హాజీపూర్ ఘటనపై కేటీఆర్ స్పందన


Mon,May 20, 2019 03:51 AM

-మల్యాల సర్పంచ్ శ్రీను ట్వీట్‌కు స్పందించి ఆయనతో ఫోన్‌లో మాట్లాడిన టీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
-బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ
-న్యాయం జరుగుతుందని భరోసా కలిగింది :బాధిత కుటుంబ సభ్యులు
బొమ్మలరామారం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్ వరుస హత్యల దారుణాలపై బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరతూ.. మండలంలోని మల్యాల గ్రామ సర్పంచ్ బిట్టు శ్రీను ట్విట్టర్‌లో ఫొటోతో కూడిన సందేశాన్ని టీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పోస్టు చేశాడు. కాగా శనివారం రాత్రి 8 గంటలకు స్వయంగా కేటీఆర్ స్పందిస్తూ మల్యాల సర్పంచ్ శ్రీనుకు స్వయంగా ఫోన్ చేసి హాజీపూర్ ఘటనపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఫోన్ సంభాషణలో కేటీఆర్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు సరైన న్యాయం జరిగేలా చూస్తామన్నారు. సీఎం కేసీఆర్ కూడా ఈ సంఘటనపై వ్యక్తిగతంగా చాలా బాధపడ్డారన్నారు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.

దీనిపై మల్యాల సర్పంచ్ శ్రీను మాట్లాడుతూ ఈ హత్యల కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సై, సీఐలపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి కేటీఆర్ సమాధానంగా దీనిపై సమగ్ర విచారణకు సీపీకి చెప్పి న్యాయం చేస్తామన్నారు. 23 ఎన్నికల ఫలితాల తర్వాత తానే స్వయంగా హాజీపూర్ గ్రామానికి వచ్చి బాధిత కుటుంబాలకు భరోసాను కల్పిస్తామన్నారు. ఎన్నికల బీజీగా ఉండడంతో రావడానికి కుదరలేదన్నారు. దయచేసి ప్రజలందరూ సంయమనం పాటించి సహకరించాలని కోరారు. రాజకీయాలు చేయకుండా గ్రామస్తులు, బాధిత కుటుంబాల వారికి కూడా నచ్చజెప్పాలన్నారు. ప్రభుత్వం కూడా హాజీపూర్ ఘటనపై సీరియస్‌గా ఉందన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శ్రీనివాస్‌రెడ్డికి సరైన శిక్ష విధించేలా చూస్తామన్నారు. అంతేగాకుండా ఎమ్మెల్యే సునీతామహేందర్‌రెడ్డితో మాట్లాడి పరిస్థితులను సమీక్షించే విధంగా చూస్తామని హామీనిచ్చారు. బాధిత కుటుంబాలను అన్ని రకాలుగా అండగా నిలుస్తామని హామీనిచ్చారు. హాజీపూర్ గ్రామస్తులకు తన సందేశంగా అందరికీ ఈ విషయాన్ని తెలియజేయాలన్నారు.

భరోసా కలిగింది..
హాజీపూర్ ఘటన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ నేను ట్విట్టర్‌లో చేసిన పోస్టుకు టీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు స్పందించి ఫోన్ చేశారు. దీంతో భాదితులకు న్యాయం జరుగుతుందన్న భరోసా కలిగింది. హాజీపూర్ గ్రామానికి పక్కగ్రామమైన మల్యాల సర్పంచ్‌నైన నాకు ఫోన్‌లో స్వయంగా కేటీఆరే దారుణ హత్యలకు పాల్పడ్డ శ్రీనివాస్‌రెడ్డికి కఠిన శిక్షతో పాటు ఎన్నికల బీజీ షెడ్యూల్ ముగిసిన తర్వాత హాజీపూర్‌కు వచ్చి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. గత రెండు రోజుల క్రితం మండల కేంద్రంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొన్న ఫొటోలను పోస్ట్ చేశాను. ప్రభుత్వం అన్ని రకాలుగా బాధిత కుటుంబాలకు అండగా నిలువాలని కోరుకుంటున్నాం.
-బిట్టు శ్రీను, సర్పంచ్ మల్యాల

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...