కస్తూర్బాలో వేసవి శిక్షణ


Tue,April 16, 2019 12:55 AM

కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో గ్రామీణ ప్రాంత బాలికలు అధికంగా విద్యనభ్యసిస్తున్నారు. ఇక్కడ చదివే పిల్లల్లో చాలామంది తల్లిదండ్రులు లేని వారే. మరికొంత మందికి తల్లిదండ్రులు ఉన్నప్పటికీ ఉపాధికోసం వలస వెళ్లిన వారే ఉంటారు. వీరంతా వేసవిలో ఎక్కడ గడపాలో తెలియని పరిస్థితి. అలాంటి పిల్లల కోసం ప్రభు త్వం, విద్యాశాఖ వేసవి శిక్షణా శిబిరాలను నిర్వహిస్తోంది. ఈనెల 15 నుంచి మే 30 వరకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో 59 కస్తూర్బా పాఠశాలలు
నల్లగొండ ఉమ్మడి జిల్లాలో 59 కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో నల్లగొండ జిల్లాలో 27, సూర్యాపేటలో 18, యాదాద్రి భువనగిరి జిల్లాలో 14 పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలలకు ఏప్రిల్ 13 నుంచి మే 31వరకు వేసవి సెలవులు ప్రకటించారు. వీటిలో తల్లిదండ్రులు లేకుండా ఉన్నవారు, వలస వెళ్లిన తల్లిదండ్రులకు చెందిన పిల్లలకు ప్రత్యేక వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఇందు కోసం నల్లగొండ జిల్లాలోని నిడమనూరులో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఎంపిక చేశారు. ఈ నెల 16 నుంచి శిక్షణ శిబిరం ప్రారంభం కానుంది.

9 అంశాల్లో శిక్షణ
కస్తూర్బాలోని విద్యార్థులకు 45 రోజుల పాటు అకాడమిక్ అంశాలతో పాటు 9 కోకరిక్యులర్ అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. అకాడమిక్ అంశాలలో ఇంగ్లీష్, గణితం, సోషల్ స్టడీస్, సైన్స్‌లో శిక్షణ నిస్తారు. అదే విధంగా కోకరిక్యులర్ యాక్టివిటీస్‌లో డ్యాన్స్, మ్యూజిక్, ఒకేషనల్, లైఫ్ స్కిల్సు, ఫిజికల్ ఎడ్యుకేషన్‌తో పాటు ఇతర అంశాలలో శిక్షణ నివ్వనున్నారు. శిక్షణతో పాటు విద్యార్థుల జీవిత లక్ష్యానికి సంబంధించిన వారు మానసికంగా, శారీరకంగా ఉండేలా శిక్షణలో తీర్చిదిద్దనున్నారు.

200 మందికి శిక్షణ...
ఉమ్మడి జిల్లాలోని 59 పాఠశాలల నుంచి 200 మంది విద్యార్థులను శిక్షణ కోసం ఎంపిక చేశారు. వీరందరికీ ఆశ్రయం కల్పిస్తూ శిక్షణ కొనసాగిస్తారు. వీరిని 10 గ్రూపులుగా విభజించి శిక్షణ ఇవ్వనున్నారు. వీటిలో యోగా, స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యునికేషన్ స్కిల్స్, గణితం, అబాకస్, డ్యాన్స్, పాటలు, కబడ్డీ, వాలీబాల్, టెన్నికాయిట్, మార్షల్ ఆర్ట్స్, ఆత్మ విశ్వాసాన్ని రూపొందించే కార్యక్రమాలు ఉండనున్నాయి.

కస్తూర్బా పాఠశాలల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల బాలికలే విద్యనభ్యసిస్తున్నారు. వేసవి సెలవుల్లో వారి తల్లిదండ్రులు పనులకోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో విద్యార్థినులు ఇబ్బందులు పడకుండా ఉండడంతో పాటు.. వారికి వివిధ అంశాల్లో నైపుణ్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం వేసవి ప్రత్యేక శిక్షణకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన 200 మంది బాలికలకు నిడమనూరు కస్తూర్బా పాఠశాలలో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రారంభమైన శిబిరం మే 30 వరకు కొనసాగనుంది.

బాలికల్లో విద్యా నైపుణ్యాలు పెంచేందుకే
కస్తూర్బా విద్యాలయాల్లో చదువుతున్న బాలికల్లో ఆత్మైస్థెర్యంతో పాటు విద్యా నైపుణ్యాలు పెంచేందుకే వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం, విద్యాశాఖ ఆదేశాలతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కస్తూర్భాల్లోని 200 మంది బాలికలకు అవకాశం కల్పించాం. ఈ నెల 15 నుంచి మే 30 వరకు 45 రోజులు శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణతో తమకు తల్లిదండ్రులు లేరని భావన తొలగిపోయి సంతోషంగా సెలవులు గడిపేందుకు అవకాశం ఉంటుంది. ఆయా రంగాల్లో నిపుణులైన ఉపాధ్యాయులను నియమించాం. పూర్తి సెక్యూరిటీతో శిక్షణ కొనసాగించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం.
- అరుణశ్రీ, సెక్టోరియల్ అధికారి, ఎస్‌ఎస్‌ఏ, నల్లగొండ

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...