మీరు ఎగదోసిన గ్రూపులే ఓడిస్తాయి


Mon,March 25, 2019 12:17 AM

- బూడిద భిక్షమయ్యగౌడ్
భువనగిరి టౌన్ : భువనగిరి పార్లమెంట్ పరిధిలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎగదోసిన గ్రూపు రాజకీయాలే వారిని ఓడిస్తాయని ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ స్పష్టం చేశారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పార్టీలో గ్రూపులను ఎగదోస్తూ ఇన్‌చార్జిలను అణగదొక్కాలని చూశారన్నారు. జనగాంకు చెందిన పొన్నాల లక్ష్మయ్య పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నానా బూతులు తిట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఆలేరులో బీసీ నాయకుడిగా తనను ఎదుగకుండా చేశారన్నారు. తుంగతుర్తిలో దామోదర్‌రెడ్డితో నిత్యం గొడవేనని, భువనగిరి ఇన్‌చార్జి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి టికెట్ రాకుండా చేశారన్నారు. నకిరేకల్‌లో ఇప్పటికే కార్యకర్తలు, నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారన్నారు. మునుగోడు, ఇబ్రహీంపట్నంలో మీ సొంత కార్యకర్తలే కోపంతో ఉన్నారన్నారు. వారు ఎన్నికల్లో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు బుద్ధి చెబుతారని చెప్పారు.

రాజగోపాల్‌రెడ్డి చేసింది శూన్యం
భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా 2009 - 14 వరకు ఉన్న రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యమని ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ విమర్శించారు. 2014లో డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ గెలిచాక పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి పరుగులెత్తించారన్నారు. బూర నర్సయ్యగౌడ్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెబుతున్న రాజగోపాల్‌రెడ్డి అందుకు సిద్ధంగా ఉండాలని భువనగిరి ఖిల్లాపై టీఆర్‌ఎస్ జెండా ఎగురవేయడం తథ్యమన్నారు.

కోమటిరెడ్డి మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు
2018 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామని కోమటిరెడ్డి సోదరులు సవాళ్లు విసిరారని మరీ ఆ సవాళ్లు ఏమయ్యాయని ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ ప్రశ్నించారు. డ్రామాలు, పగటి వేషాలు భువనగిరి ప్రజలు నమ్మే దుస్థితిలో లేరని తేల్చి చెప్పారు.

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఉసురు తగులుతుంది
రాజకీయంగా తనను సర్వనాశనం చేయాలని చూస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌కు తన ఉసురు తగులుతుందని భిక్షమయ్యగౌడ్ అన్నారు. ఆలేరులో తాను రెండు సార్లు ఓడిపోయేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ కారణమన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పెద్ద ఎత్తున ఆయన అనుచరులు పాల్గొన్నారు.

సామాజిక న్యాయం కోసమే టీఆర్‌ఎస్‌లోకి
సామాజిక న్యాయం కోసమే టీఆర్‌ఎస్‌లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ స్పష్టం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఒక స్థానం ఓసీ, ఇంకో స్థానం బీసీలకు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం అమలు కాకుండా కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డుపడ్డారని చెప్పారు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీకి, అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితుడను కావడంతో పాటు బలహీనవర్గాలకు న్యాయం జరుగాలనే ఉద్దేశ్యంతోనే అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో టీఆర్‌ఎస్‌లో చేరతానని చెప్పారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...