రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో మనమే కీలకం


Sat,March 23, 2019 12:47 AM

- దేశంలోని వనరులను వినియోగించుకుంటే ఎప్పుడో బాగుపడేవారం
- కాంగ్రెస్, బీజేపీ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించాలి
- ఫెడరల్ ఫ్రంట్ అవసరం దేశానికి ఎంతో ఉంది
- విద్యా శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
- భువనగిరి అభివృద్ధిపై చర్చకు సిద్ధం
- కోమటిరెడ్డి బ్రదర్స్‌తోనే నల్లగొండ సర్వనాశనం
- ఎంపీ బూర నర్సయ్యగౌడ్
- భువనగిరిలో టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు


యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : 70 ఏండ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశం అధోగతి పాలైందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం భువవనగిరి పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బూర నర్సయ్యగౌడ్ కలెక్టరేట్‌లో నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అనంతరం ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, ఎలిమినేటి కృష్ణారెడ్డితో కలిసి భువనగిరిలోని దీప్తి హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ సారి జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు భిన్నమైన తీర్పు ఇవ్వబోతున్నారని అన్నారు. ఈ ఎంపీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త ఎజెండా దేశ ప్రజల ముందు ఉంచారన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశంలో అనేక సమస్యలు పేరుకుపోయారన్నారు. దేశంలోని వనరులను సరిగా వినియోగించుకుంటే ఎప్పుడో అభివృద్ధి చెందేవారమన్నారు. మనకంటే వెనుక సాతంత్య్రం పొందిన దేశాలు ప్రస్తుతం ఎన్నో రెట్లు అభివృద్ధిలో ముందున్నాయన్నారు. కాంగ్రెస్ లేకపోతే బీజేపీ.. బీజేపీ లేకపోతే కాంగ్రెస్ పాలనతోనే దేశం సర్వనాశనం అయ్యిందన్నారు. ప్రస్తుతం దేశంలో ఫెడరల్ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే భిన్నమైన విధానాలతో ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని ఫెడరల్ ఎజెండాను టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు తీసుకువచ్చారన్నారు. ప్రజా ఉద్యమం ద్వారా తెలంగాణను సాధించి గడిచిన ఐదు ఏండ్లలో దేశంలోనే తెలంగాణను ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆరేదనన్నారు. ఈ దేశంలో ఎవరూ చేయని విధంగా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందనడంలో అతిశయోక్తి లేదు. అందరి అంచనాలను మించి పాలన సాగించారన్నారు. అనుకుంటే సాధ్యం కానిది ఏమీ లేదని.. తెలంగాణలో అవలంబించిన విధానాలే దేశమంతటా అమలు చేస్తే అభివృద్ధి పథంలో నడవడం ఖాయమన్న భావనలో సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని ఎంపీ సీట్లను గెలువాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 16 సీట్లు గెలిస్తే ఏం చేస్తారని ప్రతిపక్ష నేతలు అంటున్నారని.. తొమ్మిది సీట్లు ఉన్న పార్టీలు దేశ రాజకీయాలను శాసించాయని గుర్తు చేశారు. కేంద్రంలో రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో కీలకం కాబోతున్నామన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఇతర రాష్ర్టాల్లోని భావసారూప్యత గల పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు.


అంకితభావం కలిగిన నాయకుడు ఎంపీ బూర..
గత పార్లమెంట్ సభ్యుల మాదిరిగా కాకుండా కేంద్రం ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా ఎంపీ బూర నర్సయ్య గౌడ్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేశారని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఎయిమ్స్ సాధనతో పాటు కేంద్రీయ విద్యాలయం, నాలుగు లైన్ల జాతీయ రహదారుల నిర్మాణంలో బూర పాత్ర ఎనలేనిదన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు గెలువబోతున్నామన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బూర నర్సయ్యగౌడ్‌ను మరోసారి గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధిలో తోడ్పాటు అందించాలని నియోజకవర్గ ప్రజలను మంత్రి కోరారు.

కోమటి రెడ్డి బ్రదర్స్ కోతల రాయుళ్లు..
భువనగిరిలో తాను చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధమని ఎంపీ బూర కోమటిరెడ్డి బ్రదర్స్‌కు సవాల్ విసిరారు. డబ్బుతో గబ్బు పనులు చేస్తున్న కోటిరెడ్డి బ్రదర్స్ కోతల రాయుళ్లని.. భువనగిరి నియోజకవర్గ ప్రజలకు వారికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆసరాతో భువనగిరి పార్లమెంట్ పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేయగలిగానన్నారు. పారిశ్రామిక క్లస్టర్‌తో పాటు రూ. 1028 కోట్లతో బీబీనగర్‌లో ఎయిమ్స్ స్థాపనకు కేంద్రం నుంచి అనుమతులు సాధించామన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌తో నల్లగొండ ఎంతో వెనుకబాటుకు గురైందన్నారు. ఒకప్పుడు నల్లగొండ కంటే వెనుకబడిన ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టణాలు ప్రస్తుతం కార్పోరేషన్లుగా ప్రమోషన్ పొంది అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్నాయన్నారు. నల్లగొండను అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురి చేసిన ఘనత కోమటిరెడ్డి బ్రదర్స్‌కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మనుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మెన్ మందుల సామేలు, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ జడల అమరేందర్‌గౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొల్పుల అమరేందర్, రాష్ట్ర నాయకులు వంగాల వెంకన్నగౌడ్, జిల్లా నాయకులు నల్లమాస రమేష్‌గౌడ్, మున్సిపల్ చైర్మెన్ నువ్వుల ప్రసన్న, పట్టణాధ్యక్షుడు గోమారి సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ తోటకూరి వెంకటేశ్‌యాదవ్, జడ్పీటీసీ సందుల సుధాకర్, మాజీ ఎంపీపీలు అతికం లక్ష్మీనారాయణ, సుబ్బురు బీరుల మల్లయ్య, కేశవపట్నం రమేష్, టీజీఏ జిల్లా అధ్యక్షుడు చిక్కా ప్రభాకర్‌గౌడ్, ఆలేరు జడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మెన్ పంతులునాయక్, వైస్ చైర్మెన్ డాక్టర్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, మహిళా నేతలు సిద్దుల పద్మ, ఆకుల జయమ్మ, దుర్గాపతి చంద్రమ్మ, యాదగిరిగుట్ట మండల నాయకులు గొట్టిపర్తి బాలరాజుగౌడ్, ఆలేరు మండల అధ్యక్షుడు ఆకవరం మోహన్‌రావు, నక్కల చిరంజీవి, నల్లమాస రాజయ్యగౌడ్ పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...