పంటనష్టంపై ప్రభుత్వానికి నివేదిస్తాం


Sat,April 20, 2019 11:19 PM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి నమస్తేతెలంగాణ : జిల్లాలో కురిసిన అకాల వర్షం, వడగండ్ల్లవాన వల్ల పంట నష్టపోయిన రైతుల వివరాలు ప్రభుత్వానికి పంపనున్నట్లు కలెక్టర్ అనితారామచంద్రన్ తెలిపారు. జిల్లాలో గరువారం, శుక్రవారం కురిసిన వడగండ్లవాన కారణంగా పంట నష్టపోయిన రైతులను కలెక్టర్ పరామర్శించారు. శనివారం యాదగిరిగుట్ట మండలం చోల్లేరు, భువనగిరి మండలం కూనురు, చందుపట్ల గ్రామాల్లో జిల్లా వ్యవసాయ అధికారి అనూరాధతో కలిసి పర్యటించి రైతుల పంట నష్టాన్ని పరిశీలించారు. వరి కోతదశలో ఉండి ప్రకృతి వైపరిత్యం కారణంగా నష్టం వాటిల్లడం దురదృష్టకరమన్నారు. వడగండల్లవాన కారణంగా గ్రామ్లా వరి పంట గింజరాలిపోయి నేలపాలైన సంఘటనలను కలెక్టర్ పరిశీలించారు. రైతులు పెట్టిన పెట్టుబడి తదితర వివరాలను కలెక్టరు రైతులను అడిగి తెలుసుకున్నారు. పంటలకు నీరు లేని పరిస్థితిలో పక్కరైతుల బావి నుంచి డబ్బు చెల్లించి పంటలకు నీరు పరఫరా చేసుకున్నామని, చేతికందిన పంట భూమి పాలైందని రైతులు కలెక్టర్‌కు వివరించారు. వారం 10 రోజుల్లో చేతికందే పంట నష్టపోవడం పట్ల రైతులు విచారం వ్యక్తం చేశారు.

నాలుగు నెలల వరి పంట కాలం అయినందున ఎప్రిల్, మే మాసాల్లో ప్రకృతి వైపరిత్యాల నుంచి పంటలను రక్షించుకునేందుకుగాను డిసెంబర్‌లోనే నాట్లు వేసుకుని మార్చిలోగా పంట చేతికి అందేలా ప్రణాళికాబద్దంగా వరి సేద్యం చేపట్టాలని, తద్వారా పంటలను రక్షించుకోవాలని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా పంటల బీమా పథకాన్ని నూరు శాతం సద్వినియోగం పరచుకోవాలని రైతులకు సూచించారు. ప్రాథమిక అంచనా మేరకు 4200ల ఎకరాలలో వరిపంట, 250 ఎకరాలలో మామిడి, 70 ఎకరాల్లో టమాటా పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ఈ సందర్బంగా వివరించారు. రైతువారీగా పంట వారీగా సర్వే జరిపి ప్రభుత్వానికి నివేదికలు పంపాలని కలెక్టర్ వ్యవసాయ హార్టికల్చర్ అధికారులు ఆదేశించారు. అలాగే యాదగిరిగుట్ట, భువనగిరి మండలాల్లో పండ్లతోటలకు జరిగిన నష్టాన్ని జేసీ రమేశ్, జిల్లా హార్టికల్చర్ అధికారి సురేశ్‌లు పరిశీలించారు. 220 ఎకరాల్లో పండ్లతోటలకు నష్టం వాటిల్లినట్లు వారు తెలిపారు. రాయిగిరిలో 9 , వంగపల్లిలో 9ఎకరాలు నష్టపోయిన మామిడి తోటల రైతులను కలిసి ధైర్యం చెప్పారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...