ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి


Wed,May 15, 2019 11:58 PM

భువనగిరి టౌన్ : పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనితారామచంద్రన్ ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్‌హాల్‌లో పోటీలో ఉన్న అభ్యర్థుల ఏజెంట్లు, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన సహాయ రిటర్నింగ్ అధికారులతో బుధవారం సమావేశమై ఓట్ల లెక్కింపుపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పనిని సహాయ రిటర్నింగ్ అధికారులు స్వయంగా సెగ్మెంట్ల వారీగా పర్యవేక్షించుకోవాలని ఆదేశించారు. సమస్యలకు కారణం కారాదని, సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా 14 టేబుల్స్‌పైన ఓట్ల లెక్కింపు చేపట్టాలని, ఆర్‌ఓ టేబుల్‌పైన పోస్టల్ బ్యాలెట్ లెక్కించాలన్నారు. ఓట్ల లెక్కింపు విషయంలో ఏజెంట్ల వివరాలను అందజేయాలని, తద్వారా పోలీసు వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించి 5 వీవీ ఫ్యాట్స్ లెక్కింపు చేపట్టాలని, ఇందుకు డ్రా పద్ధతిలో పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. లెక్కింపు రోజున ఉదయం 6.30 గంటలకు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, స్ట్రాంగ్ రూంలు తెరిచే సమయానికి అందుబాటులో ఉండాలన్నారు. 23వ తేదీ 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అనుమానాలను నివృత్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రతి సెగ్మెంట్‌కు ఒక వీడియోగ్రాఫర్‌ను ఏర్పాటు చేసుకోవాలని, కంప్యూటర్లు, ప్రింటర్లు ఇతర సామగ్రితో సిద్ధం కావాలన్నారు. సమర్థుడైన వ్యక్తిని స్ట్రాంగురూం ఇన్‌ఛార్జిగా నియమించుకోవాలని కలెక్టర్ ఏఆర్‌ఓలకు సూచించారు. కో ఆఫీసర్లను నియమించుకోవడంతో పాటుగా ప్రతి టేబుల్‌పై పోలింగ్ కేంద్రం నెంబర్లను నమోదు చేసుకుని వాటి ఆధారంగా ఓట్ల లెక్కింపు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జేసీ రమేష్, ప్రత్యేక అధికారి ప్రియాంక, సూర్యాపేట జేసీ సంజీవరెడ్డి, తుంగతుర్తి ఎఆర్‌ఓ , ఆర్డీవో సూరజ్‌కుమార్, డీఆర్‌వో వెంకటరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయకుమారి, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి మదన్‌కుమార్, పరిశ్రమల శాఖ అధికారి ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...