కార్పొరేట్ వల


Thu,May 16, 2019 12:16 AM

-ఆకట్టుకునే బ్రోచర్లు.. పదే పదే ఫోన్లు
-విద్యార్థుల ప్రవేశాలే లక్ష్యంగా మాయమాటలు
-జోరందుకున్న కార్పొరేట్ కళాశాలల ప్రచారం
-అయోమయంలో తల్లిదండ్రులు
-ప్రభుత్వ కళాశాలలే భేష్ అంటున్న విద్యావేత్తలు
-రికార్డు స్థాయి ఫలితాలు సాధిస్తున్న సర్వేల్ కళాశాల విద్యార్థులు

హైదరాబాద్ వంటి మహానగరాలకు చెందిన కార్పొరేట్ కాలేజీలు విద్యార్థుల ప్రవేశాలు చేపట్టేందుకు ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకుంటున్నాయి. ఇందులో స్థానికంగా ఉండేవారిని, కాస్త పలుకుబడి, మాట చెల్లుబాటయే వారిని ఏజెంట్లుగా ఎంపిక చేసుకుంటున్నాయి. సీవో, చైనా, స్పార్క్ బ్యాచ్ అని మసిపూసి మారేడు కాయ చేస్తున్నారు. విద్యార్థులను చేర్పించిన సంఖ్యను బట్టి వారికి కమీషన్లు ఇస్తున్నారు. వేలు, లక్షల్లో ఫీజులు వసూలు చేసే బడా విద్యాసంస్థలు అదే స్థాయిలో ఏజెంట్లకూ కమీషన్లు ఇస్తున్నాయి. దీంతో జిల్లాల నుంచి చాలా మంది ఏజెంట్లుగా మారుతున్నారు. ఇందులో నిరుద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సైతం ఉంటున్నారు. ఒక్కో విద్యార్థికి వేలల్లో కమీషన్ వస్తుండటంతో పట్టణాలు, మండల కేంద్రాలే కాకుండా మారుమూల గ్రామాలు, తండాల్లోకి సైతం వెళ్తున్నారు. విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని పాఠశాలలు, ఎస్‌ఎస్‌సీ బోర్డుల నుంచి సేకరిస్తున్నారు.

ఒక్కొక్కరి దగ్గరికి పదిసార్లు..
పదో తరగతి పరీక్షలు ప్రారంభానికి ముందు నుంచే ఏజెంట్లు తమ పని ముమ్మరం చేశారు. ఇక పరీక్షలు పూర్తయి.. ఫలితాలు రావడమే ఆలస్యం విద్యార్థుల ఇండ్లల్లో వాలిపోతున్నారు. ఎస్‌ఎస్‌సీ పరీక్షలు రాసిన విద్యార్థుల వద్దకు వెళ్లి తమ కళాశాలల గురించి చెప్పడం, తమ కాలేజీలో చేరండని యాజమాన్యాలు కోరడం సహజమే. కానీ కార్పొరేట్ కళాశాలల ఏజెంట్ల పనితీరే వేరు. వీళ్లు ఒక్కో విద్యార్థి ఇంటికి పదిసార్లు వెళ్తున్నారు. నిత్యం ఫోన్లు చేస్తూనే ఉంటారు. ఇక తమ కళాశాలల హంగు ఆర్భాటాలు, ఫలితాలను గొప్పగా చూపుతున్నారు. సారీ.. సార్ అయినా మాకంత స్థోమత లేదు.. మా పిల్లాడిని ఇక్కడే చదివిస్తాం.. అని తల్లిదండ్రులు చెప్పినా..వదలడం లేదు. లోకల్ కాలేజీల్లో స్టడీ ఏముంటదండీ..పిల్లాడి భవిష్యత్ కరాబవుతుంది. ఒక్కసారి ఆలోచించండి పిల్లలే మీ భవిత. వాళ్ల కోసం ఈ మాత్రం చేయలేరా అంటూ వాళ్లలో ధైర్యాన్ని, తాహతుకు మించి ఆశలు నూరిపోస్తున్నారు. ఒకటికి పదిసార్లు పదే పదే కళాశాల గొప్పతనాన్ని చెబుతుండటం, తామున్నామంటూ ఏజెంట్లు నమ్మబలుకుతుండటంతో చాలామంది మధ్య తరగతి తల్లిదండ్రులు లోలోపల తల్లడిల్లుతూనే తమ పిల్లలను కార్పొరేట్ కళాశాలల్లో చేర్పిస్తున్నారు.

ఒక్కసారి చేర్పిస్తే..
కార్పొరేట్ కళాశాలల్లో చదవడం మంచిదే కావొచ్చు. కానీ శక్తికి మించి అప్పులు చేసి తమ పిల్లలను అందులో చేర్పించే తల్లిదండ్రులకు తిప్పలు తప్పవు. గతంలో సంఘటనలను చూస్తే ఒక్కో కళాశాలలో సరైన తిండి ఉండదు. సరిపడా ఏర్పాట్లు ఉండవు. ఇరుకు, చీకటి గదుల్లో పదుల సంఖ్యలో విద్యార్థులను ఉంచుతారు. వేల వేలకు వేలు ఫీజులు కట్టించుకుంటున్నా విద్యార్థుల ఆరోగ్యాన్ని పట్టించుకోని ఎన్నో కళాశాలలను చూశాం. జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు గతంలో కార్పొరేట్ కళాశాలల్లో చేరి, అక్కడ సరైన వసతి, తిండి లేక తిరిగి వచ్చేశారు. ఇలా వచ్చిన విద్యార్థులకు కనీసం కట్టిన ఫీజులను తిరిగి చెల్లించలేదు. ఇలాంటి సందర్భాల్లో ఏజెంట్లను అడిగితే తమకేం సంబంధం.. ఒక్కసారి కళాశాలలో చేర్పించాం. అంతే ఇక కళాశాలతో మాకు సంబంధం ఉండదు. అంతా మీరే చూసుకోవాలంటూతప్పించుకుంటున్నారు. అలా పదుల సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు వేల రూపాయలు నష్టపోయారు. మళ్లీ తమ పిల్లలను లోకల్ కళాశాలలో చేర్పించారు.

సరైనదేదో గుర్తించాలి..
కార్పొరేట్ ఏజెంట్లు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మవద్దని, వాళ్లు చెప్పేదాంట్లో ఎంత నిజముందో గ్రహించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ప్రచారాలను మోసపోవద్దని, పనితీరును గుర్తించాలంటున్నారు. ర్యాంకులు, ఫలితాలను గొప్పగా చూపుతూ..హంగులు ఆర్భాటాలు చాటే కళాశాలలతో జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న పోటీ ప్రపంచంలో తమ పిల్లలను ఏదో చేయాలన్న తపనలో తప్పటడుగులు వేయొద్దని చెబుతున్నారు. ముందుగా పిల్లల ఇష్ట్టాలను తెలుసుకోవాలని, ఆ తర్వాతే వాళ్లను లోకల్‌గా మంచి కాలేజీలో చేర్పించాలా లేక కార్పొరేట్ కళాశాలలోనే చదివించాలా అన్నది నిర్ణయించుకోవాంటున్నారు. గతంలో సదరు కళాశాలలో చదివిన, చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ద్వారా విషయాలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. అంతే తప్పా కమీషన్లకు కక్కుర్తి పడే ఏజెంట్ల మాటలను గుడ్డిగా నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...