పరిషత్ పోరుకు సై


Mon,April 15, 2019 12:15 AM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైంది. జడ్పీటీసీ, ఎంపీటీసీల పోలింగ్‌కు షెడ్యూల్ విడుదల కానున్నది. జూలై మొదటివారంలో వీరి పదవీకాలం పూర్తికానున్నది. లోక్‌సభ ఎన్నికలు ముగిసినా మే 28 వరకు కోడ్ అమలులో ఉంది. ఈ లోగా జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జిల్లాల విభజన తర్వాత మొదటిసారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 17 జడ్పీటీసీ, 17 ఎంపీపీ రిజర్వేషన్లను ఇప్పటికే ఖరారు. చేశారు. శనివారం వారికి మొదటి విడుత శిక్షణ కొనసాగింది. జిల్లా కేంద్రంలో ఆర్వో, ఏఆర్వో, మండల కేంద్రాల్లో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు తరగతులు నిర్వహించారు. ఈ నెల 18న హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో ఎన్నికల నిర్వాహణ, ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

జూలై 4 నాటికి జిల్లా పరిషత్ పాలకవర్గాలు కొలువుదీరాల్సి ఉండగా, షెడ్యూల్ వెలువడేలోగా స్థానిక ఎన్నికల కసరత్తు పూర్తిచేసే ప్రక్రియలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. జిల్లా వ్యాప్తంగా ఇటీవల జిల్లా కేంద్రంలో రిటర్నింగ్ (ఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ (ఏఆర్వో) అధికారులకు, అన్ని మండల కేంద్రాల్లో ప్రిసైడింగ్(పీవో), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీవోలు) తొలి విడుత శిక్షణ ఇచ్చారు. 2014 స్థానిక ఎన్నికలు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాతిపదికన జరిగితే 2019లో జరిగే ప్రాదేశిక ఎన్నికలు కొత్త మండలాలు, జిల్లాల పరిధిలో జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాను సూర్యాపేట, యాదాద్రిభువనగిరి, నల్లగొండ జిల్లాలుగా విభజించారు. కొత్త రెవెన్యూ జిల్లాల ప్రకారం జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇది వరకే గెజిట్ జారీ చేసింది. గుండాల మండలం భువనగిరి జిల్లాలో విలీనం కావడంతో 17 మండలాలను పరిగణలోకి తీసుకున్నారు.

మూడు విడుతల్లో...
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు విడుతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగునున్నాయి. మే 18న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు. తొలివిడుత ఈ నెల 22న రెండో విడుత 26, మూడో విడుత 30న ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. మొదటి విడుత ఎన్నికలకు 22 నుంచి 24 వరకు నామినేషన్లు, 25 తేదీన స్క్రూట్నీ ఉండనున్నది. 26న స్క్రూట్నీలో పోయిన వాటికి అప్పీల్ అవకాశం, 27న అభ్యంతరాలు, 28న విత్‌డ్రాలు, అదేరోజు అభ్యర్థుల చివరి లిస్టు వెల్లడిస్తారు. మే 6న ఎన్నికల నిర్వహిస్తారు.

రెండో విడుత ఎన్నికలకు 26 నుంచి 28 వరకు నామినేషన్లు, 29 తేదీన స్క్రూట్నీ, 30న స్క్రూట్నీలో పోయిన వాటికి అప్పీల్ అవకాశం, 1న అభ్యంతరాలు, 2న విత్‌డ్రాలు, అదేరోజు అభ్యర్థుల లిస్టు వెల్లడిస్తారు. మే 10న ఎన్నిక నిర్వహిస్తారు. మూడో విడుత ఎన్నికలకు 30 నుంచి మే 2 వరకు నామినేషన్లు, 3న స్క్రూట్నీ, 4న స్క్రూట్నీ లో పోయిన వాటికి అప్పీల్ అవకాశం, 5న అభ్యంతరాలు, 6న విత్‌డ్రాలు, అదేరోజు అభ్యర్థుల లిస్టు వెల్లడిస్తారు. మే 14న ఎన్నిక నిర్వహిస్తారు.రీపోలింగ్‌కు అవసరమైతే తేదీని అప్పటికప్పుడే ఎన్నికల సంఘం ప్రకటించనుంది. నల్లగొండ జిల్లాలో 31 మండలాలు ఉండగా 1927 పోలింగ్ స్టేషన్ల ద్వారా ఎన్నికల జరుపుతారు. మొదటివిడుత 11 మండలాల్లో, రెండో విడుత 10 మండలాల్లో, మూడో విడుత 10 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. సూర్యాపేట జిల్లాలో మొత్తం 23 మండలాల్లో 1243 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలో 17 మండలాల్లో 969 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి.

ఎన్నికల కార్యక్రమం ఇదిగో
ఉమ్మడి జిల్లాలో తొలివిడుత ఎన్నికలు మే 6న 24 మండలాల్లో, రెండో విడుత మే 10న 24 మండలాల్లో, మూడో విడుత మే 14న 23 మండలాల్లో ఎన్నికలు జరిపేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. వచ్చేనెల 15వ తేదీలోపు ప్రాదేశిక పోరును పూర్తి చేయనున్నారు. మూడు విడుతల్లో ఎన్నికలు నిర్వహించి వచ్చే నెల 18న ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో కోదాడ, సూర్యాపేట రెవెన్యూ డివిజన్లు, జిల్లాలోని భువనగిరి డివిజన్ పరిధిలోని రెండు విడుతలుగా, నల్లగొండ, మిర్యాల గూడ, దేవరకొండ, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని స్థానాలనకు ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహించనున్నారు.

నామినేషన్ విధి విధానాలు
మార్చి 30న ప్రకటించిన గ్రామీణ ఓటరు తుది జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లను ఆయా మండల కేంద్రాల్లోనే స్వీకరించనున్నారు. ప్రతీ జడ్పీ స్థానానికి రిటర్నింగ్ అధికారి, మూడు లేదా నాలుగు మండల పరిషత్ స్థానాలకు ఒక రిటర్నింగ్ అధికారిని నియమిస్తారు. రెండు, మూడు రోజుల్లో ఎన్నికల పర్యవేక్షణ కోసం జోనల్, సెక్టోరియల్ అధికారుల నియామకాన్ని పూర్తి చేసేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. బ్యాలెట్ పత్రాల ప్రిటింగ్‌కు టెండర్లను పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 18న హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారితో కలెక్టర్లు, డీసీపీలు, ఎస్పీలతో ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం జరుగనున్నది. షెడ్యూల్, నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైనా నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధం చేసుకుంది.

అధికారులకు తొలి విడుత శిక్షణ
ప్రాదేశిక ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులు, పత్రాలతో జరిగే పోలింగ్, ఓట్ల లెక్కింపు వంటి అంశాలపై గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో డీఆర్‌గీవో ఉపేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు తొలి విడత శిక్షణ ఇచ్చారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల పరిధిలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు భువనగిరిలోని వెన్నెల కళాశాలలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సిబ్బంది. విధులు, బాద్యతలు, ఎన్నికల నిర్వహణలో వారి పాత్రపై శిక్షణ ఇచ్చారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల ప్రకారం ప్రాదేశిక ఎన్నికలను విజయవంతం చేయాలని ఆయన సూచించారు.

ఎన్నికల బరిలో దిగేందుకు ఆశావహుల ఆసక్తి
ఎన్నికల బరిలో దిగేందుకు ఆశావహుల ఆసక్తి చూపిస్తున్నారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా షెడ్యూల్ ఉత్తర్వులు రాలేదని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా రెండు, మూడు రోజుల్లో అధికారిక షెడ్యూల్ ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిజర్వేషన్లు ప్రక్రియ పూర్తి అయింది. ఎన్నికల అధికారుల నియామకం జరిగి శిక్షణ కార్యక్రమాలు కూడా చివరి దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొద్ది రోజుల్లోనే ఉంటుందనే సంకేతాలు రావడంతో మళ్లీ గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. నిజానికి రాష్ట్ర ఎన్నికల సంఘం దాదాపు ఇదే తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని డ్రాప్ట్ షెడ్యూల్ ప్రిపేర్ చేసినట్టు, అదే వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. రాష్ట్ర ఎన్నికలు కానీ, జిల్లా యంత్రాంగం కానీ దీనిని ఇంకా ధ్రువీకరించకపోవడం విశేషం.

కొలువుదీరనున్న కొత్త పాలకవర్గాలు
స్థానిక సంస్థల్లో భాగంగా మండల, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరుగనుండడంతో ఈసారి కొత్త పాలక మండలాలు ఏర్పాటు కానున్నాయి. కొత్త జిల్లాలకు జిల్లా పరిషత్‌లు, కొత్త మండలాలకు మండల పరిషత్‌లు కొలువు దీరనున్నాయి. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్, ఉమ్మడి మండలాలలోని పాత మండలాలోనే మండల పరిషత్‌లు కొనసాగాయి. పాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటు చేసింది. కొత్త జడ్పీ, కొత్త మండలాలకు మొదటిసారి ఎన్నికలు జరుగనుండగా, రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఓట్ల పండుగ రాబోతున్నాయి.

జిల్లాలో 17 మండలాల్లో..
జిల్లాల్లోని 17 మండలాలకుగానూ 17 జడ్పీటీసీ, 177 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన ఓటరుజాబితా ముసాయిదాలను ప్రకటించారు. ఇందుకోసం జిల్లాలోని 17 మండలాల పరిధిలోని 4,80,210 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 969 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ఆధారంగా బీసీ కేటగిరిలకు ఓటరు జాబితాలో బీసీ గణన ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేశారు.

గ్రామస్థాయిలో రాజకీయ వేడి
శాసనసభ ఎన్నికల తర్వాతే పంచాయతీ ఎన్నికలు, అవి పూర్తైన రెండు నెలలోనే పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ నుంచి కోలుకోక ముందే జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఖారారుతో గ్రామాల్లో మళ్లీ రాజకీయ వేడి పుంజుకుంటోంది. అధికారులు, ఉద్యోగులు ఎన్నికల విధుల్లో అలసిసొలసి ఉండగానే మండుటెండలో మరోసారి ఎన్నికలు రాబోతున్నాయి. గ్రామ, మండల స్థాయి నాయకుల్లో మాత్రం మళ్లీ ఎన్నికల జాతర ఉత్సాహం ఉట్టిపుడుతోంది. పంచాయతీ ఎన్నికల్లో అవకాశాలు రాని గ్రామ, మండల స్థాయి నాయకులు ఎంపీటీసీ, ఎంపీపీ పదవులకు, ఎమ్మెల్యే ఎన్నికల్లో కలిసిరాని నేతలు జడ్పీటీసీగాగెలిచి జడ్పీ సీటును దక్కించుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ మేరకు ఎవరిస్థాయిలో వారు పార్టీ టికెట్ల కోసం మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...