అభివృద్ధే నినాదం


Mon,March 25, 2019 12:32 AM

- ఐదేండ్ల ప్రగతి నివేదిక ప్రజల ముందు పెడుత
- డిస్టింక్షన్ మార్కులతో గెలుపిస్తారనే నమ్మకం ఉంది
- కోతల రాయుళ్లు కోమటిరెడ్డి బ్రదర్స్‌తోనే నల్లగొండ వెనుకబాటు
- భువనగిరి ప్రజలు వెంకట్‌రెడ్డికి కర్రుకాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగున్నరు
- నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్

ఐదేండ్లలో చేసిన అభివృద్ధిని ప్రజల ముందు పెడుత. చైతన్యవంతమైన భువనగిరి నియోజకవర్గ ప్రజలు డిస్టింక్షన్ మార్కులు వేసి భారీ మెజార్టీతో గెలుపిస్తరన్న నమ్మకం ఉంది. 20 ఏండ్లు ప్రజాప్రతినిధిగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండను నిండా ముంచిండు. ఒక్క ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీ రాకుండా చేసిండు. నాడు పులిచింతల వద్దని.. కాంట్రాక్ట్ దక్కగానే దగ్గర ఉండి కట్టి నల్లగొండకు నామాలు పెట్టి కృష్ణా జిల్లాలో నీళ్లు పారించిండు. ఇలాంటి నాయకుడు మాకొద్దని నల్లగొండ ప్రజలు తన్ని తరిమేస్తే భువనగిరిలో తేలిండు. ధనహంకారంతో రాజకీయాలు చేస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌కు భువనగిరి నియోజకవర్గ ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నరని ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఆదివారం నమస్తే తెలంగాణకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ: నల్లగొండను నిలువునా ముంచిండు.. 20 ఏండ్లు నల్లగొండ ఎమ్మెల్యేగా పని చేసి కార్పొరేషన్ స్థాయి కూడా రాకుండా చేశాడు... ఒక్క ఇంజినీరింగ్ కాలేజీగాని మెడికల్ కాలేజీగాని నల్లగొండకు రాకుండా చేశాడు.. నాడు పులిచింతల వద్దన్నాడు.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పులిచింతల నిర్మాణం పనుల కాంట్రాక్టు ఇవ్వగానే నల్లగొండను ముంచి కృష్ణాకు నీళ్లిచ్చే ప్రాజెక్టును దగ్గరుండి కట్టించాడు...ప్రజలు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇలాంటి నాయకుడు మాకొద్దని అక్కడి ప్రజలు తన్ని తరిమేస్తే ఇప్పుడు భువనగిరిలో తేలిండు ఇలాంటి నాయకుని గురించి భువనగిరి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. డబ్బులతో రాజకీయాలను గబ్బు చేస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌కు బుద్ధ్ది చెప్పాలని భువనగిరి పార్లమెంటు టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఆయనతో నమస్తేతెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ.

నల్లగొండ వెనుకబాటుకు కారకులెవరని మీరు భావిస్తున్నారు?
ఎంపీ బూర నర్సయ్యగౌడ్: నల్లగొండను అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురి చేసిన వ్యక్తి, కోతలరాయుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. 20 ఏండ్ల పాలనలో నల్లగొండలో నేటికి గజం భూమి రూ. 2,000 దొరుకుతుందంటే ఎంతగా వెనకబడిపోయిందో తెలుస్తున్నది. 2014లో యాదాద్రిలో కేసీఆర్ అడుగుపెట్టిన తరువాత భువనగిరి డివిజన ఎంతగా అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలుసు. దశాబ్దాల కాలం నుంచి జిల్లా కేంద్రంగా ఉన్న నల్లగొండ ఎంత అభివృద్ధి చెంది ఉండాలి.

నల్లగొండ కార్పొరేషన్ స్థాయికి ఎదుగకపోవడానికి కారణం?
నల్లగొండ పట్టణం అన్ని వనరులు పుష్కలంగా ఉన్న పట్టణం. ఆదిలాబాద్, నిజామాబాద్,కరీంనగర్, మహబూబ్‌నగర్ తదితర జిల్లా కేంద్రాలనిన కార్పొరేషన్ స్థాయికి ఎగబాకాయి. కానీ నల్లగొండ మున్సిపాలిటీగానే ఉండిపోయింది. వందల కోట్ల కుంభకోణాలతో దివాలా తీయించారు. తమ బినామీలతో పనులు చేయించి అడ్డగోలుగా బిల్లులు మున్సిపాలిటీ నుంచి పొంది అభివృద్ధి నిరోధకులుగా మారారు. ఫలితంగా నల్లగొండ కార్పొరేషన్ కాకుండా పోయింది.

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గురించి ప్రజల్లో ఎలాంటి భావం ఉందని భావిస్తున్నారు?
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పచ్చి గజినిగా ప్రజలు భావిస్తున్నారు. ఇచ్చిన వాగ్దానాలన్నీ మరచిపోయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాగ్దానాలు ఇస్తాడు. 20 ఏండ్లుగా నల్లగొండ నియోజకవర్గ ప్రజలను మోసం చేశాడు. అబద్దాలు ఆడేవారిని ప్రజలు ఎక్కువ కాలం నమ్మరు. అప్పటికప్పుడు గట్టెక్కొచ్చని భావిస్తారు కానీ అది సరైంది కాదు. నల్లగొండ ప్రజలు కర్రు కాల్చి వాతపెడితే భువనగిరిలో తేలాడు.

సొంత గ్రామంలో కూడా బ్రదర్స్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయలేదనే విమర్శ ఉంది కదా?
కరెక్ట్ బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు మట్టి పనులు పూర్తి చేసి కాల్వలు తవ్వి లిఫ్ట్‌ల పేరిట మోటర్లు బిగించి రూ. కోట్ల రూపాయల అవినీతికి కోమటిరెడ్డి బ్రదర్స్ పాల్పడ్డారు. బిల్లులు కాజేశారు. సొంత గ్రామమని చూడకుండా ప్రాజెక్టు పేరిట కోట్లు కాజేశారు. ప్రజలకు మొండి చేయి చూపారు. అవినీతికి మరిగిన జలగలు కోమటిరెడ్డి బ్రదర్స్.

పులిచింతల ప్రాజెక్టు ను కాంగ్రెస్ నేతలు దగ్గరుండి కట్టించడంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఏమిటి?
పులిచింతల కట్టనివ్వమన్నారు.. బాంబులు పెట్టి పేల్చేస్తామన్నారు. రక్తంతో నుదుట సిందూరం దిద్దుకున్నారు. తీరా కంట్రాక్టులు రాగానే కోటిరెడ్డి బ్రదర్స్ ప్రాజెక్టును దగ్గరుండి కట్టించారు. రూ. వేల కోట్లకు అమ్ముడుపోయారు. బాంబులు పెట్టి పేల్చేస్తామన్న నేతలు పక్కాగా ఆంధ్రా ప్రజలకు మూడోపంటకు నీళ్లిచ్చే ప్రాజెక్టు కోసం రక్తం చిందించి ఇక్కడి ప్రజలను కొట్టి పోలీసులతో బెదిరించి పనులు జరిపించారు. ఇది నిజం కాదా? కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు చేసిన కోమటిరెడ్డికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన నజరానాలు ప్రజలకు తెలియనివి కావు.

రైతుల పక్షపాతిని అని కోమటిరెడ్డి చెప్పుకుంటున్నారు.. దానిపై మీ స్పందన?
రైతులు పుట్టెడు దు:ఖంతో నేడు ఉండటానికి ప్రధాన కారకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. అక్కడి ప్రజలకు పుట్టెడు కష్టాలు తెచ్చిన వ్యక్తిగా చరిత్ర పుటల్లో నిలిచిపోతాడు. నల్లగొండ చుట్టుపక్కల బత్తాయి తోటల పెంపకం చేసే రైతులు ఎక్కువగా ఉంటారు. కనీసం బత్తాయి రైతుల కోసం బత్తాయి మార్కెట్‌ను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. పర్సెంటేజీలకు భయపడి కాంట్రాక్టర్లు కూడా వచ్చిన పనులు వదులుకునే పరిస్థితి అక్కడ ఉన్నది.

అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి చేసిన చాలెంజ్‌పై?
అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో టీఆర్‌ఎస్ ఒక్క సీటు గెలిచినా రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నాడు.. ఇప్పుడు ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు సభ్యత్వానికి రాజీనామా చేస్తానంటున్నాడు. మిర్యాలగూడలో టీఆర్‌ఎస్ అభ్యర్థి భాస్కర్‌రావు గెలిస్తే టీఆరెస్ ఆఫీస్‌లో అటెండర్‌గా పని చేస్తానన్నాడు.. భాస్కర్‌రావు గెలిచాడు.. మేము టీఆర్‌ఎస్ ఆఫీస్‌లో అటెండర్ ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.. కానీ చేసిన ప్రతిజ్ఞ మీద నిలబడక గజిని మాదిరిగా వ్యవహరిస్తున్నాడు.

తెలంగాణ కోసం దీక్ష చేశానని .. ఓట్లు తనకే పడుతాయనే వాదనపై మీ కామెంట్?
తెలంగాణ కోసం చేసిన దీక్ష కాదది. కిరణ్‌కుమార్‌రెడ్డి తన మాట వినడంలేదని ప్రాధాన్యం లేని శాఖ ఇచ్చాడని ఎన్నిసార్లు చెప్పినా శాఖ మార్చడంలేదని చేసిన దీక్ష అది. క్రీడల శాఖ వల్ల తనకు ఒరిగేది లేకపోవడంతో దొంగ దీక్ష చేశారు. ప్రజల్ని వంచనకుగురి చేశారు. ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఇవ్వడంలేదని చేసిన దీక్ష గురించి ప్రజలకు అంతా తెలిసింది. సొంత పార్టీల నాయకులే కోమటిరెడ్డి దీక్ష గురించి అప్పట్లో మీడియాకు బహిరంగంగా ప్రకటనలు విడుదల చేశారు.

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీకు గట్టి పోటీ ఇస్తారని సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తున్నారు?
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని భువనగిరి ప్రజలు విశ్వసించరు. నేను అయిదేండ్లలో చేసిన అభివృద్ధితో ప్రజల వద్దకు వెళ్తున్నా. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అక్కడి ప్రజలను నిలువునా ముంచి ఇక్కడ భువనగిరిలో తేలాడు. ఏం చేశారని ప్రజలు కోమటిరెడ్డికి ఓట్లేస్తారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ఎన్నో కొత్త కొత్త పథకాలు అమలు చేసి ఇక్కడి ప్రజల ఆశీర్వాదం పొందాను. సోషల్‌మీడియాలో వచ్చే కథనాలు కొంత మంది కావాలని చేస్తున్నవి.

ఐదేండ్లలో మీరు చేసిన ప్రగతి ఏమిటి?
వైద్య వృత్తిలోని తాను తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చా. సీఎం కేసీఆర్ ఎంపీగా తనకు కల్పించిన అవకాశాన్ని నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలకు సేవలందించేందుకు అహర్నిశలు శ్రమించా. ఆర్బాటం లేకుండా నిబద్దతో అనుకున్న ప్రగతి సాదించా. హైదరాబాద్ నగర శివారు ప్రాంతం నుంచి మారుమూల గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించి ఉన్న భువనగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయగాలిగాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నా ఇక్కడ అభివృద్ధి ఏమాత్రం పట్టలేదు. తమ ఐదేండ్ల్ల కాంలో విద్య, వైద్య రంగాల్లో చెప్పుకోదగిన ప్రగతి సాధించాం. భువనగిరి ఎంపీ నియోజకవర్గం విస్తరించి ఉన్న ఆరు జిల్లాల్లో మెడికల్ కళాశాలలు సాధించడం గొప్ప విషయం. వీటిలో యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ.1028 కోట్లతో ఎయిమ్స్ ఏర్పాటు కావడం జిల్లాకే కాదు యావత్ తెలంగాణ ప్రజలకే గర్వకారణం.

ఎంపీ అయిన మొదటి రోజు నుంచి ఎయిమ్స్ కోసమే పోరాడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించగలిగా. విద్యారంగంలో భువనగిరిలో కేంద్రీయ విశ్వవిద్యాలయం, ర్యాలలో పాలిటెక్సిక్, జనగామలో రూసా నిధులతో భవన నిర్మాణం చేసుకోగలగుతున్నాం. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 524 కిలోమీటర్ల జాతీయ రహదారులను కొత్తగా మంజూరుతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేశాం. యాదాద్రి-వరంగల్ జాతీయ రహదారికి రూ. 1900 కోట్లు, యాదాద్రి ఓఆర్‌ఆర్ కు రూ.400 కోట్లు, చర్ల-నకిరేకల్ కు రూ.500 కోట్లు భువనగిరి అండర్‌పాస్‌కు రూ.18 కోట్లు , దుద్డెడ-జనగామ- సూర్యాపేటకు రూ. 500కోట్లు, ఓఆర్‌ఆర్ వలిగొండ- కొత్తగూడెంకు రూ.800 కోట్లు, యాచారం-జగదేవ్‌పూర్ రీజినల్ రింగ్ రోడ్డుకు రూ.2,500 కోట్లు మంజూరు చేయగలిగాం.

నామినేషన్ సందర్భంగా బలప్రదర్శన చేస్తారా?
నామినేషన్ వేసే సందర్భంగా భువనగిరి పట్టణంలోని సాయిబాబ గుడి నుంచి కలెక్టరేట్ వరకు భారీ పప్రదర్శన ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు సమయం ఇచ్చారు. సుమారు 30నుంచి 40వేల మందితో నామినేషన్ వేస్తాం.

సంక్షేమ పథకాలు ఎలా ఉపయోగపడుతాయి?
రాష్ట్ర సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. సీఎం కేసీఆర్ ఇచ్చే సూచనలు మాకు శ్రీరామ రక్ష. ఆయన అండదండలు.. దీవెనలతో వంద శాతం భారీ మెజార్టీ సాధిస్తాం.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...