మోగిన నగారా


Sat,April 20, 2019 11:29 PM

- స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
- మూడు విడుతల్లో ఎన్నికలు
- మొదటి విడుత మే 6
- రెండో విడుత మే 10.. మూడో విడుత మే 14
- ఉదయం 7 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్
- మే 27న ఓట్ల లెక్కింపు .. అదే రోజు ఫలితాలు

స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎంపీ టీసీ, జడ్పీటీసీ పోలింగ్‌కు షెడ్యూల్ విడుదల చేసింది. జిల్లాలో మొత్తంగా మూడు విడుతల్లో ఎన్నికలు జరుగనుండగా.. తొలి విడుత ఎన్నికలు మే 6న, రెండో విడుత మే 10, మూడో విడుత మే14న నిర్వహించనున్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగనున్నది. మే 27న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు విడుదల చేస్తారు. జిల్లాలో 17 జడ్పీటీసీ, 17 ఎంపీపీ రిజర్వేషన్లను ఇప్పటికే ఖరారు చేశారు. బ్యాలెట్‌తో మూడు విడుతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నది. మరో వైపు ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసేందుకు కలెక్టర్ అనితారామచంద్రన్ జిల్లాలోని పోలీస్, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి నమస్తేతెలంగాణ : స్థానిక సంస్థల ఎన్నికలకు నగరా మోగింది. 3విడుతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. జూలై మొదటి వారంలో వీరి పదవీకాలం పూర్తికానున్న నేపథ్యంలో పదవీకాలం ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ పూర్తిగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నది. ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసేందుకు కలెక్టర్ అనితారామచంద్రన్ జిల్లాలోని పోలీసు, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్నికలను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని వారిని ఆదేశించారు.

అమలులో ఉన్న ఎన్నికల కోడ్..
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ముగిసినా మే 27 వరకు కోడ్ అమలులో ఉండనున్నది. ఈలోగా జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. జిల్లాల విభజన తరువాత మొదటిసారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 17జడ్పీటీసీ, 17 ఎంపీపీ రిజర్వేషన్లను ఇప్పటికే ఖరారు చేశారు. బ్యాలెట్‌తో మూడు విడుతల్లో ఓటింగ్ జరిపేందుకు యంత్రాంగం పూర్తి సంసిద్ధంగా ఉన్నది.

మూడు విడుతల్లో నామినేషన్లు..
జడ్పీటీసీ, ఎంపీటీసీ మొదటి విడుత నామినేషన్లు 22 నుంచి 24 వరకు కొనసాగుతాయి. రెండో విడుత 26 నుంచి 28 వరకు కొనసాగుతాయి. మూడో విడుత 30 నుంచి మే 2 వరకు ఉంటుంది. స్క్రూట్నీ మొదటి విడుత 25న, రెండో విడుత 29న, మూడో విడుత మే 3న, నామినేషన్ ఉపసంహరణ గడువు మొదటి విడుత 28 వరకు, రెండో విడుత మే 2 వరకు, మూడో విడుత మే 6 వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఫిర్యాదులు మొదటి విడుత 27న, రెండో విడుత మే1న, మూడో విడుత 5 వరకు ఫిర్యాదులు ఇవ్వవచ్చునని షెడ్యూల్ ప్రకటనలో పేర్కొన్నారు.

పోలింగ్ తేదీలు..
మొదటి విడుత మే 6న, రెండో విడుత మే 10న, మూడో విడుత మే 14న జరుగనున్నాయి. మే 27న ఓట్ల లెక్కింపు అదే రోజు ఫలితాలు విడుదల చేస్తారు. కౌటింగ్ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. ఎంపీటీసీలకు రూ.1.50 లక్షలు, రూ.జడ్పీటీసీలకు 4లక్షల వరకు వ్యయ పరిమితిగా నిర్ణయించారు.

బ్యాలెట్ బాక్సులు సిద్ధం..
ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులను అధికారులు సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది నియామకాన్ని పూర్తిచేసింది. ఎన్నికల సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలో ఆర్వో, ఏఆర్వో, మండల కేంద్రాల్లో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు తరగతులు నిర్వహించారు. జిల్లాలోని 17 మండలాల పరిధిలోని 4,80,210 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 969 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ఆధారంగా బీసీ కేటగిరిలకు ఓటరు జాబితాలో బీసీ గణన ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. మే 27 వరకు లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈ లోపే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తి చేసే విధంగా ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఏడాది జూలై 4 నాటికి జిల్లా పరిషత్ పాలకవర్గాలు కొలువుదీరాల్సి ఉండగా, షెడ్యూల్ వెలువడేలోగా స్థానిక ఎన్నికల కసరత్తు పూర్తిచేయనున్నారు. అందులో భాగంగా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లపై జరిగే పోలింగ్, ఓట్ల లెక్కింపు వంటి అంశాలపై జిల్లా వ్యాప్తంగా ఇటీవల జిల్లా కేంద్రంలో రిటర్నింగ్ (ఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ (ఏఆర్వో) అధికారులకు, అన్ని మండల కేంద్రాల్లో ప్రిసైడింగ్(పీవో), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీవోలు) శిక్షణ ఇచ్చారు. 2014 స్థానిక ఎన్నికలు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాతిపదికన జరిగితే 2019లో జరిగే ప్రాదేశిక ఎన్నికలు మాత్రం కొత్త మండలాలు, జిల్లాల పరిధిలో జరుగనున్నాయి. గతంలో ఉమ్మడి జిల్లాను సూర్యాపేట, యాదాద్రిభువనగిరి, నల్గొండ జిల్లాలుగా విభజించారు. జిల్లాల పునర్విభజన తర్వాత జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికలను కొత్తగా ఏర్పడిన రెవెన్యూ జిల్లాల ప్రకారం జిల్లా పరిషత్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇది వరకే గెజిట్ జారీ చేసింది. గుండాల మండలం భువనగిరి జిల్లాలో విలీనం కావడంతో 17 మండలాలను పరిగణలోకి తీసుకొని స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు.

మూడు విడుతల్లో ఎన్నికలు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు విడుతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగునున్నది. మే 27న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు తొలివిడుత ఈ నెల 22న రెండో విడుత 26, మూడో విడుత 30న ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. మొదటి విడుత జరుగనున్న ఎన్నికలకు 22 నుంచి 24 వరకు నామినేషన్లు, 25 తేదీన స్క్రూట్నీ ఉండనున్నది. 26న స్క్రూట్నీలో పోయిన వాటికి అప్పీల్ అవకాశం, 27న అభ్యంతరాలు, 28న విత్‌డ్రాలు, అదేరోజు అభ్యర్థుల చివరిలిస్టు వెల్లడించి, మే 6న ఎన్నికల నిర్వహిస్తారు. రెండో విడుతలో జరుగనున్న ఎన్నికలకు 26 నుంచి 28 వరకు నామినేషన్లు, 29 తేదీన స్క్రూట్నీ, 30న స్క్రూట్నీలో పోయిన వాటికి అప్పీల్ అవకాశం, 1న అభ్యంతరాలు, 2న విత్‌డ్రాలు, అదేరోజు అభ్యర్థుల లిస్టు వెల్లడించి మే 10న ఎన్నికలు నిర్వహిస్తారు. మూడో విడుత ఎన్నికలకు 30 నుంచి మే 2 వరకు నామినేషన్లు, 3న స్క్రూట్నీ, 4న స్క్రూట్నీలో పోయిన వాటికి అప్పీల్ అవకాశం, 5న అభ్యంతరాలు, 6న విత్‌డ్రాలు, అదేరోజు అభ్యర్థుల లిస్టు వెల్లడించి మే 14న ఎన్నిక నిర్వహిస్తారు. మూడు విడుతల్లో జరగనున్న ఎన్నికల్లో ఎక్కడైనా రీపోలింగ్‌కు అవసరమైతే తేదీని అప్పటికప్పుడే ఎన్నికల సంఘం ప్రకటించనున్నది. జిల్లాలో 17 మండలాలు ఉండగా 969 పోలింగ్ స్టేషన్ల ద్వారా ఎన్నికల జరుపుతారు.

ఎన్నికల కార్యక్రమం..
ఉమ్మడి జిల్లాలో తొలివిడుత ఎన్నికలు మే 6న 67 ఎంపీటీసీ స్థానాలకు, రెండో విడుత మే 10న 53 ఎంపీటీసీ స్థానాలకు, మూడో విడుత మే 14న 57 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. వరుసగా వస్తున్న ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండటంతో వచ్చేనెల 15వ తేదీలోపు ప్రాదేశిక పోరును పూర్తి చేయనున్నారు. మూడు విడుతల్లో ఎన్నికలు నిర్వహించి వచ్చే నెల 27 లెక్కింపు, ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని భువనగిరి డివిజన్ పరిధిలోని రెండు విడుతలుగా, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని స్థానాలకు ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు.

అధికారులకు శిక్షణ పూర్తి..
ప్రాదేశిక ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులు, పత్రాలతో జరిగే పోలింగ్, ఓట్ల లెక్కింపు వంటి అంశాలపై గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు తొలి విడుత శిక్షణ ఇచ్చారు. అదేవిధంగా ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల పరిధిలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు భువనగిరిలోని వెన్నెల కళాశాలలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బందికి విధులు, బాధ్యతలు, ఎన్నికల నిర్వహణలో వారి పాత్రపై శిక్షణ ఇచ్చారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల ప్రకారం ప్రాదేశిక ఎన్నికలను విజయవంతం చేయాలని డీఆర్‌డీవో సూచించారు.

గ్రామాల్లో రాజకీయ వేడి..
ఎన్నికల బరిలో దిగేందుకు ఆశావహుల ఉత్కంఠ పెరిగిపోయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా షెడ్యూల్ రావడంతో నేతలు తమ భవితవ్యంపై తీవ్రమైన ఉత్కంఠను అనుభవిస్తున్నారు. రెండు, మూడు రోజుల నుంచి శనివారం అధికారిక షెడ్యూల్ ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయన్నప్పటి నుంచి నేతలు తమ గాడ్ ఫాదర్ల వద్ద తమ తమ ప్రయత్నాలను తీవ్రం చేశారు. లోక్‌సభ ఎన్నికలు జరిగి పది రోజులు గడువక ముందే, మళ్లీ స్థానిక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రకటనతో గ్రామాల్లో రాజకీయ వేడి మొదలైనది. శాసనసభ తరువాతనే పంచాయతీ ఎన్నికలు, అవి పూర్తైన రెండు నెలల్లోనే పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ నుంచి కోలుకోక ముందే జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఖారారుతో గ్రామాల్లో మళ్లీ రాజకీయ వేడి పుంజుకుంటున్నది. గ్రామ, మండల స్థాయి నాయకుల్లో మాత్రం మళ్లీ ఎన్నికల జాతర ఉత్సాహం ఉట్టిపుడుతున్నది. పంచాయతీ ఎన్నికల్లో అవకాశాలు రాని గ్రామ, మండల స్థాయి నాయకులు ఎంపీటీసీ, ఎంపీపీ పదవులకు, ఎమ్మెల్యే ఎన్నికల్లో కలిసిరాని నేతలు జడ్పీటీసీ సభ్యుడిగా గెలిచి జడ్పీ సీటును దక్కించుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...