15 నుంచి నృసింహుడి జయంతి ఉత్సవాలు


Mon,May 13, 2019 02:24 AM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ: యాదాద్రిశ్రీలక్ష్మీనరసింహస్వామివారి జయంతి ఉత్సవాలు ఈ నెల 15 నుంచి 17 వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఈవో ఎన్. గీత తెలిపారు. ఆదివారం ఆమె తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గతేడాది కన్నా వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మూడు రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.ప్రతి రోజు అలంకార సేవలు... విశేషపూజలు జరుగుతాయ, మొదటి రోజు లక్ష పుష్పార్చన, రెండో రోజు లక్ష కుంకుమార్చన, మూడో రోజు సహస్రఘటాభిషేకం నిర్వహించనున్నట్ల ఆమె తెలిపారు. శ్రీవారు సాక్షాత్కారమైన ఘడియలను జయంతి మహోత్సవాలుగా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మహిమాన్విత క్షేత్రంలో వైశాఖ శుద్ద ఏకాదశి ఈ నెల 15 నుంచి 17 వరకు జరిగే ఉత్సవాలకు తరలి వచ్చే భక్తజనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో మేడి శివకుమార్, దోర్భల భాస్కర్, జూశెట్టి కృష్ణాగౌడ్, ఆలయ పర్యవేక్షకులు సండ్ర మల్లేశ్, సార నర్సింహగౌడ్ పాల్గొన్నారు.

స్వస్తీవాచనము.. పుణ్యాహావాచనము ఉత్సవాలకు శ్రీకారం...
15న ఉదయం 9.00 గంటలకు యాగశాల ప్రవేశం, స్వస్తీవాచనము, పుణ్యాహావాచనము, విశ్వక్సేనారధన, రుత్విక్వరణము, రక్షాబంధనమలు, అంకుర్పాణము, మూర్తి కుంభ స్థాపన, దివ్య ప్రబంధ, చతుర్వేద, మూలమంత్ర, మూర్తి మంత్ర, జప పారాయణం, అగ్ని ప్రతిష్ట యజ్ఞ ప్రారంభం జరుగుతాయి. ఉదయం 10.30 గంటలకు లక్ష పుష్పార్చన యాగమండపములో నిర్వహిస్తారు. టికెట్ వెల రూ. 1,116 దంపతులకు మాత్రమే ప్రవేశము ఉంటుంది. ఉదయం 11: 30 గంటలకు శ్రీ వెంకటపతి అలంకారసేవ, సాయంత్రం 6:30 గంటలకు మృత్యంగ్రహణం, అంకురారోపణం, రాత్రి 8: 30 గంటలకు గరుడవాహనంపై పరవాసుదేవ అలంకారసేవ నిర్వహిస్తారు. 16న గురువారం రెండో రోజు ఉదయం 7 గంటలకు నిత్యహవనమలు, మూలమంత్ర, మూర్తిమంత్ర జపపారాయణములు, లక్షకుంకుమార్చన ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుంది. టికెట్ రూ. 1, 116గా ఉంటుందని తెలిపారు. ఉదయం 11: 30 గంటలకు కాళీయ మర్థనం అలంకారసేవ, రాత్రి 8:30 గంటలకు హనుమంతవాహనంపై రామావతారం అలంకారసేవ నిర్వహిస్తారు. 17న శుక్రవారం ఉదయం 7 గంటలకు నిత్యహవనము, మూలమంత్ర పారాయణం, జపములు, సహస్రఘటాభిషేకం, ఆరాధన, ఆవాహన మహా పూర్ణాహుతి, నృసింహ జయంతి సందర్భంముగా ఉదయం 7.30 గంటల నుంచి శ్రీస్వామివారి సహస్రఘటాభిషేకం నిర్వహింపబడుతుది. టికెట్ రూ. 2,000 ఉంటుంది. రాత్రి 7 గంటలకు శ్రీస్వామివారి జయంతి మహోత్సవము, నృసింహ అవతార అలంకారం, అవతార వైభవ ప్రవచనం, రాత్రి 9.00 గంటలకు తీర్థప్రసాద గోష్టి ఉత్సవ పరిసమాప్తి అవుతుంది. శ్రీలక్ష్మీనరసింహస్వామివారి జయంతి ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు భక్తులను అలరిచేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. శ్రీవారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ మూడు రోజులు శాశ్వత, నిత్య కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన హోమాలు నిర్వహించబడవు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...