రైతన్న సంక్షేమమే లక్ష్యం


Tue,April 16, 2019 11:28 PM

-కొనసాగుతున్న రైతు సమగ్ర సర్వే
-భూ విస్తీర్ణం, స్వభావం, పంటల సాగు వివరాల సేకరణ
-మే 15వ తేదీ వరకు పూర్తి చేసేలా కసరత్తు
-17 మంది వ్యవసాయాధికారులు, 86 మంది ఏఈవోలతో సర్వే
-సేకరించిన డాటాను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్న సిబ్బంది
-జిల్లాలో మొత్తం రైతులు 1,79,030
యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి నమస్తేతెలంగాణ : రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం రైతు సమగ్ర సర్వే చేపట్టింది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభం కాగా మే నెల 15వ తేదీ వరకు పూర్తి చేసే విధంగా వ్యవసాయ విస్తరణాధికారులు కృషి చేస్తున్నారు. రైతుకు ఉన్న భూమి, స్వభావం, విస్తీర్ణం, ఏ పంటలు వేస్తున్నారు.. ఎక్కడ విక్రయిస్తున్నారు.. తదితర అంశాలతో పార్ట్-ఏ, పార్ట్-బీలుగా విభజించి అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రతి 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారి పని చేస్తున్నారు. ఏ రోజుకారోజు మొత్తం డేటాను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. తద్వారా రాబోయే కాలంలో రైతు సంక్షేమ కార్యక్రమాలను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ఈసమాచారం ఉపయోగపడనున్నది. జిల్లాలో మొత్తం 1.79, 030 లక్షలమంది రైతులు ఉన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతును ఆర్థికంగా పరిపుష్టిగా తయారు చేయాలనే సంకల్పంతో అనేక పథకాలు ప్రవేశపెట్టింది. అదే దిశలో మరో ముందడుగు వేసింది. ప్రతి రైతుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం వల్ల సమాచారం క్రోడీకరించి భవిష్యత్‌లో అమలు చేయబోయే కార్యక్రమాల రూపకల్పనకు ఈ సర్వే ఎంతో దోహదం చేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.

దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. సీఎం కేసీఆర్ స్వయంగా రైతు కావడం వల్ల రైతుల బాధలు తెలిసిన నాయకుడిగా నాలుగున్నర సంవత్సరాలుగా రైతు సంక్షేమమే ధ్యేయంగా అనేక కార్యక్రమాలు అమలు చేశారు. వ్యవసాయాన్ని పండుగ అని నిరూపించేందుకు మొట్టమొదటగా చెరువుల పునరుద్ధరణతో రైతాంగ సంక్షేమానికి ఉపయోగపడే కార్యక్రమాలు ప్రారంభించారు. 2022 వరకు తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందిచాలనే ఏకైక లక్ష్యంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇకపోతే ప్రతి 5వేల ఎకారాలకు ఒకరు చొప్పున వ్యవసాయ యాంత్రీకరణకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి సబ్సిడీపై అనేక వ్యవసాయ పరికరాలను రైతులకు అందజేస్తున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనతో అనేక సమస్యలకు పరిష్కారం చూపించారు.

రైతులను అప్పుల ఊబిలో నుంచి రక్షించేందుకు, వ్యవసాయానికి పెట్టుబడి కోసం ఇతరుల వద్ద చేయి చాచకుండా చేసేందుకు ప్రభుత్వమే రైతుబంధు పథకం కింద సంవత్సరానికి ఎకరాకు రూ.8వేలు అందించే బృహత్తర పథకాన్ని అమలులోకి తీసుకువచ్చారు. వచ్చే వర్షాకాలం నుంచి ఎకరాకు రూ.10 వేలకు అందజేయనున్నారు. మరోవైపు రైతుబీమా పథకం అమలుతో రైతుల కుటుంబాల్లో భరోసా నింపింది. గత సంవత్సరం రైతులకు సంబంధించిన వివరాలు సేకరించినా, పూర్తిస్థాయిలో వివరాల సేకరణకు ప్రభుత్వం రైతు సమగ్ర సర్వేకు ఉపక్రమించింది. ఈ మేరకు వ్యవసాయ విస్తరణాధికారులు రైతుల సమగ్ర సర్వే తర్వాత, వాటి ఆధారంగా వివిధ పథకాలను రూపొందించాలన్నది.

ప్రభుత్వ ఉద్దేశం ప్రధానంగా పంట కాలనీల ఏర్పాటు, వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మసేద్యం, కనీస మద్దతు ధర కల్పించడం, రైతులకు ఆన్‌లైన్‌లో చెల్లింపులు, ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు, డీబీటీ పద్ధతిలో సబ్సిడీ చెల్లింపు, రైతుబంధు, రైతుబీమా పథకాల అమలుకు సర్వేలో వచ్చిన సమాచారాన్ని ఉపయోగించడం జరుగుతుంది. జిల్లా పరిధిలో సుమారు 2, 96, 500 ఎకరాల భూమి ఉన్నది. జిల్లాలో వ్యవసాయ విస్తరణాధికారులు 86 మందికిగానూ 77మంది పనిచేస్తున్నారు. మండల వ్యవసాయాధికారులు 17 మంది కలిసి ఈ సర్వే చేపడుతున్నారు. మండల స్థాయిలో పనిచేసే వ్యవసాయాధికారులు సమన్వయం చేస్తూ ఈ సర్వే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వేసవి ఎండలు పెరిగిపొవడం వల్ల ప్రతిరోజు ఉదయం 8గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి 6గంటల వరకు సర్వే చేపడుతున్నారు. ఉదయం సేకరించిన రైతుల వివరాలను అదేరోజు మధ్యాహ్నం సమయంలో అన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

పూర్తిస్థాయిలో వివరాల సేకరణ..
రైతు సమగ్ర సర్వే సందర్భంగా వ్యవసాయాధికారులు రైతులకు సంబంధించిన ప్రతి అంశం సేకరిస్తారు. గతంలో కొన్ని అంశాలకు సంబంధించిన వివరాలే సేకరించారు. ప్రస్తుతం సేకరించే అంశాలతో రాబోయే కాలంలో రైతు సంక్షేమ కార్యక్రమాలు మరింత పకడ్బందీగా, పారదర్శకంగా,అసలైన రైతులకీ చేరేలా అమలు చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇందులోనే ప్రధానంగా అసైన్డ్ భూమి ఉన్నవారు సాగులో లేకపోయినా ఇప్పటికీ రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం పొందుతున్నారు. మరోవైపు వ్యవసాయ యంత్ర పరికరాలను సైతం సబ్సిడీపై తీసుకుంటున్నారు. కొందరికి ఉన్న భూమి వ్యవసాయ యోగ్యం కానిదైనా అనేక పథకాల ద్వారా లబ్ధి పొందుతుండటం గమనార్హం. రైతులకు సంబంధించిన సమగ్ర వివరాల సేకరణతో అక్రమాలకు అడ్డుకట్ట వేయడం, నిజమైన రైతులకు మరింత మేలు చేసే కార్యక్రమాలు అమలు చేయడానికి ఈ సర్వే ఎంతో దోహదం చేస్తుందని చెప్పవచ్చు.

రైతుల వద్ద నుంచి పార్ట్-ఏలో సేకరించే అంశాలు..
రెవెన్యూ రికార్డుల ఆధారంగా రైతు పేరు, పట్టాదారు పాసుపుస్తకం నెంబరు, సర్వే నెంబర్ల వారీగా ఉన్న భూమి వివరాలు
తండ్రి, లేదా భర్త పేరు సహా ఆధార్‌కార్డులో ఉన్నట్లుగా రైతు పేరును నమోదు చేయాలి.
రైతు మొబైల్ నంబర్ నమోదు చేయాలి. రైతుబంధు పథకానికి ఇచ్చిన నెంబర్‌ను తీసుకోవాలి.
ఆధార్ నెంబర్ నమోదుతోపాటు, రైతు సంతకం లేదా వేలిముద్రతో కూడిన ఆధార్ జిరాక్స్ కాపీని తీసుకోవాలి.
ఆధార్‌కార్డులో ఉన్న పుట్టిన తేదీ నమోదు చేయాలి. పుట్టిన తేదీ కాకుండా పుట్టిన సంవత్సరం ఉంటే ఏ రైతులకైనా జూలై ఒకటో తేదీని వారు పుట్టిన తేదీగా పేర్కొనడం జరుగుతుంది.

రైతుకు సంబంధించిన బ్యాంకు ఖాతా నెంబరు, బ్యాంకు పేరు, బ్రాంచి పేరు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్
రైతుబీమా కోసం సేకరించిన వివరాల ప్రకారం సామాజిక హోదా
రైతు బీమా సందర్భంగా తీసుకున్న ఎల్‌ఐసీ ఐడీ నెంబర్
పార్ట్-బీలో సేకరించే అంశాలు..
రైతు విద్యార్హతలు, తనకున్న భూమి సాగుకు యోగ్యమైనదా కాదా. నీటి వసతి ఉందా లేదా.. ఎలాంటి వసతి కలిగి ఉన్నది.. సూక్ష్మ సేద్యం ఏర్పాటు చేసుకున్నారా సర్వే నెంబర్ల వారీగా స్పష్టమైన వివరాల సేకరణ
నేలల స్వభావం, భూసార కార్డులు
రైతు పంటల బీమా ప్రీమియం చెల్లించారా
ఎలాంటి పంటలు పండిస్తున్నారు. కూరగాయలు, పూలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు వంటివి గతేడాది ఏమైనా వేశారా.
వానాకాలం సాగుకు ఎరువులు, విత్తనాల ప్రణాళిక కోసం సమాచారం
2018-19లో వేసిన పంటలు వివరాలు, రాబోయే వానాకాలంలో ఏ పంటలు వేయనున్నారు.
వ్యవసాయ యంత్రాలు ఏమి కలిగి ఉన్నారు, వరికోత యంత్రాలు, ట్రాక్టర్లు, స్ప్రేయర్లు తదితరాలు
రైతు పంటరుణం తీసుకున్నారా లేదా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారా.
కిసాన్ పోర్టల్ నుంచి రైతులకు ఎస్‌ఎంఎస్‌లు వస్తున్నాయా పశుసంపద ఏ మేరకు ఉన్నది.. వాటి వివరాలు
సేంద్రీయ సాగుపై రైతు ఆసక్తి కలిగి ఉన్నారా.
రైతు ఉత్పత్తి సంఘాల్లో సభ్యులుగా ఉన్నారా లేదా రైతుకు మొబైల్ ఫోన్ ఉంటే అందులో తప్పనిసరిగా కిసాన్ సువిధ, పంటలు యాజమాన్య యాప్‌లను ఏఈవోలు డౌన్‌లోడ్ చేయాలని సూచించారు.
ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే బాగుంటుందా ఎలాంటివి పెట్టాలని భావిస్తున్నారో తెలుసుకోవాలి.
2018-19లో పండించిన పంటలను ఎలా అమ్ముకున్నారు. దళారులకా, ప్రభుత్వ సంస్థలకు అమ్ముకున్నారా.

అన్ని వివరాలు సేకరిస్తున్నాం..
రైతు సమగ్ర సర్వేలో రైతులకు సంబంధించిన అన్ని వివరాలు సేకరిస్తున్నాం. ప్రతి రైతుకు సంబంధించిన 39 అంశాలను సేకరించడంతోపాటు ప్రతి రోజూ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నం రాబోయే కాలంలో ఏ పథకం అమలుకైనా ఈ సర్వే ఎంతో దోహదం చేస్తుంది. సేకరించిన వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం వల్ల ప్రతి అంశానికి మళ్లీ రైతు దగ్గరకు వెళ్లకుండా ఆన్‌లైన్ ద్వారానే తెలుసుకోవచ్చు. ఎన్నికల వల్ల సర్వే కొంత నెమ్మదిగా కొనసాగింది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి సైతం వ్యవసాయాధికారులు, విస్తరణాధికారులను ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని కలెక్టర్ అనితారామచంద్రన్‌ను కోరడం జరుగుతుంది. మే నెల 15వ తేదీ వరకు సర్వే పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయం చేసుకుంటూ సర్వే కొనసాగిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఏఈవోలు రైతు సమగ్ర సర్వే చేస్తున్నారు.
-కునుమల్ల అనురాధ, జిల్లా వ్యవసాయాధికారి

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...