కోహీర్ గ్రామంలో ఉంట్టున్నారు.

నయీం అండతో భూ కబ్జాల దందా...
గ్యాంగ్‌స్టర్ నయీం బెదిరించి కబ్జా చేసిన భూములు, ప్లాట్లను నయీం పెద్ద అక్క అయేషాబేగం, బావ మహ్మద్ అబ్దుల్‌సలీం పేరుపై రిజిస్ట్రేషన్ చేయించేవాడు. అనంతరం కబ్జా చేసిన భూములను ప్లాట్లు చేసి అక్క, బావలు కలిసి ఇతరులకు అమ్మేవారు. ఈ క్రమంలో 2007లో మహ్మద్ అబ్దుల్‌సలీం భువనగిరి పట్టణంలోని లండన్ టౌన్ షిప్‌లోని సర్వే నెంబర్ 586లో ఉన్న 2,983 గజాల 8 ప్లాట్లను నయీం అండతో ఆక్రమించుకున్నారు. అనంతరం పట్టణంలోని ఓ వ్యక్తికి అమ్మారు. అదే సంవత్సరం.. అదే సర్వే నెంబర్‌లో అందులోని 930 గజాలు గల 8 ప్లాట్లను ఆక్రమించి తిరిగి మరో వ్యక్తికి అమ్మారు. ఇదే సర్వే నెంబర్‌లో మరో 600 గజాలు గల 8 ప్లాట్లను మరొకరికి అమ్మేశారు. అదే విధంగా మండలంలోని తుక్కాపురం గ్రామానికి చెందిన రాసాల పద్మకు చెందిన 180 గజాల ప్లాటును కబ్జా చేశారు. 2003లో అయేషాబేగం, మహ్మద్ అబ్దుల్‌సలీంలు నయీం అండతో 65-70 సర్వే నెంబర్‌లో కేసీ రెడ్డికి చెందిన 68 ఎకరాల భూమిని కబ్జా చేశారు. 2006లో వీరిద్దరూ కూర శ్రీనివాస్, శ్రీదేవిలకు చెందిన సర్వే నెంబర్ 65-70లో ఉన్న 9.06 ఎకరాల భూమిని కబ్జా చేశారు.

ఫిర్యాదులతో నయీం అనుచరుల అరెస్టు..
గ్యాంగ్‌స్టర్ నయీం మృతి చెందకముందు అమాయక ప్రజలను బెదిరించి భూములను ఆక్రమించి అయేషాబేగం, మహ్మద్ అబ్దుల్ సలీం తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నయీం మృతి చెందిన తర్వాత నష్టపోయిన ప్రజలు తన భూమిని ఎలాగైన మాకు ఇప్పించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించి బెదింరింపులకు పాల్పడిన వారిపై కేసులు పెట్టారు. నయీం అండతో ఆక్రమించుకుని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బాధితుల ఫిర్యాదుతో నయీం పెద్ద అక్క అయేషాబేగం, మహ్మద్ అబ్దుల్‌సలీంను అరెస్టు చేసేందుకు పోలీసులు పక్క వ్యూహం పన్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం వీరిద్దరూ సంగారెడ్డి జిల్లా కోహీర్ గ్రామంలో ఉన్నట్టు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసినట్టు ఏసీపీ తెలిపారు. ఇందులో ఏ1 నిందితుడు మహ్మద్ అబ్దుల్‌సలీం గతంలో భువనగిరి పట్టణ పీఎస్, పహాడీషరీఫ్, కల్వకుర్తి, పోలీస్‌స్టేషన్స్‌లో కేసులు నమోదుకాగా, అయేషాబేగంపై భువనగిరి పట్టణ పీఎస్‌లో కేసులు నమోదైనట్టు తెలిపారు. ఈ కేసులో నిందితులైన ఇద్దరిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్టు ఏసీపీ తెలపారు. ఈ సమావేశంలో సీఐ ఎం.సురేందర్, నాగిరెడ్డి ఉన్నారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...