ఉత్కంఠ..!


Tue,May 21, 2019 12:29 AM

-ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ఆసక్తి
-23న ఎంపీ, 27న పరిషత్‌ ఎన్నికల ఫలితాలు
-కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : సర్వత్రా ఉత్కంఠ.. అభ్యర్థుల్లో ఆందోళన.. రాజకీయ పార్టీలకు గెలుపు జ్వరం.. ఓట్లు వేసిన ఓటర్లకు ఓటేసిన అభ్యర్థులు గెలుస్తారో? లేదోనన్న టెన్షన్‌..! వెరసి.. ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాలపైనే చర్చ.. ఈ సస్పెన్స్‌కు మరికొన్ని రోజుల్లో తెరపడనున్నది.. ఈ నెల 23న ఎంపీ ఎన్నికల ఫలితాలు, 27న పరిషత్‌ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. జిల్లా పరిధిలో ఒక పార్లమెంట్‌ నియోజకవర్గం ఉండగా 13 మంది వివిధ పార్టీల నాయకులు బరిలో ఉన్నారు. కాగా 27వ తేదీన జిల్లాలోని 17 జడ్పీటీసీ, 177 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల కౌంటింగ్‌ జరుగనున్నది.. జడ్పీటీసీ స్థానాలకు 74 మంది, 177 ఎంపీటీసీ స్థానాలకు 548 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

వరుస ఎన్నికల్లో బిజీబిజీగా గడిపిన అభ్యర్థులు, జిల్లా ప్రజలు ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మొదటి విడుత తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు స్థానాలకు ఏప్రిల్‌ 11న ఎన్నికలు నిర్వహించారు. జిల్లాల పునర్విభజన అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాలోని 2 నియోజకవర్గాలైన ఆలేరు, భువనగిరితోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 3 నియోజవర్గాలైన తుంగతుర్తి, నకిరేకల్‌, మునుగోడు, జనగామ జిల్లాలోని జనగామ నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలు భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలోకి వెళ్లాయి. ఏప్రిల్‌ 11న జిల్లా వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు నిర్వహించగా, భువనగిరి పార్లమెంట్‌ నియోజవర్గం పరిధిలో 13 మంది అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి బరిలో నిలిచారు. దాదాపు పోలింగ్‌ నెల రోజుల దాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి. అంటూ నియోజకవర్గంలోని పోలింగ్‌బూత్‌ల వారీగా లెక్కలేసుకుంటున్నారు. ఈ నెల 23న పార్లమెంట్‌ అభ్యర్థి కౌంటింగ్‌, 27న జిల్లాలోని 17 జడ్పీటీసీ, 177 ఎంపీటీసీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల కౌంటింగ్‌ జరుగనున్నది. జిల్లాలోని 17 జడ్పీటీసీ స్థానాలకు 74 మంది, 177 ఎంపీటీసీ స్థానాలకు 548 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ
ఇటీవల జరిగిన పార్లమెంట్‌, పరిషత్‌ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఎన్నికల ముగిసి నెల రోజులు గుడుస్తుండగా ఎవరికి వారు పోలింగ్‌ బూత్‌ల వారీగా స్థానిక నాయకులతో లెక్కలు తెప్పించుకుని మనకు ఎన్ని ఓట్లు వచ్చాయని అంచనా వేసుకుంటూ గెలుపోటములపై లెక్కలు వేసుకుంటున్నారు. మొదటి విడుత పార్లమెంట్‌ ఎన్నికలు జరిగిన భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో మొత్తం 13 మంది అభ్యర్థులు ఎవరికి వారు గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో పార్లమెంట్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ జరుగనుండటంతో అందరూ ఆ రోజుకోసం వేయికండ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్‌ కేంద్రమైన భువనగిరి అరోరా ఇంజినీరింగ్‌ కళాశాలలో స్ట్రాంగ్‌ రూమ్‌లను ఏర్పాటు చేసి ఏప్రిల్‌ 11వ తేదీ సాయంత్రం ఈవీఎంలు, వీవీప్యాట్‌లను భద్రపరిచి వాటికి పటిష్ట నిఘా కల్పించారు.

గెలుపు లెక్కల్లో నిమగ్నమైన పార్టీలు
పోలింగ్‌ బూత్‌ల వారీగా స్థానిక నాయకులతో లెక్కలు తెప్పించుకోని ఎన్ని ఓట్లు వచ్చాయోనని అంచనా వేసుకుంటూ ఎవరికి వారు గెలుపు లెక్కల్లో నిమగ్నమయ్యారు. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొన్నది. ఈ నెల 23 ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమై మధ్యాహ్నంలోపు ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో అభ్యర్థులంతా ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు. రోజురోజుకూ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఆతృత పెరిగిపోతోంది. కొన్ని పార్టీల అభ్యర్థులు ఒత్తిడిని అధిగమించేందుకు దేశవిదేశాల్లోని టూరిస్టు స్పాట్‌లకు వెళ్లి ఉపశమనం పొందుతున్నారు.

ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ఆసక్తి
పార్లమెంట్‌, పరిషత్‌ ఎన్నికల ఫలితాల గడువు సమీపిస్తుండటంతో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు జిల్లా ప్రజల్లో కూడా ఫలితాలపై ఆసక్తి నెలకొన్నది. తాము ఓటు వేసిన అభ్యర్థులు గెలుస్తారా, లేక మరో అభ్యర్థి గెలుస్తారా అని నలుగురు కలిసిన చోట చర్చించుకుంటున్నారు. హోటళ్లు, బస్టాండ్‌ సెంటర్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో ఎక్కడ నలుగురు కలిసినా ఎన్నికల ఫలితాలపై చర్చ జరుగుతుంది. 23న పార్టీ అభ్యర్థి గెలుస్తాడో, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఎలాంటి ప్రయోజనాలు జరుగుతాయి. ప్రజలంతా ఎవరి వైపు మొగ్గు చూపి ఉంటారనే దానిపై చర్చించుకుంటూ తమదైన శైలిలో లెక్కలు కడుతూ ఎవరు విజేతలుగా నిలుస్తారోనని అంచనాకు వస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి గెలుస్తాడంటే తమ పార్టీ అభ్యర్థే గెలుస్తాడని పందాలు కాస్తున్నట్లు సమాచారం. గ్రామాల్లో ప్రజలు తొలుత జరిగే పార్లమెంట్‌ ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయో, ఢిల్లీ పీఠం ఎవరు దక్కించుకుంటారోనని తీవ్ర చర్చ నడుస్తున్నాయి. ఉత్తరాది, దక్షిణాది రాష్ర్టాలలో ఏడు విడుతలుగా పోలింగ్‌ నిర్వహించనుండగా ఆదివారం చివరి విడుత ఎన్నికలు పూర్తి కానుండటంతో ఢిల్లీ పీఠంపై మీడియాల్లో వచ్చే కథనాలను ఆసక్తిగా చూస్తున్నారు.

8 గంటలకే కౌంటింగ్‌ ప్రారంభం
జిల్లా పరిధిలోని భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గానికి గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానున్నది. మధ్యాహ్నం కల్లా పలు రౌండ్లు పూర్తై గెలుపు ఎవరిదో.. అనే స్పష్టత రానున్నది. జిల్లా కేంద్రంలో ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రంలో ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రౌండ్ల వారీగా టేబుళ్లను ఏర్పాటు చేసి సిబ్బందిని కేటాయించారు. కౌంటింగ్‌లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే శిక్షణను కూడా పూర్తి చేశారు. పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్‌ నిర్వహించే విధంగా ఆయా పార్టీల కౌంటింగ్‌ ఏజెంట్లకు పాస్‌లను జారీ చేయనున్నారు. 27న పరిషత్‌ ఫలితాలను వెల్లడించనున్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...