నేతల భవితవ్యం ఈవీఎంల్లో నిక్షిప్తం!!


Sat,April 13, 2019 01:20 AM

-ఈవీఎంలకు కట్టుదిట్టమైన భద్రత
-భువనగిరిలోని అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంలకు మూడంచెల భద్రత
-సీసీ కెమెరాలతో మరింత నిఘా
-భద్రతను పర్యవేక్షించిన ఆర్వో అనితారామచంద్రన్, సీపీ మహేశ్‌భగవత్, డీసీపీ నారాయణరెడ్డి
యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : నేతల భవితవ్యం.. ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. 74.39 శాతం ఓటింగ్ నమోదుతో రాష్ట్రంలోనే రెండో అత్యధిక ఓటింగ్ జరిగిన నియోజకవర్గంగా నిలిచింది. ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన అధికారులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. భువనగిరి పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చిన ఈవీఎంలను భువనగిరిలోని అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపర్చారు. మొదటి అంచెలో కేంద్ర బలగాలను, రెండో అంచెలో రాష్ట్ర సాయుధ బలగాలను, మూడో అంచెలో సివిల్ పోలీసులను భద్రత కోసం కాపలాగా ఉంచారు. భువనగిరి పార్లమెంట్ ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, సీపీ మహేశ్‌భగవత్, డీసీపీ కె.నారాయణరెడ్డి ఈవీఎంల కోసం ఏర్పాటు చేసిన భద్రతను పరిశీలించారు. ఈవీఎంలు గదుల్లో భద్రపరిచే సందర్భంగా స్ట్రాంగ్ రూముల్లోకి అధికారులను తప్ప సాధారణ ఉద్యోగులను కూడా అనుమతివ్వలేదు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గదులకు తాళాలు వేసి షీల్ చేశారు. మొత్తం ఈవీఎంలు మధ్యాహ్నం వరకు భువనగిరికి చేరుకున్నట్టు ఆర్వో అనితారామచంద్రన్ ప్రకటించారు.

రాష్ట్రంలోనే భువనగిరి రెండో స్థానం..
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి గురువారం జరిగిన పోలింగ్ ప్రశాతంగా ముగిసింది. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కలిపి 16,27,527 ఓటర్లకుగాను 12,10, 785 మంది ఓటర్లు తమ ఓటును నమోదు చేసుకున్నారు. 74.39 శాతం పోలింగ్ శాతం నమోదైన రాష్ట్రంలోనే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఓటింగ్ శాతంలో 2వ స్థానంలో నిలిచింది. 8,18, 572 మంది పురుష ఓటర్లుకుగాను 5,94,391 మంది తమ ఓటును వినియోగించుకున్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 52,298 దివ్యాంగుల ఓటర్లకుగాను 31,625(74.77) శాతం ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు.
పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌కు ఈవీఎంల తరలింపు..

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి గురువారం పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను ఇతర పోలింగు సామగ్రిని అరోరా ఇంజినీరింగ్ కళాశాల కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించి భద్రపరిచారు. తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి, నకిరేకల్, మునుగొడు, జనగాం, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పోలింగ్ ముగిసిన అనంతరం కేంద్ర పారామిలిటరీ బలగాలు ఇతర భద్రతతో అక్కడి రిసెప్షన్ సెంటర్లకు చేరుకోగా.. అక్కడి నుంచి భువనగిరి పట్టణంలోని అరోరా ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రంలోని 7 స్ట్రాంగ్ రూమ్స్‌లో ఈవీఎంలను భద్రపరిచారు. రాజకీయ పార్టీల, వారి ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలు, స్టాటుటరీ కవర్లు ఇతర సామగ్రి పరిశీలించి షీల్ వేశారు. మే 23న ఓట్ల లెక్కింపు దృష్ట్యా అప్పటివరకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని పటిష్ట చర్యలు తీపుకుని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ అనితారామచంద్రన్, సాధారణ ఎన్నికల పరిశీలకుడు అమిత్‌కుమార్‌సింగ్ పర్యవేక్షణలో సెగ్మెంట్ల వారీగా కొన్ని పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసుకుని పరిశీలకుల సమక్షం, అభ్యర్థుల సమక్షంలో విజీ డైరీ ఫారం 17ఏ, 17సీలను పరిశీలించారు. బందోబుస్తు కార్యక్రమాన్ని రాచకొండ పోలింగ్ కమిషనర్ మహేశ్‌భగవత్, డీసీపీ నారాయణరెడ్డి పర్యవేక్షించారు. కార్యక్రమంలో సూర్యాపేట జేసీ సంజీవరెడ్డి, సహాయ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...