బదిలీలకు వేళాయె..


Sat,May 18, 2019 12:19 AM

-తహసీల్దార్లు, ఎంపీడీవోల జాబితా రెడీ
-జూన్‌లో బదిలీలకు అవకాశం
-దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న వారికీ స్థాన చలనం
-పంచాయతీ, పార్లమెంట్, పరిషత్ ఎన్నికలు ముగియడంతో బదిలీ ప్రక్రియకు శ్రీకారం

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఎన్నికల సమయంలో జిల్లాకు బదిలీపై వచ్చిన తహసీల్దార్లతో పాటు ఎంపీడీవోలను కూడా బదిలీ చేసేందుకు జాబితా రెడీ చేశారు. ఏయే జిల్లాల నుంచి జిల్లాకు బదిలీపై వచ్చారో ఆయా జిల్లాలకు తిరిగి తహసీల్దార్లు, ఎంపీడీవోలు బదిలీ కానున్నారు. ఇప్పటికే తహసీల్దార్ల, ఎంపీడీవోల బదిలీల జాబితా సిద్ధం కాగా జూన్ రెండో లేదా మూడో వారంలో బదిలీ చేయనున్నారు. ఎన్నికల సందర్భంగా గతేడాది నవంబర్ మాసంలో బదిలీపై జిల్లాకు రాగా, అసెంబ్లీ ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు పూర్తికావడంతో పాటు ఈ నెల 23న పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు, 27న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. అదే విధంగా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం ఈ నెల 31న జరుగునున్నాయి. వచ్చే నెల 3న ఓట్ల లెకింపుతో పాటు ఫలితాలను వెల్లడించనున్నారు. దీంతో మున్సిపల్ ఎన్నికలు మినహా అన్ని ఎన్నికలు పూర్తికానున్న దృష్ట్యా తహసీల్దార్లు, ఎంపీడీవోలకు స్థాన చలనం చేయనున్నారు. అతేకాకుండా జిల్లాలో దీర్ఘకాలకంగా ఒకే మండలంలో పనిచేస్తున్న ఎంపీడీవో, తహసీల్దార్లను కూడా బదిలీ చేసేందుకు జిల్లా ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విద్యాసంవత్సరం ప్రారంభం కన్నా ముందే బదిలీలు చేస్తే మంచిదన్న అభిప్రాయంలో అధికారులు ఉన్నట్లు సమచారం. కలెక్టర్ అనితారామచంద్రన్ ఇప్పటికే దీనిపై కసరత్తు ప్రారంభించారు. ఎవరు ఎక్కడ ఉండాలన్నదానిపై మరింత స్పష్టతతో ముందుకు సాగుతున్నట్లు తెలిసింది.

17మంది తహసీల్దార్లు..జిల్లాలో భారీగా తహసీల్దార్ల బదిలీ జరుగనున్నది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వచ్చే నెలలో ఎన్నికల సందర్భంగా జిల్లాకు బదిలీపై వచ్చిన వారు తిరిగి ఆయా జిల్లాలకు బదిలీ కానున్నారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలోని 8 మంది తహసీల్దార్లు 3 జిల్లాలకు బదిలీ కాగా ఆయా జిల్లా నుంచి జిల్లాకు 8 మంది తహసీల్దార్లు బదిలీపై వచ్చారు. అయితే ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంటుతో పాటు పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తికావడంతో పాటు పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు, పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మాత్రమే ఉండడంతో బదిలీపై వచ్చినవారి జాబితాను తిరిగి ఆయా జిల్లాలకు బదిలీ చేసేందుకు జిల్లా ఉన్నతాధికారులు నుంచి ప్రభుత్వానికి జాబితా అందింది. ఎన్నికల సందర్భంగా వచ్చిన 17 మండలాల్లో తహసీల్దార్లు బదిలీ కానున్నారు. వీరితో పాటు రెండేండ్ల్లకుపైగా ఒకే మండలంలో పనిచేస్తున్న తహసీల్దార్లను కూడా బదిలీ చేసేందుకు నిర్ణయించారు. అయితే ఎన్నికల సందర్భంగా జిల్లాకు బదిలీపై వచ్చిన వారిని ఆయా జిల్లాలకు బదిలీ చేయనుండగా, దీర్ఘకాలంగా ఒకే మండలంలోని పనిచేస్తున్న తహసీల్దార్లను మాత్రం జిల్లాలోనే ఇతర మండలాలకు బదిలీ చేయనున్నారు. అదేవిధంగా గతంలో జిల్లాలో పనిచేసి ఎన్నికల సందర్భంగా ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన తహసీల్దార్లను తిరిగి గతంలో పనిచేసిన మండలాల్లోనే కాకుండా ఇతర మండలాల్లో పోస్టింగ్ ఇచ్చే విధంగా జాబితాను జిల్లా ఉన్నతాధికారులు సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. రెవెన్యూ శాఖలో పెరుగుతున్న అవినీతిని తగ్గించి, పూర్తి ప్రక్షాళన చేసే విధంగా గతంలో పనిచేసిన మండలాల్లో కాకుండా కొత్త మండలాల్లో పోస్టింగ్ ఇచ్చేందుకు నిర్ణయించారు.
ఎంపీడీవోల బదిలీలు..
జిల్లాలో ఎన్నికల సందర్భంగా బదిలీపై వచ్చిన ఎంపీడీవోలను సైతం బదిలీ చేసేందుకు జాబితా రెడీ చేశారు. అయితే ఎన్నికల సమయంలో జిల్లాలోని ఆయా మండలాల్లో పనిచేస్తున్న ఎంపీడీవోలను 9 జిల్లాలకు ,10 జిల్లాలో పనిచేస్తున్న ఎంపీడీవోలను జిల్లాకు బదిలీ చేశారు. ఎన్నికల సమయంలో జిల్లాకు 9 మంది ఎంపీడీవోలు బదిలీపై వచ్చిన 9 మండలాలతో బదిలీపై వచ్చిన మరో 5 మంది ఎంపీడీవోలను బదిలీ చేయనున్నారు. జిల్లాలో దీర్ఘకాలంగా ఒకే మండలంలో పనిచేస్తున్న పలువురు ఎంపీడీవోలతో పాటు మరి కొందరిని బదిలీ చేయనున్నారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న యాదగిరిగుట్ట, గుండాల మొదలైన మండలాలకు నూతన ఎంపీడీవోలు రానున్నారు. అయితే ఎంపీడీవోల బదిలీకి సంబంధించి వారి వారి సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఇచ్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. ఎంపీడీవోల సొంత జిల్లాల వివరాలను కూడా అధికారులు సేకరించే పనిలో ఉన్నట్లు సమాచారం.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...