ఇబ్బందులు కలిగించొద్దు


Mon,May 20, 2019 03:53 AM

భూదాన్‌పోచంపల్లి : పది రోజుల్లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ అన్నారు. ఆదివారం మండల పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. మండల పరిధిలోని ఇంద్రియాలలో పీఏసీఎస్ ద్వారా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రం, పెద్దరావులపల్లిలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి కొనుగోళ్లను పరిశీలించారు. జిల్లాలో గతేడాది కన్నా ఈసారి వరి ధాన్యం ఉత్పత్తి తగ్గుదలపై ఆరా తీశారు. ధాన్యం తూకం, గన్నీ బ్యాగుల లభ్యత, ట్రాన్స్‌పోర్టు తదితర విషయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ట్రాన్స్‌పోర్టు ఇబ్బందులు తలెత్తిన విషయాన్ని రైతులు ఆయన దృష్టికి తీసుకురాగా.. దానిని పరిష్కరించామని జిల్లా అధికారులు కమిషనర్‌కు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదేమైనా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో మిగిలిపోయిన ధాన్యాన్ని మరో 10 రోజుల్లో కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రబీ సీజన్‌లో 2 లక్షల 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను ఇప్పటి వరకు లక్షా 85 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించామన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో 290 మెట్రిక్ టన్నులకు గాను 220 మెట్రిక్ టన్నుల దిగుమతి మాత్రమే రావడంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాల ప్రభావం వల్ల రైతులు కాస్త పంటను కోల్పోయిన విషయాన్ని అధికారులు కమిషనర్‌కు తెలిపారు. జిల్లాలో ఈ ఏడు సుమారు 70 మెట్రిక్ టన్నుల దిగుబడి తగ్గిందని తెలిపారు. జిల్లాలోని 43 సెంటర్లలో ఇంకా ధాన్యం కొనుగోల్లు జరుగుతున్నాయని, త్వరలో కొనుగోళ్లు పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ అకున్ సబర్వాల్ గన్నీ బ్యాగుల సరఫరా, రైతులకు తాగునీటి సౌకర్యం, ధాన్యం తూకం, షెడ్‌ల నిర్వాహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ముందుగా ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి ధాన్యం కొనుగోళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జేసీ రమేశ్, డీఆర్‌డీవో సూరజ్‌కుమార్, డీఆర్‌డీఏ ఉపేందర్‌రెడ్డి, చౌటుప్పల్ ఆర్డీవో సూరజ్‌కుమార్, డీఎస్‌సీవో సంధ్యారాణి, డీఎం గోపీ కృష్ణ, డీఐ సంజయ్ కృష్ణ, డీటీసీఎస్ ఆంజనేయులు, తహసీల్దారు గుగులోతు దశరథ నాయక్, ఏవో ఎజాజ్ అలీఖాన్, పీఎం హరినాయక్, పోచంపల్లి పీఏసీఎస్ కార్యదర్శి బాల్‌రెడ్డి పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...