విజయమే లక్ష్యంగా...


Wed,March 20, 2019 11:42 PM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి నమస్తేతెలంగాణ: పార్లమెంట్ పోరులో విజయమే లక్ష్యంగా గులాబీ దళం దూకుడు పెంచింది. ఈసారీ అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఫలితాలు పునరావృతమయ్యేలా కసరత్తు చేస్తున్నది. భువనగిరి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకొనే దిశగా ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే భువనగిరి సభలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయగా... ప్రచార పర్వానికి గులాబీ సైన్యం సన్నద్ధమవుతున్నది. భువనగిరి సెగ్మెంట్ పరిధిలో సన్నాహక సభలు జరుగుతుండగా...పార్టీ నాయకత్వం మండలాల వారీగా కార్యకర్తల విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నది. ప్రచార సన్నద్ధత కోసం భేటీ అయిన ఎమ్మెల్యేల బృందం కార్యాచరణతో ముందుకువెళ్తున్నది. టీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిని ఇంటింటికీ వెళ్లి వివరించనుండగా....టీఆర్‌ఎస్ శ్రేణుల్లో జోష్ పెరుగుతున్నది. పార్లమెంట్ ఎన్నికల బరిలో టీఆర్‌ఎస్ దూకుడు పెంచేందుకు సన్నద్ధమవుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే అధిక మెజార్టీతో పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు.

గతంలో ఎప్పుడూ లేనంత మెజార్జీ కోసం...
పార్లమెంట్ నియోజకవర్గాల చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనంత మెజార్టీ సాధనే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో మండల స్థాయి కార్యకర్తల సమావేశాలతో పార్టీ నేతలు దూకుడు పెంచారు. భువనగిరి ఎంపీ పరిధిలోకి వచ్చే భువనగిరిలో టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేయడంతో కార్యకర్తల్లో నూతనోత్సాహం పెరిగింది. మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే ముఖ్య కార్యకర్తల సమావేశాలు పూర్తయ్యాయి. భువనగిరి ఎంపీ సెగ్మెంట్ పరిధిలో చేపట్టాల్సిన ప్రచార వ్యవహారాలపై మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డ్డి, గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, ముతిరెడ్డి యాదగిరిరెడ్డి భేటీ అయ్యారు. భువనగిరి అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ డాక్టర్ బూరనర్సయ్యగౌడ్‌ను ప్రకటించి ఈ మేరకు ప్రచారం చేసుకోవాల్సిందిగా ఆదేశించడంతో డాక్టర్ బూరను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని నిర్ణయించారు.

రెట్టింపు ఉత్సాహంతో...
గత అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్ అత్యధిక సీట్లు గెలుపొందింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు 9 స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమకార్యక్రమాలకు ఆకర్షితుడై పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌బలం 10కి చేరింది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి ఎదురు లేకుండా పోయింది. జిల్లాలో మొత్తం 401గ్రామపంచాయతీలకు 350 గ్రామపంచాయతీల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారులే కైవసం చేసుకున్నారు. ఇక వివిధ పార్టీల నుంచి గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు సైతం గ్రామాభివృద్ధి ఆకాంక్షిస్తూ గులాబీ పార్టీ గూటికి చేరుతున్నారు. ప్రస్తుతం దాదాపు 90 శాతం సర్పంచులు టీఆర్‌ఎస్ నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గ్రామాల్లో ప్రతిపక్షాలకు కనీసం క్యాడర్ కూడా కరువైంది. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు కనీసం పోటీ కూడా ఇచ్చే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి వారి నియోజకవర్గాల అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. టీడీపీ ప్రస్తుతం పూర్తిగా కనుమరుగైంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కేడర్ టీఆర్‌ఎస్‌లోకి వచ్చేసింది. ఇక రాష్ట్రంలో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు బీజేపీ ఒకే ఒక ఎమ్మెల్యే సీటు గెలుచుకున్నది.

కేటీఆర్ దిశానిర్దేశంతో జోరు...
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తీరుగానే లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే తమ కర్తవ్యమని గులాబీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. . ఈ నేపథ్యంలో నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాలను టీఆర్‌ఎస్ పార్టీ గెలుచుకోవడం నల్లేరుపై నడకే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే లోక్‌సభ ఎన్నికల్లోనూ జోరు చూపించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఈనెల 7వ తేదీన భువనగిరిలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో కేటీఆర్ ప్రసంగం పార్టీ శ్రేణుల్లో జోరును మరింత పెంచింది. కేంద్రంలో చక్రం తిప్పేందుకు రాష్ట్రం నుంచి 16 ఎంపీ సీట్లు గెలువడం ఎంత అవసరమో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ చెప్పిన తీరు ప్రజలకు బాగా అర్థమైంది. రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. మమతాబెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్ ఇన్నాళ్లు వారి వారి ప్రాంతాల్లో చేసుకున్న రైల్వే అభివృద్ధిని వివరిస్తుంటే మనకు జరిగిన అన్యాయాన్ని జనం తెలుసుకున్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు వేసిన కేసుల గురించి కూడా ఆయన ప్రజలకు వివరించారు. ఓవైపు ప్రాజెక్టులను అడ్డుకుంటూనే ఏమొహం పెట్టుకుని కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వస్తున్నారని టీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

అభివృద్ధిని వివరిస్తూ..
ఏ ఎన్నికలైనా...టీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే అండగా నిలుస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని ప్రజలు గమనిస్తున్నారు. గంధమల్ల, బస్వాపూర్ ప్రాజెక్టుల నిర్మాణానికి భారీగా నిధులు ఇచ్చిన విధానం, యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి రూ. 2000 కోట్లు ఖర్చు చేయడం దగ్గరనుంచి అనేక విషయాలను కేటీఆర్ వివరించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి 2. 5లక్షల ఎకరాలబీడుభూములను సస్యశ్యామలం చేసేందుకు టీఆర్‌ఎస్ సర్కారు కృషి చేస్తున్నది. ఇప్పటికే రైతుబంధు సాయంతో అన్నదాతలు పంట పెట్టుబడికి అండగా నిలిచిన సర్కారు...రైతు బీమాతో వారి కుంటుంబాలకు భరోసా కల్పించింది. రూ. 200 ఉన్న పింఛన్‌ను వెయ్యికి పెంచి ప్రస్తుతం రూ. 2,016 చేస్తున్నది. దివ్యాంగులకు రూ. 3.016 పింఛన్ అందించనున్న తొలి సర్కారు టీఆర్‌ఎస్‌దే కావడం విశేషం. మరోవైపు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింటి ఆడపిల్లలకు అండగా ఉంటుండగా... సర్కారు దవాఖానల్లో ఉచితంగా ప్రసవంతోపాటు రూ.13 వేలతో పాటు కేసీఆర్ కిట్లను అందిస్తున్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ శుద్ధజలం, మిషన్ కాకతీయతో చెరువుల పూడికతీత వంటి ఎన్నో కార్యక్రమాలు టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థుల గెలుపును సులభతరం చేయబోతున్నాయి. కంటి వెలుగు ద్వారా ఇప్పటికే రాష్ట్రంలోని అందరికీ ఉచిత కంటి పరీక్షలు చేసి అద్దాలు పంపిణీ చేయడంతోపాటు ఉచితంగా శస్త్రచికిత్సలు కూడా చేయిస్తున్నది. ఈ పథకం విజయవంతం కావడంతో త్వరలో డెంటల్, ఈఎన్‌టీ పరీక్షలు చేసేందుకు సిద్ధమవుతున్నది.

ప్రచారానికి సన్నద్ధమైన ఎమ్మెల్యేలు..
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలంతా నిర్ణయించారు. భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారపర్వాన్ని వేడెక్కించారు. ఇబ్రంహీంపట్నం, జనగామ, ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ప్రచారం ప్రారంభించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీ సాధించేందుకు నియోజకవర్గాల వారీగా ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో వారు సమాలోచన చేశారు. తమ తమ నియోజకవర్గాల్లో భారీ మెజార్టీ అందించి తమ ప్రత్యేకతను చాటుకునేందుకు ఎమ్మెల్యేలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భువనగిరి ఎంపీ అభ్యర్థికి అధిక మెజార్టీని అందించి జిల్లాకు మరింత గుర్తింపు తీసుకొచ్చేందుకు వీరంతా సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికీ గ్రామాలు, మండలాల వారీగా కార్యకర్తలను సన్నద్ధం చేశారు.

ఊపందుకున్న సమావేశాలు..
భువనగిరిలో కేటీఆర్ సన్నాహక సమావేశంతోనే ఎన్నికల ప్రచారం ఊపందుకున్నట్లుగా భావిస్తున్నారు. ఈ నెల 7న భువనగిరిలో సమావేశం అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే మండలాల్లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు కొనసాగుతున్నాయి. ఆలేరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశాలు పూర్తయ్యాయి. వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరుతుండంతో పార్టీ బలం రెట్టింపవుతున్నది. ఇంటింటికీ కార్యకర్తలు తిరిగి పార్టీకి ఓటేసేలా ప్రచారాన్ని ప్రారంభించాలని ఇప్పటికే మంత్రి జగదీశ్‌రెడ్డి క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో ఎటువంటి వివాదాలు లేకుండా ఉండేందుకు అంతా కలిసికట్టుగా కృషి చేస్తూనే ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో ఎంపీ సీటు గెలుపొందేందుకు క్యాడర్‌లో ఉత్సాహం నింపుతున్నారు.

భువనగిరి ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటాం..
సమైక్య పాలనలో దశాబ్దాలుగా జిల్లా కరువు కాటకాలతో కునారిల్లింది. వలసలతో భువనగిరి బిడ్డలు గోస పడ్డారు. ఈ సమస్యలన్నింటికీ చరమగీతం పాడాలంటే స్థానికంగానే ఉపాధి అవకాశాలు పెంపొందించాలి. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ప్రతిష్టాత్మక భువనగిరి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా సాధించాలి. దీంతోపాటు రాష్ర్టానికి, వెనుకబడిన భువనగిరి ప్రాంతానికి కేంద్రం నిధులు తీసుకురావాలంటే మనం కేంద్రంలో చక్ర తిప్పాలి.16 మంది ఎంపీలను ఢిల్లీకి పంపిస్తే కేంద్రం మెడలు వంచి అన్ని సాధించవచ్చు. ఈ విషయంపై ఎప్పటి నుంచో సీఎం కేసీఆర్ ఉదాహరణలతో సహ వివరిస్తున్నారు. కేంద్రంలో తెలంగాణ వాణి వినిపించేందుకు, రాష్ర్టానికి, భువనగిరికి అత్యధిక నిధులు తీసుకువచ్చేందుకు ఈ ఎన్నికలను ఓ వేదికగా మార్చుకోవాలి. పార్లమెంట్ ఎన్నికలకు అన్ని విధాలా సన్నద్ధమవుతున్నాం. ఇప్పటికే భువనగిరి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌లో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలో ప్రచారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే అంశంపై చర్చ కొనసాగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన సుమారు మూడు లక్షల మెజార్టీకి మించి ఈసారి మరింత మెజార్టీ సాధించాలని సన్నద్ధమవుతున్నాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ అభివృద్ధి పనులపై ఇప్పటికే జనం నుంచి విశేషమైన స్పందన ఉన్న నేపథ్యంలో...గతంలో ఏ పార్లమెంట్ ఎన్నికల్లో రానంత మెజార్టీతో ఈసారి భువనగిరి సీటును కైవసం చేసుకుంటాం. ఇంతకు ముందు ఎంపీలు కేంద్ర మంత్రలై బాగు పడ్డారు. కానీ మన బతుకులు మారలేదు. మన బతుకులు మార్చుకునేందుకు అత్యధిక మెజార్టీతో భువనగిరి ఎంపీ సీటును సాధిస్తాం. సీఎం కేసీఆర్‌కు గిప్టుగా అందిస్తాం.
- ఎంపీ బూరనర్సయ్యగౌడ్

16స్థానాలు గెలిపిస్తే.. నిధులు తెచ్చే బాధ్యత కేసీఆర్‌ది
16 ఎంపీ స్థానాలు గెలిపించే బాధ్యత ప్రజలది. ఆ తర్వాత ఎంపీలతో ఢిల్లీలో చక్రం తిప్పి, రాష్ర్టానికి రావాల్సిన నిధులను తీసుకువచ్చే బాధ్యత కేసీఆర్‌ది. ఇప్పటికే రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకుపోయిన కేసీఆర్ కేంద్రంలో సరైన పాత్ర పోషించి రాష్ర్టానికి ప్రయోజనం కలిగించేందుకు ఈ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో అంతకు మించిన ఓట్లు తెచ్చుకుంటది. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని భువనగిరి, నల్లగొండ ఎంపీ సీట్లు అత్యధిక మెజార్టీతో కైవసం చేసుకుంటాం. పార్టీ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికల స్ఫూర్తితో పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తాం. భువనగిరిలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే అన్ని మండలాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశాలు పూర్తి చేశాం. గ్రామాల వారీగా ఓటర్లపై సమీక్ష చేసేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు పనిచేస్తున్నారు. వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారికి కూడా తగిన ప్రాధాన్యం ఇస్తూ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇప్పటికే మండల స్థాయి నేతలు ప్రతి గ్రామంలో ఓ రోజు పల్లె నిద్ర చేసి అక్కడ పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించాం.
-గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...