ఓటుతోనే నవసమాజ నిర్మాణం..


Sat,March 23, 2019 12:46 AM

ప్రజాస్వామ్య దేశాల్లో ఓటు అనేది అత్యంత కీలకమైంది. ముఖ్యంగా అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశంలో ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మనం వేసే ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది. ప్రజాస్వామ్య దేశమైన మనదేశంలో ప్రజలే పరిపాలకులు. మనం వేసే ఓటు మన భవిష్యత్‌ను, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది.

- 125కోట్ల జనాభా కలిగిన మన దేశంలో సుమారు 100కోట్ల మంది ఓటర్లుంటే కేవలం 60-70 కోట్ల మంది లోపు ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మన దేశంలో పరిస్థితి ఇలా ఉంటే.. పలు దేశాల్లో మాత్రం ఓటు వేయడం తప్పనిసరి. లేనిచో చట్టబద్ధమైన చర్యలు కూడా తీసుకుంటారు. మన దేశంలో అనేక మంది ఓటింగ్ రోజును కేవలం సెలవు దినంగా మాత్రమే చూస్తారు. ఓటు ప్రాధాన్యత తెలుసుకోలేకపోతున్నారు. ఒకవేళ ఓటు వినియోగించుకున్నా డబ్బు, మద్యం ఇతర ప్రలోబాలకు లోబడి ఓటు వేస్తున్నారు. కానీ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది అత్యంత శక్తివంతమైనదిగా గుర్తించాలి. ప్రతి ఏటా భారత ఎన్నికల సంఘం జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవంగా నిర్వహిస్తుంది. నూతన ఓటర్లుగా 18ఏండ్లు నిండిన వారిని నమోదు చేయడం, ఓటు ప్రాధాన్యత తెలియజేసి ఎన్నో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

- ఓటు వేయడమంటే మనకు నచ్చిన వ్యక్తికి ఇష్టాన్ని, అభిప్రాయాన్ని తెలియజేయడం. ఇది స్వేచ్ఛగా వ్యక్తపరచడం. ఓటు అనే రెండు అక్షరాలకు ప్రపంచ గతిని మార్చే శక్తి ఉంది. వ్యవస్థ మార్పునకు నాంది పలుకుతుంది. ప్రజలు, ముఖ్యంగా యువత ఓటు విలువ తెలుసుకుని ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేసి నిజమైన, నికార్సయిన అభివృద్ధి చేసే వ్యక్తులను పరిపాలకులుగా ఎన్నుకోవాలి. కుల, మత, ప్రాంత పరంగా వ్యక్తులకు ఓట్లు వేయకూడదు. ఓటు విలువ తెలుసుకుని విజ్ఞతతో నడుచుకున్నప్పుడే నవసమాజం నిర్మితమవుతుంది. ఆ దిశగా అందరం ముందుకు సాగుదాం. నవసమాజ నిర్మాణంలో భాగస్వామ్యమవుదాం.

- తెలంగాణ రాష్ట్రంలో విద్యతోపాటు వ్యవసాయం , సామాజికంగా అన్నివర్గాల అభ్యున్నతి వేగంగా అభివృద్ధి చెందాయి. బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీల పిల్లల చదువులకు గురుకులాలను ఏర్పాటు చేసి టీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యాదానం చేయడం దేశంలోనే గర్వించదగిన విషయం.
- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి -స్కూల్ అసిస్టెంట్, రచయిత, నల్లగొండ,

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...