టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్ నాయకుడు తడక రమేశ్?


Wed,March 20, 2019 11:40 PM

భూదాన్‌పోచంపల్లి: చేనేత నాయకుల్లో ముఖ్యుడు, పోచంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీలో గట్టి పట్టున్న నాయకుడైన తడక రమేశ్ టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే జిల్లాలో ఒక్కో నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో రమేశ్ చేరిక టీఆర్‌ఎస్ పార్టీకి మరింత బలం చేకూర్చనున్నదని చెప్పవచ్చు. చేనేత టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షుడిగా చేనేత వస్త్ర వ్యార రంగంలో పేరెన్నికైన రమేశ్ తోపాటు మరో వంద మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలతోపాటు పలువురు చేనేత అగ్ర వ్యాపారులు త్వరలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. ఇప్పటికే చేరికకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న నాయకులు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితోపాటు టీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సమక్షంలో చేరడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. భూదాన్‌పోచంపల్లి పట్టణం గత 30 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీకి కంచు కోటగా ఉండటమే కాకుండా అన్ని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ విజయబావుటా ఎగురవేసింది. కాగా ప్రస్తుతం మున్సిపాలిటీగా మారిన తరుణంలో రమేశ్ చేరిక ఇక టీఆర్‌ఎస్ పార్టీకి అన్ని విధాలుగా మేలు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పోచంపల్లి మున్సిపాలిటీని చేజిక్కించుకోవలనే కసితో ఉన్న టీఆర్‌ఎస్‌కు ఈ పరిస్థితి అనుకూలించడంతోపాటు రాబోవు ఎంపీ ఎన్నికల్లో కూడా పోచంపల్లి పట్టణంలో ఎక్కువ మెజారిటీ సాధించడానికి దోహదం చేస్తుందనే చెప్పవచ్చు. ఇక గత 15 ఏండ్లుగా పోచంపల్లి పట్టణంలో పట్టు ఉన్న నాయకుడిగా ఉన్న తడక వెంకటేశ్‌కు ప్రధాన అనుచరుడైన రమేశ్ టీఆర్‌ఎస్‌లో చేరితే కాంగ్రెస్ పార్టీ నుంచి గులాబీ పార్టీలోకి మరిన్ని వలసలు ఖాయమని పలువురు చర్చించుకుంటున్నారు. రమేశ్ తోపాటు తడక వెంకటేశం సైతం పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్నా ఇంకా ఆయన ఓ నిర్ణయానికి రానట్లు తెలిసింది. ఈ ఇద్దరు టీఆర్‌ఎస్ పార్టీలో చేరితే పోచంపల్లి పట్టణంలో సగానికి పైగా కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...