యాదాద్రిలో భక్తుల సందడి


Mon,March 25, 2019 12:15 AM

-స్వాతి సందర్భంగా శ్రీవారికి అష్టోత్తర శతఘటాభిషేకంయాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి,

నమస్తే తెలంగాణ : యాదాద్రి పంచనారసింహ క్షేత్రం ఆదివారం జన సందడితో నిండుకున్నది. శ్రీ లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులతో సముదాయాలు, మొక్కు పూజల నిర్వహణతో మండపాలు కిక్కిరిసిపోయాయి. యాత్రికుల వాహనాలతో ఆలయ దారులు, పట్టణ వీధులు రద్దీగా మారాయి. సెలవు కావడం, శ్రీలక్ష్మీనరసింహుడి జన్మనక్షత్రం కావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. స్వాతి సందర్భంగా శ్రీవారికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు.

ప్రభాత సమయంలో యాదాద్రికొండ చుట్టు అనేక మంది భక్తులు గిరిప్రదక్షిణ నిర్వహించారు. ఎటు చూసినా.. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులే కనిపించారు. కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడిని దర్శించాలని గంటల కొద్దీ క్యూ కట్టారు.ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము మూడు గంటల నుంచి మొదలైనది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు.

ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతీ రోజు నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు.

శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయ ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతును నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం అలంకార జోడు సేవలు నిర్వహించారు.

మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు రూ.100 టికెట్‌పై బాలాలయం ముఖ మండపంలో 10 నిమిషాల పాటు పూజలో పాల్గొనే ఈ పూజలకు ఆదరణ పెరుగుతున్నది. శ్రీపర్వతవర్దినీ సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం జరిపారు. నవగ్రహాలకు తైలాభిషేకం జరిపారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు.
వైభవంగా వత్ర పూజలు యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే సత్యనారాయణ స్వామివారి సామూహిక వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు.

వ్రత పూజల ద్వారా రూ.1,10,000ఆదాయం సమకూరింది. స్వామిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.
శ్రీవారి ఖజానాకు రూ.19, 01,403 ఆదాయం శ్రీవారి ఖజానాకు రూ. 19, 01, 403 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ.1,69,958, 100 రూపాయల టికెట్‌తో రూ.59, 500, 150 రూపాయల టికెట్టు దర్శనంలో రూ. 4, 65, 000, గదులు విచారణ శాఖతో రూ. 85, 230, ప్రసాదవిక్రయాలతో రూ.6, 71, 375 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...