కనుల పండువగా లక్ష పుష్పార్చన


Tue,April 16, 2019 12:56 AM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ: శ్రీలక్ష్మీనరసింహస్వామివారికి సోమవారం లక్ష పుష్పార్చనను కనుల పండువగా నిర్వహించారు. ఏకాదశి కావడంతో శ్రీవారికి లక్ష పుష్పాలతో కొలుస్తూ అపురూపంగా పూజాకైంకర్యాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు ఉప ప్రధానార్చకులు చింతపట్ల రంగాచార్యులు బట్టర్ సురేంద్రాచార్యులు ఆధ్వర్యంలోని అర్చక బృందం శ్రీలక్ష్మీనరసింహునికి లక్ష పుష్పార్చనను ఘనంగా నిర్వహించారు. ఏకాదశి రోజున లక్ష పుష్పార్చన చేయడం ఆనవాయితి. నిత్య పూజల సందడి కొనసాగుతున్నది. తెల్లవారు జాము నాలుగు గంటల నుంచి నిత్య పూజల కోలాహలంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఏకశిఖరవాసుడిని దర్శించి తరించాలన్న సంకల్పంతో తెల్లవారు జాము నుంచి జరిగిన అన్ని పూజల్లో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. ప్రతీ రోజు నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు.

ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన శ్రీస్వామి అమ్మవార్లలకు హారతి నివేదన జరిపారు. ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం, తులసీ అర్చన చేశారు. స్వర్ణపుష్పార్చన దర్శనమూర్తులను అర్పించారు. శ్రీవారి నిత్యకల్యాణం నిర్వహించారు. మహా మండపంలో అష్టోత్తరం, అలంకార సేవోత్సవాలను నిర్వహించారు. రామలింగేశ్వరాలయంలో మహాశివుడిని ఆరాధిస్తూ అభిషేకం, అర్చన చేపట్టారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. ఆలయ పుష్కరిణీ చెంత భక్తులు పుణ్యస్నానం ఆచరించి సంకల్పంలో పాల్గొన్నారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్టమూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని యాదాద్రి డీసీపీ నారాయణరెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఘనంగా వ్రత పూజలు
యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే సత్యనారాయణస్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. వ్రత పూజల ద్వారా రూ.1, 08, 000ల ఆదాయం సమకూరింది. సత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

శ్రీవారి ఖజానాకు రూ. 12,09,892 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ.12,09,892 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ.88,394, 100 రూపాయల టికెట్‌తో రూ.73,600 కల్యాణకట్ట ద్వారా రూ.46,000 గదులు విచారణ శాఖతో రూ.87,280 ప్రసాదవిక్రయాలతో రూ.5,74,695 శాశ్వత పూజలతో రూ.10,116, అన్ని విభాగాలు కలుపుకుని శ్రీవారి ఖజానాకు రూ. 12,09,892 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఆదాయ శాఖ అధికారులు తెలిపారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...