బీబీనగర్ గడ్డపై గులాబీ జెండాఎగురడం ఖాయం


Wed,May 15, 2019 11:59 PM

-టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు గోళి పింగళ్‌రెడ్డి
బీబీనగర్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీబీనగర్ గడ్డపై గులాబీ జెండా ఎగురడం ఖాయమని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు గోళి పింగళ్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో బీబీనగర్ పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓటేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాల్లో 12 స్థానాలను టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుచుకొని ఎంపీపీ పీఠం కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. అలాగే జడ్పీటీసీ అభ్యర్థి గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించనున్నారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా టీఆర్‌ఎస్ వైపే ఉన్నారన్నారు.

ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక టీఆర్‌ఎస్ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఓడిపోతామనే అక్కసుతో కాంగ్రెస్ నాయకులు అల్లర్లకు పాల్పడుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్నారు. వారి చేష్టలను మండల ప్రజలంతా గమనిస్తున్నారని, తగిన సమయంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత కక్షలకు పాల్పడకుండా మండలాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ అభ్యర్థి ఎరుకల సుధాకర్‌గౌడ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్, కార్యదర్శి పంజాల సతీశ్ గౌడ్, నాయకులు మల్లగారి శ్రీనివాస్, మంగ అశోక్, రాపర్తి రామకృష్ణ, కాసుల సత్యనారాయణ, నారగోని మహేశ్, కొండల్‌రెడ్డి, రాంకుమార్, నరేందర్ పాల్గొన్నారు.

ఎరుకల నాంచారమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ
భూదాన్‌పోచంపల్లి : మండల పరిధి పిలాయిపల్లిలో రాష్ట్ర ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 18న ఎరుకల నాంచారమ్మ జాతర నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఆయన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి జాతరలు జరుపుకోవడం వల్లన ప్రజల్లో ఐక్యత పెరుగుతుందన్నారు. ఈ జాతరను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎరుకల సంఘం నాయకులు కూతాటి భాస్కర్, కూతాటి మహేశ్, సాలయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
భువనగిరి అర్బన్ : మండలంలోని వీరవెల్లికి చెందిన అనపర్తి నర్సమ్మ (58) అనారోగ్యంతో మృతి చెందింది. ఈ సందర్భంగా చందుపట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం బాధిత కుటుంబానికి రూ.30వేల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో బ్యాంకు సీఈవో దంతూరి నర్సింహ, డైరక్టర్ న్యాలపట్ల పుండరీకం, సిబ్బంది నల్లమాసు రాములు, గుర్రం రాములు తదితరులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...