అకాల వర్షం.. అపార నష్టం


Wed,April 17, 2019 11:22 PM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : ఉరుములు మెరుపులతో కురిసిన రాళ్ల వాన జిల్లాలోని రైతుల అయోమయంలో పడేసింది. మామిడి, బత్తాయి తోటలకు అపార నష్టం వాటిల్లింది. బుధవారం సాయంత్రం కురిసిన వాన మిగిల్చిన నష్టంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. మండుటెండలతో మాడిపోతున్న వేళ మోస్తారుగా కురిసిన వర్షం చల్లదనం తీసుకువచ్చింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అనేక అవాంతరాలు ఎదుర్కొంటూ పండ్ల తోటలను కాపాడుకుంటున్న వస్తున్న పండ్ల తోటల రైతులకు ఏప్రిల్‌లో కురిసే వర్షాలు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. దుమారంతో చెట్లకు కాసిన మామిడి, బత్తాయి కాయలు రాలిపోతున్నాయి. కాయ బలంగా మారే సమయంలో గాలి వాన రావడంతో ఇన్నాళ్లు ఎంతో శ్రద్ధతో పంటను కాపాడుకుంటూ వస్తున్న రైతులు నష్టాల పాలవుతున్నారు. వడగండ్లు గోళీల పరిమాణంలో ఉండటంతో కాయలు సుళువుగా రాలిపోయాయి. రేకుల ఇండ్ల ప్రజలు రాళ్లవానతో భయాందోళనకు గురయ్యారు. చౌటుప్పల్ మండలం జైకేసారంలో తాడి చెట్టుపై పిడుగు పడటంతో చెట్టు పూర్తిగా కాలిపోయింది. చెట్టుపై గీత కార్మికుడు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

సంస్థాన్‌నారాయణపురం మండలంలోని అల్లందేవిచెర్వు గ్రామానికి చెందిన వ్యవసాయ రైతు సర్వి నర్సింహాగౌడ్ పొలంలో పని చేస్తున్న సమయంలో పక్కనే ఉన్న చెట్టుపై పిడుగు పడటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లో కూడా వర్షం ఇదే సమయంలో కురిసింది. యాదగిరిగుట్ట, ఆలేరు మండలాల్లో కురిసిన వర్షంతో పండ్ల తోటకు నష్టం జరిగిందని రైతులు నమస్తేతెలంగాణ ప్రతినిధితో మాట్లాడుతు చెప్పారు. ఆలేరు పట్టణంలో వీచిన గాలుల తీవ్రతకు మహమ్మద్ అనే వ్యక్తికి చెందిన రేకుల షెడ్డు కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరుగలేదు. గుండాల మండలం బండకొత్తపల్లిగ్రామంలో పిడుగు పాటుకు గురై గీత కార్మికుడు ఎరుకల సత్తయ్య మృతి చెందాడు.

ఆత్మకూరు(ఎం)లో మోస్తారు వర్షం
ఆత్మకూరు(ఎం) : ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం బుధవారం మండల కేంద్రంతో పాటు మొరిపిరాల, కొరటికల్ గ్రామాలలో కురిసింది. కురిసిన వర్షంతో ధాన్యం తడిసినప్పటికి రైతులు వర్షం పడడంతో హర్షం వ్యక్తం చేశారు.

పిడుగు పాటుకు తాటి దగ్ధం
చౌటుప్పల్ రూరల్ : జైకేసారం గ్రామంలో బుధవారం సాయంత్రం పిడుగు పడి తాటి చెట్టు దగ్ధమైంది. అదేగ్రామానికి చెందిన పల్లె సత్తయ్య ఇంటి సమీపంలోని తాటి చెట్టుపై పిడుగుపడి మంటలు చేలరేగాయి. చెట్టుపై భాగంలో పడటంతో ఒక్కసారిగా తాటి కమ్మలకు మంటలు వ్యాపించాయి. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయిన్పటికి ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్టి నష్టం జరుగలేదు. పెనూ ప్రమాదం తప్పడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.

వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యం
చౌటుప్పల్, నమస్తేతెలంగాణ : అకస్మాత్తుగా కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులోని ధాన్యం తడిసి ముద్దయ్యింది. బుధవారం సాయంత్రం మేఘావృతమై ఒక్కసారిగి వర్షం కురిసింది. ధాన్యంపై తాడిపత్రీలు కప్పేందుకు రైతులు ప్రయత్నించిన లాభంలేకుండా పోయింది. తడిసిన ధాన్యం రాసులపై నిల్చిన వర్షపు నీటిని తొలగించేందుకు రైతులు శ్రమించారు.

పిడుగుపాటుకు ఒకరికి తీవ్రగాయాలు
సంస్థాన్‌నారాయణపురం: మండల పరిధిలోని అల్లందేవిచెర్వు గ్రామంలో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన మోత్సారు వర్షం కురిసింది. గ్రామానికి చెందిన సుర్వి నర్సింహగౌడ్ తన వ్యవసాయ పొలం వద్ద పనులు చేసుకుంటుండగా పక్కనే ఉన్న చెట్టుపై పిడుగు పడటంతో నర్సింహగౌడ్‌కు చేతికి, నడుముకు గాయాలు అయినవి. గ్రామ సర్పంచ్ సుర్వి యాదయ్యగౌడ్‌కు సమాచారం తెలియడంతొ వెంటనే చౌటుప్పల్ దవఖానాలో చికిత్స చేయించారు. గ్రామంలోని విద్యుత్ స్తంభాలు పక్కకు ఒరుగడంతో తీగలు నేలకు తాకినవి. సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగినది.

రామన్నపేట : ఉరుములు, మెరుపులతో అకాల వర్షం కురిసింది. బుధవారం మండలంలోని అక్కడక్కడా కురిసిన వర్షానికి ఐకేపీ కేంద్రాల్లో కొద్దిపాటి ధాన్యం తడిసింది. రామన్నపేట వ్యవసాయ మార్కెట్‌లో కుప్పలు పోసిన ధాన్యం సమయానికి తాడిపత్రి లేక ధాన్యం తడిసింది. కొద్దిపాటి నష్టం వాటిల్లింది.

ఉరుములతో కూడిన వర్షం
ఆలేరుటౌన్ : ఉదయం నుంచి వడగాల్పులు సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. సుమారు గంట సేపు ఉరుములు, మెరుపులతో గాలి దుమారంతో వర్షం కురిసింది. ఆకస్మాత్తుగా వచ్చిన వర్షంతో పట్టణంలోని విద్యుత్ నిలిచిపోయింది.

వడగాలికి పాడిఆవు మృతి
ఆలేరుటౌన్ : వారం రోజులుగా వీస్తున్న వడగాల్పులతో ఆలేరు పట్టణం, అంబేద్కర్‌కాలనీకి చెందిన ఎర్రోళ్ల కిష్టయ్య అనే వ్యక్తికి చెందిన పాడిఆవు మృతి చెందింది. రోజు మాదిరిగానే పోలంలో మేత మేసిన ఆవు మధ్యాహ్నం 2 గం.లకు షెడ్‌కు వచ్చిందని, షెడ్‌లో ఉన్న మంచినీరు త్రాగిన 10 నిముషాలకు ఆవు క్రిందపడి చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన ఆవు 70,000 వరకు ఉంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు.

గాలిదుమారంతో కూలిన షెడ్
ఆలేరు పట్టణానికి చెందిన మహ్మద్ అబ్బాస్ అనే వ్యక్తి కి చెందిన గాలిఫంక్చర్ రేకులషెడ్ బుధవారం సాయంత్రం 4 గం.లకు వీచిన గాలులకు కూలిపోయింది. కూలిన సమయంలో షెడ్‌లో ఎవరు లేకపోవడంతో ఎవరికి ఎలాంటి ప్రాణప్రాయం కలగలేదు.

బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు
పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలో జనగాం డిపోకు చెందిన బస్సు ఒక వ్యక్తిని ఢీకొనడంతో తీవ్రగాయాలైనాయి. అంబేద్కర్‌కాలనీకి చెందిన గంధమల్ల సుదర్శన్ అనే వ్యక్తిని జనగాం నుంచి హైదరాబాద్‌కు వెళ్లుతున్న ఆర్‌టీసీ బస్సు ఢీకొనడంతో తలకు గాయాలైనాయి. బంధువుల వెంటనే అతనిని ఆలేరు ఏరియా దవాఖనకి తరలించగా వైద్యులు సుదర్శన్‌ను అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.

గుండాల : మండలంలోని కొమ్మాయిపల్లి, వెల్మజాల, మరిపడిగ, గంగాపురం గ్రామాల్లో బుధవారం సీసపు గోలీల సైజుతో కూడిన రాళ్ల వర్షం పడింది. వరి పంట దెబ్బ తిన్నది. మామిడి కాయలు నేల రాలాయి. గంగాపురం, గుండాల గ్రామాల మధ్య విద్యుత్ స్తంభం కూలిపోవడంతో మండలంలో అంధకారం నెలకొన్నది. మండల కేంద్రంలోని సీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో వర్షానికి ధాన్యం కొట్టుకపోగా తూకం వేసిన బస్తాలు తడిసి ముద్దయ్యాయి. సుద్దాల కొనుగోలు కేంద్రంలో ధాన్యం నీళ్లలో తడిసిపోయింది.

146
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...