విజేతలు..? విశ్లేషణలు


Sat,April 13, 2019 01:17 AM

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : గెలిచేదెవరు..? ఓడేదెవరు..? పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు ఫలితాలపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో ఎంపీలుగా ఎవరు గెలుస్తారనే అంశంపై జిల్లావాసులు ప్రధానంగా చర్చించుకుంటున్నారు. రాజకీయ నేతలు, కార్యకర్తలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విలేకరులు, న్యాయ వాదులు.. ఇలా ఏ ఇద్దరు కలిసినా ప్రస్తుతం ఎన్నికలపైనే చర్చంతా.. పార్లమెంట్ ఎన్నికలు, పక్క రాష్ట్రంలో గెలిచేదెవరు..? అన్న ప్రశ్నల చుట్టే తిరుగుతున్నది. అసెంబ్లీ ఎన్నికలు, 2014 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం కొంత పోలింగ్ శాతం తగ్గడంతో.. తగ్గడానికి గల కారణాలు..? తగ్గిన పోలింగ్ ఏ పార్టీపై ప్రభావం చూపుతుందనే లెక్కలు ప్రతి ఒక్కరూ వేస్తుండటం కొసమెరుపు. మరోవైపు అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ కోసం ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నేతలు.. ముఖ్యనాయకులను ప్రసన్నం చేసుకునే సన్నాహాలు రచిస్తున్నారు. నల్లగొండ ఎంపీగా ఎవరు గెలుస్తారు..? భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి ఏ అభ్యర్థి గెలవబోతున్నారు..? ఈ రెండు ప్రశ్నలు మాత్రమే కాదు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది..? ఫలానా స్థానంలో ఫలానా అభ్యర్థి గెలిచే అవకాశం ఉందంట కదా..? పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి ఎవరు వస్తారు..? టీడీపీ ఘోరంగా ఓడిపోతుందని అంటున్నారు కదా..? జగన్‌కు స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదంటున్నారేంటి..? పవన్‌కల్యాణ్ కనీసం చెప్పుకోదగ్గ స్థానాలైనా గెలుచుకుంటాడా..? ఉమ్మడి జిల్లా అంతటా ఏ ఇద్దరిని కదిలించినా ఇలాంటి ప్రశ్నల పరంపరే ఎదురవుతున్నది. పార్లమెంట్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో జిల్లాలో ఎవరు గెలవనున్నారనే అంశంతోపాటు.. పక్క రాష్ట్రం, జాతీయ రాజకీయాల పైనా విస్తృత చర్చ కొనసాగుతున్నది.

అంచనాల్లో అభ్యర్థులు, లోతైన విశ్లేషణలు.. నల్లగొండ పార్లమెంట్ స్థానంలో మొత్తం 15,85,433 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 74.11 శాతం.. భువనగిరి పార్లమెంట్ స్థానం పరిధిలో మొత్తం 16,27,527 మంది ఓటర్లకు 74.39 శాతం ఓట్లు నమోదయ్యాయి. ఓట్ల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు ఆయా పార్టీల అభ్యర్థులు, ముమ్మర ప్రచారం సాగించిన నేతలు.. గెలిచేదెవరు..? అన్న అంశంపై ఆరా తీస్తున్నారు. పోలింగ్ బూత్‌ల వారీగా తమకు అనుకూలంగా పోలైన ఓట్ల అంచనాలు వేస్తున్నారు. ఏయే ప్రాంతాల్లో తమకు అత్యధిక మెజార్టీ దక్కుతుందనే అంశంపై టీఆర్‌ఎస్ అభ్యర్థులు, నాయకులు లెక్కలు వేస్తుండగా.. ఎక్కడెక్కడ ఎక్కువ ఓట్లు వస్తే తమ గెలుపునకు అవకాశం ఉంటుందనే అంచనాల్లో కాంగ్రెస్ నేతలు మునిగిపోయారు. ఫోన్లలో ఆరా తీస్తూ.. కాగితాలపై రాస్తూ.. ప్రతిఒక్కరూ ఆయా స్థాయిల్లో ప్రస్తుతం ఈ లెక్కల్లోనే మునిగి తేలుతున్నారు.

ద్వితీయ శ్రేణిలో ముమ్మరమైన ప్రయత్నాలు..
ముఖ్యనాయకులు, అభ్యర్థులు తమకు పడ్డ ఓట్ల అంచనాలు వేస్తుంటే.. ద్వితీయ శ్రేణి నాయకులు, గ్రామ స్థాయి కార్యకర్తలు మాత్రం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై దృష్టి సారించారు. తమకు పోటీ చేసే అవకాశం ఈసారైనా కల్పించాలని కొందరు.. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన తమకు మరో అవకాశం ఇవ్వాలని మరికొందరు.. ఇలా ఎవరికి వారుగా తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. దేశమంతటా పార్లమెంట్ ఎన్నికలు ముగిసి, మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టే లోపులోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే విధంగా తొందర్లోనే షెడ్యూల్ విడుదల కానుంది. వరుసగా అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ, తాజాగా పార్లమెంట్ ఎన్నికల వాతావరణంతో బిజీ బిజీగా గడిపిన రాజకీయ నాయకులు.. మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలతో అప్పుడే బిజీ అయ్యారు.

133
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...