పూలే ఆశయాలు ఆదర్శనీయం


Fri,April 12, 2019 12:35 AM

భువనగిరిరూరల్ : బడుగు, బలహీనవర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహాత్మా జ్యోతిరావుపూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకావాలని కలెక్టర్ అనితారామచంద్రన్ కోరారు. ఫూలే జయంతిని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ రమేశ్, ప్రత్యేక అధికారి ప్రియాంక, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్‌రెడ్డి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. సామాజిక అసమానతలకు అవిద్య, అజ్ఞానమే కారణమని గుర్తించి చదువే ఇందుకు పరిష్కారమని విద్యాదానానికి పూనుకున్న మహనీయుడు పూలే అని కలెక్టర్ అభివర్ణించారు. బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను ప్రారంభించి అన్నివర్గాల వారికి అవకాశం కల్పించారని, తానే స్వయంగా తన భార్యకు చదువునేర్పించి ఉపాధ్యాయురాలిగా తయారు చేయడం ద్వారా దంపతులిద్దరు స్త్రీ విద్యకు నాంది పలికారని కలెక్టర్ అన్నారు. తద్వారా తొలి మహిళా అధ్యాపకురాలిగా ఆమె చరిత్ర సృష్ఠించారని కలెక్టర్ కొనియాడారు.

బడుగు వర్గాల హక్కులపై పూర్తిస్థాయిలో ఫూలే అవగాహన చెంది హక్కుల కోసం పోరాడేలా వారిని చైతన్యపరిచారని, తద్వారా వారిలో ఆత్మైస్థెర్యం పెంపొందించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జేసీ రమేశ్ మాట్లాడుతూ.. బలహీనవర్గాల ప్రజలతో మమేకమై వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన పూలే గొప్ప సామాజికవేత్త అని కొనియాడారు. మహిళలను ఆదరించి రాత్రి పగలు విద్యనేర్పించి సంఘసంస్కర్తగా ఎదిగి మంచి పనులు చేసిన మహనీయుడని జేసీ అన్నారు. ఆయన చూపిన మార్గంలో యువత పయనించి తోటివారికి ఆదర్శప్రాయులు కావాలని సూచించారు. జిల్లా ప్రత్యేకాధికారి ప్రియాంక, డీఆర్వో వెంకట్‌రెడ్డి ఫూలే సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి యాదయ్య, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఈశ్వరయ్య, కలెక్టర్ కార్యాలయ పాలనాధికారి నాగేశ్వరాచారి, వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొని ఫూలే చిత్రపటానికి నివాళులర్పించారు. అంతకు ముందు పట్టణంలోని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...