నేటి నుంచి జయంత్యుత్సవాలు


Wed,May 15, 2019 12:07 AM

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: భక్తుల కోరిన కోర్కెలు తీరుస్తూ కోరినవారికి కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీలక్ష్మీనరసింహుడు యాదాద్రిలో భక్తజనపరిపాలన చేస్తున్నారు. శ్రీవారు సాక్షాత్కారమైన ఘడియలను జయంతి మహోత్సవాలుగా అంగరంగ వైభవంగా మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. శ్రీలక్ష్మీనరసింహస్వామివారు వైశాఖ శుద్ధ చతుర్ధశి సంధ్యాసమయాన ఆవిర్భవించారు. అలాంటి మహిమాన్విత ఘడియలను గుర్తు చేసుకుంటూ పండుగ సంబురాలను జయంతి ఉత్సవాలుగా సకల భక్తజనుల కోలాహలంలో నిర్వహిస్తారు. శ్రీలక్ష్మీనరసింహుడు యాదగిరి శిఖరాగ్రమందలి విశాలమైన గుహలో రుష్యశృంగుడి కుమారుడైన యాదమహర్షి తపస్సు చేయగా హర్షించి పంచరూపాల్లో స్వయంభువుగా వెలిశారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రభావం ఎంతో మహిమాన్వితం. యాదాద్రిలో కొలువైన శ్రీహరి భక్తులు కోరిన కోర్కెలు, వరములను ప్రసాదిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో దీక్షగా ప్రదక్షిణాదులు చేయు భక్తులకు సాక్షాత్కరిస్తున్నారని భక్తుల నమ్మకం. నిత్యనూతన వైభవంతో పరమపవిత్రమైన ఉత్సవ విశేషములచే విశ్వవిఖ్యాతిని పొందింది.

అలాంటి మహిమాన్విత క్షేత్రంలో వైశాఖ శుద్ధ ఏకాదశి ఈ నెల 15 నుంచి 17 వరకు జరిగే ఉత్సవాలకు అశేష భక్తజనం తరలివస్తారు. మన రాష్ట్రంలో మన పాలన...మన యాదాద్రీశుడు అనే భావన విస్త్రృతమైన నేపథ్యంలో జరుగుతున్న ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. యాదాద్రి అభివృద్ధ్దికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ్ద చూపిస్తున్న తరుణంలో అందరి దృష్టి యాదాద్రిలో జరిగే శ్రీవారి జన్మనక్షత్రం సందర్భంగా జరిగే ఉత్సవాలపై కేంద్రీకృతమైనది. దాంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మన ఆలయాల్లో మన సాంప్రదాయాలు... మన వైభవం అంటూ భక్తిపారవశ్యంతో ఉప్పొంగిన యాదాద్రి పరవశాన్ని బ్రహ్మోత్సవాలు నలుదిశలా చాటి చెప్పాయి. యాదాద్రి కేంద్రంగా ఆధ్యాత్మిక విప్లవం అంటూ.. సాక్షాత్తు చినజీయర్‌స్వామివారు కొనియాడటం విశేషం. ఇంతటి ప్రాధాన్యత కలిగిన సమయంలో శ్రీలక్ష్మీనరసింహుని జయంతి ఉత్సవాలు జరుగనుండటంతో ఏర్పాట్లు ఆ స్థాయిలో చేసేందుకు అధికారులు నిమగ్నమయ్యారు.

స్వస్తీవాచనము...
పుణ్యాహావాచనము ఉత్సవాలకు శ్రీకారం..
15న ఉదయం 9.00 గంటలకు యాగశాల ప్రవేశం, స్వస్తీవాచనము, పుణ్యాహావాచనము, విశ్వక్సేనారధన, రుత్విక్వరణము, రక్షాబంధనమలు, అంకుర్పాణము, మూర్తి కుంభ స్థాపన, దివ్య ప్రబంధ, చతుర్వేద, మూలమంత్ర, మూర్తి మంత్ర, జప పారాయణములు, అగ్ని ప్రతిష్ట యజ్ఞ ప్రారంభము జరుగుతాయి. ఉదయం 10.30 గంటలకు లక్ష పుష్పార్చన యాగమండపములో నిర్వహిస్తారు. టిక్కెట్‌ వెల రూ. 1, 116 దంపతులకు మాత్రమే ప్రవేశము ఉంటుంది. ఉదయం 11: 30 గంటలకు శ్రీ వెంకటపతి అలంకారసేవ, సాయంత్రం 6:30 గంటలకు మృత్యంగ్రహణం, అంకురారోపణం, రాత్రి 8: 30 గంటలకు గరుడవాహనంపై పరవాసుదేవ అలంకారసేవ నిర్వహిస్తారు. 16న గురువారం రెండో రోజు ఉదయం 7 గంటలకు నిత్యహవనమలు, మూలమంత్ర, మూర్తిమంత్ర జపపారాయణములు, లక్షకుంకుమార్చన ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుంంది.

టికెట్‌ వెల రూ. 1, 116గా ఉంటుందని తెలిపారు. ఉదయం 11: 30 గంటలకు కాళీయ మర్ధనం అలంకారసేవ, రాత్రి 8:30 గంటలకు హనుమంతవాహనంపై రామావతారం అలంకారసేవ నిర్వహిస్తారు. 17న శుక్రవారం ఉదయం 7 గంటలకు నిత్యహవనము, మూలమంత్ర పారాయణములు, జపములు, సహస్రఘటాభిషేకము, ఆరాధన, ఆవాహన మహా పూర్ణాహుతి, నృసింహ జయంతి సందర్భంగా ఉదయం 7.30 గంటల నుంచి శ్రీస్వామివారి సహస్రఘటాభిషేకము నిర్వహింపబడుతుది. టికెట్‌ వెల రూ.2,000 ఉంటుంది. రాత్రి 7 గంటలకు శ్రీస్వామివారి జయంతిమహోత్సవము, నృసింహ అవతార అలంకారము, అవతార వైభవ ప్రవచనము, రాత్రి 9.00 గంటలకు తీర్థప్రసాద గోష్టి ఉత్సవ పరిసమాప్తి అవుతుంది. శ్రీలక్ష్మీనరసింహస్వామివారి జయంతి ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు భక్తులను అలరిచేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. శ్రీవారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ మూడు రోజులు శాశ్వత, నిత్య కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన హోమాలు నిర్వహించబడవు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...