సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం


Mon,May 20, 2019 03:51 AM

-ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త ఖాదర్‌వలీ
- ఎస్. ఫౌండేషన్, విశ్రాంత ఇంజినీర్ల సంఘం, రైతునేస్తం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
-పాల్గొన్న సూర్యాపేట కలెక్టర్ అమయ్ కుమార్
సూర్యాపేటరూరల్ : సిరిధాన్యాలతో ఆరు నెలల్లో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త ఖాదర్‌వలీ అన్నారు. జనగాం క్రాస్‌రోడ్‌లోని మన్నెం సదాశివరెడ్డి ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం రాత్రి ఎస్. ఫౌండేషన్, విశ్రాంత ఇంజినీర్ల సంఘం, రైతునేస్తం ఆధ్వర్యంలో నిర్వహించి అటవీ, వ్యవసాయ సదస్సులో ఆయన మాట్లాడారు. మనం తినే రోజువారీ ఆహారం పాల పదార్థాలు, చక్కెర, బియ్యం, గోధుమలు తదితరాల వల్ల మానవజాతి ఎన్నో అనారోగ్యాల బారిన పడి దవాఖానల చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు. మానవజాతి ఆహారపు అలవాట్లను మార్చుకుంటేనే ఎలాంటి రోగాల బారిన పడకుండా ఆహారమే అసలైన ఔషదంగా పని చేసి ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు. బీపీ, థైరాయిడ్, షుగర్, కిడ్నీ, గుండెపోటు, క్యాన్సర్ తదితర ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. వీటికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు అన్నారు. ప్రకృతి సిద్ధ్దంగా పం డించే సిరిధాన్యాలైన కొర్రలు, అండుకొర్రలు, అరికెలు, తాములు, ఊదలు, తదితర పూర్వీకుల ఆహారపు అలవాట్లను ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులమవుతామన్నారు.

ఈ పంటలకు ఎలాంటి రసాయన ఎరువులు అవసరం లేకుండా ప్రకృతి సిద్ధ్దమైన ఆర్గానిక్ ఎరువులతో పండించాలన్నారు. వీటి ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి జీవన ప్రమాణం పెరుగుతుందన్నారు. బియ్యం, గోధుమల్లో పీచు పదార్థాలు లేక పోవడం వల్లనే విచిత్రమైన రోగాలు వస్తున్నాయన్నారు. గాలి, నీరు, నేలను కలుషితం చేయకుండా వర్షాధార పంటలైన సిరి ధాన్యాలను పండించవచ్చన్నారు. ఈ ఆహారపు అలవాట్లతో ప్రజలు ఎక్కువ కాలం జీవించగలుగుతారన్నారు. అనంతరం కలెక్టర్ అమయ్‌కుమార్ మాట్లాడుతూ సిరి ధాన్యాలు తినడం వల్ల జీవితంలో మార్పులు వస్తాయని సిరి ధాన్యాల్లో సూర్యాపేట జిల్లాను అగ్రగామిగా నిలపాలని సిరి ధాన్యాలకు సూర్యాపేట నిలయం కావాలన్నారు. మంత్రి జగదీష్‌రెడ్డ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. సదస్సుకు ముందు ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త ఖాదర్‌వలీ, కలెక్టర్ డి. అమయ్‌కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సదస్సు అనంతరం పిన్నాయిపాలెం గ్రామానికి చెందిన కర్నాటి శ్రీనివాస్ పండించిన అంటు కొర్రలను శాస్త్రవేత్త ఖాదర్‌వలీ, కలెక్టర్ అమయ్‌కుమార్‌లకు అందజేశారు. పలువురు రైతులకు శాస్త్రవేత్త ఖాదర్‌వలీ సిరుధాన్యాలను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ పీడీ కిరణ్‌కుమార్, విశ్రాంత ఇంజినీర్ శ్యాంప్రసాద్‌రెడ్డి, డాక్టర్ రామకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారిణి జ్యోతిర్మయి, ఏడీఏ రామారావు, వ్యవసాయ శాఖ అధికారులు, పంతంగి రాంబాబు, మధు గురూజీ, వై.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...