ఆమరణ నిరాహార దీక్ష భగ్నం


Sat,May 18, 2019 11:42 PM

బొమ్మలరామారం: మండలంలోని హాజీపూర్‌లో నరహంతకుడు శ్రీనివాస్‌రెడ్డి చేతిలో వరుస హత్యలకు గురైన బాధిత కుటుంబాలు గత రెండు రోజులుగా న్యాయం చేయాలని కోరుతూ మండల కేంద్రంలోని గుడి బావి చౌరస్తా వద్ద చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను శనివారం తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. శనివారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ప్రత్యేక పోలీసు బలగాలతో దీక్షను భగ్నం చేసి ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొన్న వారిని అరెస్ట్‌ చేసి మేడ్చేల్‌ జిల్లా జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్‌ చేసిన వారిని సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. తిరిగి ఉదయం 10 గంటలకు హాజీపూర్‌ గ్రామంలో విడిచిపెట్టారు. దీంతో గ్రామస్తులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పోలీసులు ఏకపక్షంగా అర్ధరాత్రి వచ్చి దీక్షను భగ్నం చేయడం సరికాదన్నారు. ప్రశాంతంగా నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్షపై పోలీసులు చేసిన దాడికి నిరసనగా బాధిత కుటుంబాలు, బంధువులు, గ్రామస్తులు నిరసన తెలుపుతూ శనివారం మధ్యాహ్నం హత్యలు చేసి పూడ్చిన తెట్టెబావిలోకి దిగి నిరసన తెలిపారు. గ్రామ సర్పంచ్‌ తిరుమల కవితా వెంకటేశ్‌గౌడ్‌ విజ్ఞప్తి మేరకు బావిలోకి దిగి నిరసన తెలుపుతున్న వారందరూ బయటికి వచ్చారు. అక్కడి నుంచి నేరుగా యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ను కలువడానికి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీనివాస్‌రెడ్డిని బహిరంగంగా ఉరితీయాలన్నారు. అలాగే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియాను అందించడంతోపాటు ఉద్యోగ భద్రతను కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలువాలని కోరారు. సంఘటన జరిగి దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకూ ఎవరూ తమకు స్పష్టమైన హామీని ఇవ్వలేదని వాపోయారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు, సీఎం కేసీఆర్‌ తమ గోడు విని న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు నర్సింహ, మల్లేశ్‌, నందం, నాగమణి, భాగ్యమ్మ, గ్రామసర్పంచ్‌ కవితావెంకటేశ్‌గౌడ్‌, పక్కీర్‌ రాజేందర్‌రెడ్డి, బంధువులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...