తొలి రోజు 21 నామినేషన్లుv


Tue,April 23, 2019 12:48 AM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి నమస్తేతెలంగాణ : పరిషత్ ఎన్నికల్లో భాగంగా సోమవారం నుంచి మొదటి విడుత నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. జిల్లా పరిధిలో ఏ పార్టీల్లో కూడా ఇంకా అభ్యర్థుల జాబితా విడుదల కాలేదు. టీఆర్‌ఎస్ త రపున జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల అభ్యర్థుల ఎం పిక బాధ్యతను సీఎం కేసీఆర్ ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు అప్పగించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగగా.. సోమవారం నుంచి మొ దటి విడుత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడుత నామినేషన్ల స్వీకరణకు 24వ తేదీ వరకు గడువు కాగా 25న నామినేషన్ల పరిశీలన, 28న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉన్నది. మే 6న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగునున్నది. నామినేషన్ల దాఖలుకు మరో మూడు రోజులే అవకాశం ఉండటంతో ఆయా పార్టీల నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఆశావహులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఎన్నికల నియమావళి..
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అభ్యర్థులు స్నేహపూరిత పోటీతత్వ వాతావరణం ఉండేలా చూడాలి. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే జిల్లా ఎన్నికల అధికారి సిఫారసు మేరకు అభ్యర్థి యొక్క అభ్యర్థితత్వం రద్ధవుతుంది.

ఇంకా ఖరారు కాని అభ్యర్థులు..
చౌటుప్పల్ డివిజన్ పరిధిలో 5 జడ్పీటీసీ, 67 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. జిల్లా పరిధిలో ఏ పార్టీలో కూడా ఇంకా అభ్యర్థుల జాబితా విడుదల కాలేదు. నోటిఫికేషన్ రోజు జాబితాను విడుదల చేసేందుకు టీఆర్‌ఎస్ తరపున జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల కేటాయింపునకు సీఎం కేసీఆర్ ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు బాధ్యతలను అప్పగించారు. టీఆర్‌ఎస్ పార్టీ కోసం కృషి చేస్తున్న వారికీ జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల జాబితాలో చోటు కల్పించనున్నారు. కాగా..ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయం తెలియాల్సి ఉన్నది.

అభ్యర్థులు పాటించాల్సిన జాగ్రత్తలు..
జడ్పీటీసీ అభ్యర్థి రూ.4 లక్షలు, ఎంపీటీసీ రూ.1.50 లక్షలకు లోబడి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల అనంతరం వ్యయానికి సంబంధిచిన అన్ని వివరాలను బిల్లుల వారీగా నలభై ఐదు రోజుల్లోగా ఎంపీడీవోకు సమర్పించాల్సి ఉంటుంది. ఎంపీటీసీ అభ్యర్థులు వారి మండలాల్లో ఓటరుగా నమోదై ఉండాలి. జడ్పీటీసీ అభ్యర్థులు జిల్లా ప్రాదేశిక నియోజకవర్గంలో ఓటరుగా నమోదు కావాలి. మున్సిపాలిటీలో నమోదైన ఓటర్లు పోటీ చేయడానికి వీలులేదు.

మొదటి విడుత చౌటుప్పల్ డివిజన్‌లోనే..
జిల్లాలో మొదటి విడుత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్‌లో జరుగనున్నాయి. చౌటుప్పల్ డివిజన్ పరిధిలో మొత్తం 67 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇందులో చౌటుప్పల్, పోచంపల్లి, రామన్నపేట, వలిగొండ, సంస్థాన్‌నారాయణపురం ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. విడిజన్ పరిధిలోని 5 మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనుండగా అందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

సిబ్బంది నియామకం ఇలా..
ప్రతి మూడు ఎంపీటీసీ స్థానాకు ఒక ఆర్వో, ఏఆర్వోలను నియమిస్తారు. జడ్పీటీసీ స్థానానికి ఆర్వోగా అసిస్టెంట్ డైరెక్టర్ హోదా ఉన్న వారిని నియమిస్తారు. వీరు ఇరువురు మండల స్థాయిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు వరుసగా మూడు రోజులు (ప్రభుత్వ సెలవు దినాలు కూడా) స్వీకరిస్తారు.

ప్రచారం ఇలా...
ఎన్నికలకు 48 గంటల ముందు ఎటువంటి ప్రచారం చేయకూడదు. ఎన్నికల ప్రచార సమయంలో అభ్యర్థుల సంబంధిత అధికారి నుంచి ప్రచార అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల సమయంలో లౌడ్‌స్పీకర్ ఉదయం 10 నుంచి సాయంత్రం 6గంటల వరకు ఉపయోగించాలి. అనుమతి పొందిన బహిరంగ సమావేశాలు రోడ్‌షోలు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించుకోవాలి. ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తే సదరు వ్యక్తులకు మూడు నెలల జైలుశిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తారు.

తిరస్కరణకు గురైతే అప్పీలుకు అవకాశం..
పరిశీలనలో తిరస్కరించబడిన నామినేషన్లపై జడ్పీటీసీ అభ్యర్థులు ఐదోరోజు కలెక్టర్‌కు అప్పీలు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపీటీసీ అభ్యర్థులు ఆర్డీవోకు అప్పీలు చేయాలి. ఆరో రోజు అప్పీలుపై విచారణ, పరిశీలన చేస్తారు. ఏడోరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఫారం బీని పార్టీ అధ్యక్షుడు లేదా జనరల్ సెక్రెటరీ సిరా సంతకంతో నేరుగా ఆర్వోకు సమర్పించాల్సి ఉంటుంది. అధీకృత వ్యక్తి లేదా వ్యక్తులతో ఫారం బీని సమర్పించాలి.

అభ్యర్థులు సమర్పించాల్సిన దస్ర్తాలు..
నామినేషన్ పేపర్ ..
అభ్యర్థి నేర చరిత్ర, చర, స్థిర, ఆస్తులు, రుణాలు, అప్పులు, వృత్తి, విద్యార్హతలు, ఇద్దరు సాక్షులు, ప్రకటన దారుని సంతకంతో కూడిన స్వీయ ప్రకటన జతపరుచడం.

జీరో బ్యాలెన్స్ అకౌంట్ స్టేట్‌మెంట్ జిరాక్స్ కాపీ..
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వు స్థానాలకు కూడా కులధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా లేదా నామినేషన్ పేపర్ భాగం (3)లో గెజిటెడ్ అధికారితో ధ్రువీకరణ చేయాల్సి ఉంటుంది.

తొలిరోజు 21 నామినేషన్లు..
యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో 5 జడ్పీటీసీ, 67 ఎంపీటీసీ స్థానాలకు పలువురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. మొదటి రోజు 5 మండలాల్లో 21 నామినేషన్లు దాఖలయ్యాయి. పోచంపల్లిలో తొలిరోజు నామినేషన్లు దాఖలు కాలేదు. చౌటుప్పల్ మండలంలో ఎంపీటీసీలకు 8 మంది 8 నామినేషన్లు దాఖలు చేశారు. వలిగొండ మండలంలో 8 మంది 8 నామినేషన్లు దాఖలు చేశారు. సంస్థాన్‌నారాయణపురం మండలంలో ఇద్దరు అభ్యర్థులు 3 నామినేషన్లు దాఖలు చేశారు. రామన్నపేట మండలంలో ఇద్దరు అభ్యర్థులు 2 నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో తొలిరోజు 21 నామినేషన్లు దాఖలయ్యాయి. 5 జడ్పీటీసీలకు ఏ ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...