75.11% జిల్లాలో ఓ(పో)టెత్తిన జనం


Fri,April 12, 2019 12:37 AM

- ఉదయం మందకొడిగా సాగినా మధ్యాహ్నానికి పుంజుకున్న పోలింగ్
- పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు
- ఆలస్యంగా ప్రారంభమైన ఓటింగ్
- భువనగిరిలో మండలంలో అత్యధికంగా పోలింగ్

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకూ కొనసాగింది. ఉదయం మందకొడిగా సాగినా.. మధ్యాహ్నం వరకూ ఊపందుకున్నది. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించినా అధికారులు వెంటనే స్పందించి సరిదిద్దారు. మొత్తంగా 75.11 శాతం నమోదైంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి భువనగిరిలో, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి వంగపల్లిలో, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి భువనగిరి టౌన్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు ఎన్నికలు ఏవైనా ఓటర్లు కారుకే మద్దతు పలికినట్టు విశ్లేషణలు వెలువడుతున్నాయి.

జిల్లాలోని భువనగిరి లోక్‌సభ ఎన్నికలు ప్రశాతంగా జరిగాయి. గురువారం ఉదయం 7 గంటల నుంచే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ 11 గంటల తరువాతే స్పీడందుకున్నది. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 16,27,527 మంది ఓటర్లు ఉండగా 12, 22, 436 మంది ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 7 అసెంబ్లీ నియోకవర్గాల్లో ఎన్నికలు జరుగగా అత్యధికంగా పార్లమెంట్ పరిధిలో 75.11 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 68.57శాతం, మునుగోడులో 78.45 శాతం, భువనగిరిలో 81.70 శాతం, నకిరేకల్‌లో 75.95శాతం, తుంగతుర్తిలో 72.38శాతం, ఆలేరులో 79.96 శాతం, జనగామలో 68.73 శాతం పోలింగ్ నమోదైంది. భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో, అర్బన్‌కాలనీలో ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు వాటిని సరిచేశారు. దీంతో సుమారు 30 నిమిషాలు పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అదే విధంగా భువనగిరి మండలంలో బి.ఎన్.తిమ్మాపురం, మీటితండా ఈవీఎంలు మొరాయించడంతో సుమారు గంటపాటు పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. పులిగిల్ల, గొలిగూడెం, నాతాళ్లగూడెంలలో ఈవీఎంలు మొరాయించగా అధికారులు వెంటనే వాటిని సరిచేశారు. సంస్థాన్‌నారాయణపురం మండలం కొత్తగూడెం ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం అర్ధగంట పాటు మొరాయించింది. అదేవిధంగా అడ్డగూడురు మండలంలోని అడ్డగూడూరు, చొల్లరామారం, కంచనపల్లిలో ఈవీఎంలు పావుగంట పాటు మొరాయించాయి. అప్రమత్తమైన అధికారులు ఆయా గ్రామాల్లోని ఈవీఎంల్లో తలెత్తిన సాంకేతిక లోపాలను చక్కదిద్దారు. కలెక్టర్ అనితారామచంద్రన్, డీసీపీ నారాయణరెడ్డి ఎన్నికలను పర్యవేక్షించారు. యాదగిరిగుట్ట మండలం, ఆలేరు మండలాల్లో సాధారణ ఎన్నికల అధికారి అమిత్ కుమార్ సింగ్ పరిశీలించగా, భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి పలు ప్రాంతాల్లో పర్యటించారు.

75.11 శాతం పోలింగ్ నమోదు..
భువనగిరి పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగగా 75.11 శాతం పోలింగ్ శాతం నమోదైంది. మొత్తం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలైన ఇబ్రహీంపట్నం, మునుగోడు, భువనగిరి, నకిరేకల్, తుంగుతుర్తి, ఆలేరు, జనగామలో మొత్తం పార్లమెంట్ పరిధిలో 16,27,527 మంది ఓటర్లు ఉండగా 12, 22, 436 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 8,18,572, మహిళలు 8,08,925 ఉన్నారు.

ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు..
లోక్‌సభ ఎన్నికల్లో ప్రముఖులు, స్థానిక ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకున్నారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి దంపతులు యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లిలో తమ స్వగ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్, ఎన్నికల అధికారి అనితారామచంద్రన్, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి భువనగిరిలో తమ ఓటు హక్కును వినియోగించుకోగా మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి వలిగొండ మండలంలోని వర్కట్‌పల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి అనంతారంలో ఓటు హక్కును వినియోగించుకోగా, నారాయణపూర్ మండలం లింగంవారిగూడెంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ నారాయణపూర్ మండల కేంద్రంలో, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణరెడ్డి మోత్కురు మండలంలోని దత్తప్పగూడెంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. గిడంగుల సంస్థ చైర్మన్ మందుల సామెల్ అడ్డగూడురు మండలంలోని ధర్మారంలో, కాకతీయ యూనివర్శిటీ డైరెక్టర్ సీహెచ్ దినేశ్‌కుమార్ దంపతులు సాయిగూడెంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు..
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు పరిశీలించారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకున్నారు. యాదగిరిగుట్ట మండలంలోని మున్సిపల్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రం, ఆలేరు పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను సాధారణ ఎన్నికల అధికారి అమిత్‌కుమార్ పరిశీలించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగే పోలింగ్ ప్రక్రియను కలెక్టర్ అనితారామచంద్రన్, జాయింట్ కలెక్టర్ రమేశ్, భువనగిరి డీసీపీ నారాయణరెడ్డిలు పరిశీలన చేశారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ముగియడంతో ఊపిరి పీల్చుకున్నారు.

పోలింగ్ సరళిని పరిశీలించిన ఎంపీ అభ్యర్థి బూర..
పోలింగ్ సరళిని పరిశీలించిన ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్, రాజ్యసభ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్ పరిశీలించారు. ఆలేరు పట్టణంలోని ఎన్నికల సరళిని, పోలింగ్ శాతం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి తుర్కపల్లి, ఆలేరు పట్టణంతో పాటు పలు గ్రామాలు, రాజాపేట మండలంలోని పలు గ్రామాల పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి భువనగిరి నియోజకవర్గంలోని పలు మండలాలు, మునుగోడులో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఎన్నికల సరళిని పరిశీలన చేశారు.


68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...