పత్తి సాగుకు సై..


Fri,May 17, 2019 03:36 AM

-జిల్లాకు 2.70 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరం
-17 మండలాల్లో 90 పత్తి విక్రయ లైసెన్స్‌ డీలర్లు
యాదాద్రి భువనగిరిజిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : రైతులు పత్తి సాగుకు సిద్ధమవుతున్నారు. పత్తి, మిరప రొట్టలను తీసివేస్తూ.. కాల్చివేస్తున్నారు. ప్రస్తుతం ఇతర పంటలతో పోలిస్తే పత్తికి ధర పలుకుతుండటంతో జిల్లాలో 1.50 లక్షల ఎకరాలకు పైగా పత్తి సాగు చేసే అవకాశాలున్నాయి. వ్యవసాయశాఖ అందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించి మూడు లక్షల విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. నైరోబియాలో జరిగిన అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల సమావేశంలో పత్తి ఎగుమతులపై సబ్సిడీలను తొలగిస్తూ తీర్మానం చేశారు. బ్రెజిల్‌, అమెరికా, చైనా దేశాల్లో పత్తి పంట సాగు పెట్టుబడులు తక్కువగా ఉన్నాయి. మనదేశంలో పత్తిసాగు చేసి ఎగుమతులు చేయలేమని కేంద్ర ప్రభుత్వం భావించింది. సాగును తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆ పంట సాగు చేసే రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ప్రభుత్వ సూచనతో గతేడాది రైతులు పత్తి సాగు విస్తీర్ణం తగ్గించారు. దాని స్థానంలో పప్పు దినుసుల పంటలైన కంది, పెసర, సోయాబీన్‌ , ఇతర పంటలు సాగు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. దీంతో రైతులు పత్తిని తగ్గించి..కంది, పెసర, మిర్చి పంటలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లాలో గతేడాది పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 40,653 హెక్టార్లు అంటే.. 1, 32, 807 ఎకరాలలో సాగు చేశారు. గతేడాది పత్తి సాగు తక్కువ చేయాలని ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుని విజ్ఞప్తి చేయడంతో పంట శాతం తక్కువగా నమోదైంది. ఈ సారి పత్తి ధర పెరగడంతో రైతులు ఎంతైనా పత్తి సాగు చేసుకోవడానికి అవకాశాలు కల్పించింది. దాంతో పత్తిని 1.50 లక్షల ఎకరాల నుంచి 1.70 లక్షల ఎకరాలలో సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. బోల్‌గార్డ్‌ బీటీ విత్తనాలను వేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ దఫా వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు ‘ మన తెలంగాణ - మన వ్యవసాయం ’ లో పత్తిసాగును పెంచడమే ప్రధాన ఎజెండాగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పత్తికి ప్రత్నామ్నాయంగా గతేడాది వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు ఇతర పంటలను సాగు చేశారు. ఈసారి పత్తి పంటకు ధర పలుకుతుండగా, పంటలైన కంది, పెసర, మిర్చి పంటలకు కనీస మద్దతు ధర కూడా పొందలేకపోయారు. దీంతో ఏడాది రైతులు తిరిగి పత్తి సాగు వైపునకు దృష్టి మళ్లించారు. దీనిని గుర్తించిన విత్తన కంపెనీలు విత్తనాలను మార్కెట్‌లోకి పెద్ద ఎత్తున దించేందుకు ప్రణాళిక రూపొందించి రంగంలోకి దిగాయి.

విత్తన ప్యాకెట్లు 3 లక్షలు
జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉండటంతో పత్తి విత్తనాలను అందుబాటులోకి తెచ్చేవిధంగా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. జిల్లాలో 3 లక్షల విత్తన ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇప్పటికే పలు కంపెనీలు పత్తి విత్తనాలను మార్కెట్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉంచాయి. జిల్లాలోని 17 మండలాల్లో బోల్‌గార్డ్‌ బీటీ విత్తనాలు విక్రయించడానికి 90 మంది డీలర్లకు లైసెన్సులు ఉన్నాయి. ఫిక్స్‌డ్‌ రేటుపైన వీటిని విక్రయించనున్నారు. విక్రయానికి ఏ సమస్య తలెత్తకుండా కొత్తగా లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వ్యవసాయ శాఖ అనుమతి ఇస్తోంది. రైతులకు అందుబాటులో ఉండే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో ్త విత్తనాలను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపట్టింది.

450 గ్రాముల ప్యాకెట్‌ బోల్‌గార్డ్‌ బీటీ-1
ధర రూ. 630
450 గ్రాముల బోల్‌గార్డ్‌ బీటీ-1 పత్తి విత్తనాల ధర రూ. 630, బీటీ-2 పత్తి విత్తనాల ధర రూ. 730 గా నిర్ణయించారు. ఈ ధరతోనే విత్తనాలను విక్రయించాల్సి ఉంటుంది. ఏ కంపెనీకి చెందిన విత్తనాలైనా ఈ ధరకు మించి విక్రయించేందుకు అనుమతి లేదు. డిమాండ్‌ను బట్టి పలు కంపెనీలు అంతకు తక్కువ ధరకు కూడా విత్తనాలను అమ్మే అవకాశాలు కన్పిస్తున్నాయి.

పత్తి విత్తనాలపై అవగాహన ఆవశ్యం
పత్తి విత్తనాలపై రైతులు అవగాహన పెంచుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున పత్తి విత్తనాలు గ్రామాలకు చేరుకున్నాయి. పేరుకు 90 మంది డీలర్లయిన సబ్‌ డీలర్ల సంఖ్య వందల్లో ఉంటుంది. ఫలితంగా గతంలో నాసిరకం విత్తనాలు కూడా రైతులను అతలకుతలం చేశాయి. గుంటూరు, మాచర్ల, నాగర్‌కర్నూల్‌, హైదరాబాద్‌ నగరాల నుంచి జిల్లాకు పత్తి విత్తనాలు చేరుకున్నాయి. పత్తికి మంచి ధర ఉండడంతో భారీగా రైతులు అటువైపు దృష్టి సారించారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించడంతో పాటు అండమాన్‌ నికోబార్‌ దీవులు దాటిన నైరుతి రుతు పవనాలు చురుకుగా సాగుతున్నాయన్న సమాచారం ఆనందం కలిగిస్తుంది. మూసీ ఆయకట్టుకు క్రాఫ్‌ హాలిడే ప్రకటించడంతో భూగర్భజలాలు వర్షాధారంపై ఆధారపడి పంటలు వేసే రైతులు దుక్కులను సిద్ధం చేసుకుంటున్నారు. పత్తి సాగుకు రైతులు దుక్కులు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అడపదడప కురుస్తున్న అకాల వర్షాలకు దుక్కులు దున్నుతున్నారు. ఎర్ర, దుబ్బ, నల్ల రేగడి నేలల్లో ముందుగా పత్తిని వేసేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేలలు తేమను ఎక్కువ రోజులు ఆపుకుంటాయి. వర్షాలకు ముందుగానే పత్తిని నాటుతారు. ఈ ఏడాది రైతులు పత్తి విత్తేందుకు సమాయత్తమవుతున్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...